ఒలింపిక్ విజేతకు షాక్.. లవ్లీనా బోర్గోహైన్ ఎంపికపై కోర్టుకు వెళ్లిన మరో బాక్సర్...

By team teluguFirst Published Nov 10, 2021, 7:39 PM IST
Highlights

Lovlina Borgohein: వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో ఒలింపిక్ కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ ఎంపికను నిలిపేయాలని కోరుతూ మరో బాక్సర్, నేషనల్ ఛాంపియన్ అయిన అరుంధతి చౌదరి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ) నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్ వేసింది. 

ఆగస్టులో జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ కు ఊహించని షాక్ తగిలింది. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో ఆమె ఎంపికను నిలిపేయాలని  మరో బాక్సర్, నేషనల్ ఛాంపియన్ అయిన అరుంధతి చౌదరి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆమె బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ) నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. న్యాయస్థానం ఈ విషయాన్ని లిస్టింగ్ లో చేర్చింది. బుధవారం ఇందుకు సంబంధించిన విచారణ కూడా జరిగింది. 

అసలు విషయానికొస్తే.. వచ్చే నెల 4-18 మధ్య టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లో జరగాల్సి ఉన్న ప్రపంచ ఛాంపియన్షిప్స్ లో భాగంగా 70 కేజీల విభాగంలో బీఎఫ్ఐ.. లవ్లీనాను ఎంపిక చేసింది. అయితే ముందస్తుగా ఎలాంటి ట్రయల్స్ నిర్వహించుకుండానే లవ్లీనాను డైరెక్టుగా  ఎంపికచేశారనేది అరుంధతి ఆరోపణ.  ఒలింపిక్స్ ప్రదర్శన ఆధారంగా లవ్లీనాను ఎంపిక చేయడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.

అయితే దీనిపై బీఎఫ్ఐ స్పందించింది. ‘కోర్టు విచారణకు ఆదేశిస్తే అందుకు మేము సిద్ధంగా ఉన్నాం. నేషనల్స్ లో పాల్గొన్న బాక్సర్లందరికీ ఎంపిక ప్రక్రియ తెలుసు. లవ్లీనా ఒలింపిక్ ప్రదర్శనకు గౌరవంగా.. ఆమెను 70 కిలోల విభాగంలో పోటీకి ఎంపిక ప్రక్రియ జరిగింది. సెప్టెంబర్ లో జరిగిన ఎగ్జిక్యూటివ్ సమావేశంలో లవ్లీనా ఎంపికపై నిర్ణయం తీసుకున్నాం. ఆ సమావేశంలో అరుంధతి కూడా ఉంది. ఆ సమయంలో ఆమె.. లవ్లీనా ఎంపికపై అభ్యంతరం చెప్పలేదు..’ అని బీఎఫ్ఐ అధికారి ఒకరు తెలిపారు. 

అరుంధతి వాదన మరో విధంగా ఉంది. ఇదే విషయమై తాను ఫెడరేషన్ కు ఎన్ని లేఖలు రాసినా తనను పట్టించుకోలేదని కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొంది. 

ఇదిలాఉండగా.. టర్కీలో  కరోనా కేసుల కారణంగా ఈ టోర్నీ వచ్చే ఏడాది మార్చికి వాయిదా పడింది. వచ్చే వారం, పదిరోజుల్లో ఇందుకు సంబంధించిన కొత్త షెడ్యూలు కూడా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజా ఎంపిక విధానాన్ని రూపొందించనున్నట్టు బీఎఫ్ఐ వర్గాల సమాచారం. అయితే ఈ సెలెక్షన్ పాలసీ ఒక్క ప్రపంచ ఛాంపియన్షిప్ వరకేనని, తర్వాత పోటీలకు ఎప్పటిలాగే అర్హత పోటీలను నియమించి ఎంపిక చేస్తామని తెలిపాయి. అరుంధతి కోర్టుకు వెళ్లడం బాధాకరమని, ఆమెకూ అవకాశాలు మెండుగా వస్తాయని ఒక అధికారి తెలిపాడు. 

కాగా బుధవారం దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ న్యాయస్థానం.. ‘న్యాయం కోసం ఒక క్రీడాకారిణి కోర్టు మెట్లు ఎందుకెక్కాలి. ప్రపంచ ఛాంపియన్షిప్ లకు ఉత్తమ బాక్సర్ ను ఎంపిక చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల’ని  క్రీడా మంత్రిత్వ శాఖ ను సూచించింది. ఆటగాళ్ల ఎంపికలో న్యాయబద్ధంగా వ్యవహరించాలని తెలిపింది.

click me!