T20WC 2021 Semi-final 2: జమాన్, రిజ్వాన్ మెరుపులు... ఆస్ట్రేలియా ముందు భారీ టార్గెట్..

By Chinthakindhi RamuFirst Published Nov 11, 2021, 9:19 PM IST
Highlights

Pakistan vs Australia: నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 176 పరుగుల భారీ స్కోరు చేసిన పాకిస్తాన్... ఐదు క్యాచులను డ్రాప్ చేసిన ఆస్ట్రేలియా ఫీల్డర్లు...

టీ20 వరల్డ్‌కప్ 2021 ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి176 పరుగులు చేసింది. బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ కలిసి మరోసారి పాకిస్తాన్‌కి శుభారంభం అందించారు. తొలి వికెట్‌కి 71 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఈ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఈ ఇద్దరూ 400+ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం..

34 బంతుల్లో 5 ఫోర్లతో 39 పరుగులు చేసిన బాబర్ ఆజమ్, ఆడమ్ జంపా బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 పరుగులు చేసిన మహ్మద్ రిజ్వాన్, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

ఇన్నింగ్స్ మొదటి బంతికే రిజ్వాన్ ఇచ్చిన క్యాచ్‌ను వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ అందుకోలేకపోయాడు. ఆ తర్వాత డేవిడ్ వార్నర్‌తో పాటు ఆసీస్ ప్లేయర్లు క్యాచులు వదిలేయడంతో బాబర్ ఆజమ్, రిజ్వాన్‌లకు అవకాశాలు వచ్చినట్టైంది. 

Read: న్యూజిలాండ్ విజయం వెనక ఎమ్మెస్ ధోనీ... కెప్టెన్ కూల్ విన్నింగ్ ఫార్మాలాతోనూ కెప్టెన్ ఐస్...

ఆసిఫ్ ఆలీ తాను ఎదుర్కొన్న మొదటి బంతికే భారీ షాట్‌కి ప్రయత్నించి, స్టీవ్ స్మిత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికి ఫకార్ జమాన్ ఇచ్చిన క్యాచ్‌ను స్మిత్ జారవిడిచాడు. 20వ ఓవర్ రెండో బంతికి షోయబ్ మాలిక్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు మిచెల్ స్టార్క్. 

ఆసీస్ ఫీల్డర్లు ఇచ్చిన ఛాన్సులను చక్కగా వాడుకున్న ఫకార్ జమాన్, ఆఖరి ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 55 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు ఫకార్ జమాన్. 

వరుసగా ఆరో మ్యాచ్‌లోనూ జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండా బరిలో దిగింది పాకిస్తాన్. టీ20ల్లో వరుసగా ఆరు మ్యాచుల్లో ఒకే జట్టుతో బరిలో దిగిన మొట్టమొదటి జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది పాకిస్తాన్. 

ఒకే సీజన్‌లో 400+ భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనింగ్ జోడీగా నిలిచిన మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్... ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన రెండో ఓపెనింగ్ జోడీగా నిలిచారు. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్, మాజీ ఓపెనర్ షేన్ వాట్సన్ కలిసి నాలుగు టీ20 వరల్డ్‌ కప్ టోర్నీల్లో కలిపి 400+ భాగస్వామ్యం నెలకొల్పారు..

Read Also: త్వరలో టీ20లకు విరాట్ కోహ్లీ గుడ్‌బై, ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతూ... టీమిండియా కెప్టెన్‌పై పాక్ మాజీల...
ఆరు ఇన్నింగ్స్‌ల్లో 60.60 యావరేజ్‌తో 303 పరుగులు చేసిన బాబర్ ఆజమ్, 2014లో విరాట్ కోహ్లీ 319 పరుగులు, 2009లో తిలకరత్నే దిల్షాన్ 317 పరుగుల తర్వాత ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 

నాలుగో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, పాకిస్తాన్ ప్రస్తుత హెడ్ కోచ్ మాథ్యూ హేడెన్ 2007 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో చేసిన 265 పరుగుల రికార్డును అధిగమించాడు బాబర్ ఆజమ్. 

టీ20ల్లో 2500 పరుగుల మైలురాయిని అందుకున్న బాబర్ ఆజమ్, అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. విరాట్ కోహ్లీ 68 ఇన్నింగ్స్‌ల్లో 2500 టీ20 పరుగులు అందుకుంటే, బాబర్ ఆజమ్ 62 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు. 

ఈ దశలో టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్. కేవలం పొట్టి ఫార్మాట్‌లోనే అంతర్జాతీయ క్రికెట్‌లో వెయ్యి పరుగులు చేసిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు మహ్మద్ రిజ్వాన్.. 

ఇదే ఏడాది 826 పరుగులు చేసిన అతని పార్టనర్ బాబర్ ఆజమ్ రెండో స్థానంలో ఉండగా, 2019లో పాల్ స్టిర్లింగ్ చేసిన 748 అంతర్జాతీయ టీ20 పరుగులే ఇప్పటిదాకా అత్యుత్తమ ప్రదర్శనగా ఉండేది..

ఈ మ్యాచ్‌లో 2 వికెట్లు తీసిన మిచెల్ స్టార్క్, టీ20 వరల్డ్‌ కప్ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన ఆసీస్ బౌలర్‌గా నిలిచాడు. షేన్ వాట్సన్ 22 వికెట్లు తీయగా, మిచెల్ స్టార్ 24 వికెట్లకు చేరుకున్నాడు. మిచెల్ జాన్సన్ 20 వికెట్లు తీయగా, రెండో టోర్నీ ఆడుతున్న ఆడమ్ జంపా ఇప్పటికే 17 వికెట్లతో టాప్ 4లో ఉండడం విశేషం. 

click me!