T20 World Cup: బిగ్ ఫైట్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. పాకిస్థాన్ కు కష్టాలు తప్పవా..?

By team teluguFirst Published Nov 11, 2021, 7:11 PM IST
Highlights

Pakistan Vs Australia: ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ టోర్నీలో అపజయమెరుగని పాకిస్థాన్..  ప్రపంచకప్ రెండో సెమీస్ లో భాగంగా ఆస్ట్రేలియాను ఢీకొంటున్నది. 

అంచనాలేమీ లేకుండా టీ20 ప్రపంచకప్ (T20 World cup) లో అడుగుపెట్టిన పాకిస్థాన్ (pakistan) జట్టు.. నేడు మరో కీలక పోరుకు సిద్ధమైంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్  రెండో  సెమీస్ లో ఆ జట్టు ఆస్ట్రేలియా (Australia)ను ఢీకొంటున్నది. బుధవారం ఇంగ్లాండ్-న్యూజిలాండ్ (Eng Vs NZ) మ్యాచ్ మాదిరే.. ఆస్ట్రేలియా-పాకిస్థాన్ (Australia Vs Pakistan) మ్యాచ్ కూడా రసవత్తరంగా సాగనున్నది.  కాగా.. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆరోన్ ఫించ్ (AAron Finch) సారథ్యంలోని ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బాబర్ ఆజమ్ (Babar Azam) నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ చేయనున్నది. ఇరు జట్లలో మార్పులేమీ లేవు. 

దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ పోరు ఇరు జట్లకూ కీలకం. ఈ టోర్నీలో ఇప్పటివరకు పాకిస్థాన్ ఆడిన ఐదు మ్యాచులలో గెలిచింది. అపజయమెరుగని జట్టుగా పాక్.. ఈ మ్యాచ్ లో ఫేవరేట్ గా బరిలోకి దిగుతున్నది. ఇక గ్రూప్ దశలో ఇంగ్లాండ్ చేతిలో పరాజయం మినహా.. ఆసీస్ కూడా అదరగొట్టింది. బలాబలాల విషయంలో ఇరు జట్లు సమానంగా ఉన్నాయి.  అయితే మొగ్గు మాత్రం పాకిస్థాన్ వైపే ఉండటం గమనార్హం. 

పాకిస్థాన్ బ్యాటింగ్ లో బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్, షోయబ్ మాలిక్, హఫీజ్, అలీ ల ఆటే కీలకం. మిచెల్ స్టార్క్ సారథ్యంలోని ఆసీస్ పేస్ విభాగాన్ని  పాక్ బ్యాటర్లు ఎలా ఎదుర్కోనున్నారనేది ఆసక్తికరంగా మారింది. బాబర్, రిజ్వాన్ నిలదొక్కుకుంటే ఆసీస్ కు ఇబ్బందులు తప్పవు. ముందు నెమ్మదిగా ఇన్నింగ్స్ ను నిర్మించి తర్వాత విజృంభించడం వీళ్ల స్టైల్. మరి ఆసీస్ బౌలర్లు వీరిని ఎలా కట్టడి చేస్తారన్నది ఆసక్తికరం. 

ఇక పాక్ బౌలింగ్ కూడా దుర్బేధ్యంగానే ఉంది. కొత్త కుర్రాడు షహీన్ షా అఫ్రిది తన స్వింగ్ తో ఆసీస్  ఓపెనర్లను ఏ మేరకు కట్టడి చేస్తాడో చూడాలి. ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే హిట్టింగ్ కు దిగే ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్ లను అతడు, రవుఫ్  ఎలా కట్టడి చేస్తారో చూడాలి. ఆసీస్ వన్ డౌన్  బ్యాటర్ షాన్ మార్ష్ కూడా ఫామ్ లోనే ఉన్నాడు.  స్మిత్ నిలకడగా ఆడుతుండగా..  మ్యాక్స్వెల్ భారీ ఇన్నింగ్స్ బాకీ పడ్డాడు. పాక్ స్పిన్నర్లను వీళ్లు ఎలా ఎదుర్కుంటారనేది ఆసక్తిగా మారింది. 

ఇదిలాఉండగా.. నిన్నటి దాకా జ్వరంతో ఇబ్బంది పడ్డ మహ్మద్ రిజ్వాన్, షోయబ్ మాలిక్  లు  మ్యాచ్ ఆడుతారో లేదో అనే సందేహం పాక్ అభిమానులను కలవరపెట్టింది. అయితే కొద్దిసేపటికే పాక్ క్రికెట్ బోర్డు ఈవిషయంపై క్లారిటీ ఇచ్చింది. రిజ్వాన్, మాలిక్  లు ఫిట్ గా ఉన్నారని, ఆసీస్ తో మ్యాచ్ ఆడతారని స్పష్టం చేసింది. దీంతో పాక్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 

ఇక పాకిస్థాన్-ఆస్ట్రేలియా మధ్య ఇప్పటివరకు 23 టీ20లు జరుగగా.. అందులో పాక్ దే ఆధిపత్యం. పాకిస్థాన్ 12 మ్యాచులు గెలువగా.. ఆసీస్ 9 గెలిచింది. ఒకటి టై కాగా.. ఒకదాంట్లో ఫలితం తేలలేదు. ఇదిలాఉండగా.. యూఏఈలో పాకిస్థాన్ వరుసగా 16 మ్యాచులు గెలిచింది. చివరగా ఆ జట్టు 2015 నవంబరులో మాత్రమే ఓడింది. అయితే.. 2010 టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ పై జరిగిన మ్యాచ్ లో  ఆసీస్ దే విజయం. అంతేగాక అంతకుముందు వన్డే ప్రపంచకప్ లో కూడా పాక్ పై కంగారూలదే పైచేయి. ఐసీసీ నాకౌట్ ఈవెంట్లలో పాక్ పై ఆసీస్ ఎప్పుడూ తలవంచలేదు. 

జట్లు:

ఆస్ట్రేలియా: డేవిడ్  వార్నర్, ఆరోన్ ఫించ్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, పాట్ కమిన్స్, స్టార్క్, జంపా, హెజిల్వుడ్

పాకిస్థాన్: బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, ఫకర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, అసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం, హసన్ అలీ, హరిస్ రౌఫ్, షహీన్ అఫ్రిది 

click me!