T20 Worldcup 2021: టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ... శార్దూల్ ఠాకూర్ స్థానంలో...

By Chinthakindhi RamuFirst Published Nov 5, 2021, 7:08 PM IST
Highlights

T20 Worldcup 2021: వరుసగా మూడు మ్యాచుల్లో టాస్ ఓడిన తర్వాత.... స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విరాట్ కోహ్లీ...

టీ20 వరల్డ్‌కప్‌ 2021 టోర్నీలో విరాట్ కోహ్లీ ఎట్టకేలకు టాస్ గెలిచాడు.  పాకిస్తాన్, న్యూజిలాండ్‌, ఆఫ్ఘాన్‌లతో మ్యాచ్‌లలో టాస్ ఓడిన విరాట్ కోహ్లీ, ఓవరాల్‌గా వరుసగా ఆరు టాస్ ఓటముల తర్వాత టాస్ గెలిచాడు. టాస్ గెలిచిన తర్వాత తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. స్కాట్లాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది.  

గత మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూసే అవకాశం అభిమానులకు దక్కలేదు. అయితే నేటి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూడాలని కోరుకుంటున్నారు అభిమానులు. నేడు 33వ పుట్టినరోజు జరుపుకుంటున్న విరాట్ కోహ్లీ, ఓ అద్భుత ఇన్నింగ్స్‌తో అభిమానులకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని ఆశపడుతున్నారు...

Read: ఒకే రకమైన పొజిషన్‌లో టీమిండియా, విండీస్‌... టీ20ల్లో వెస్టిండీస్ పతనానికి కారణమేంటి...

2007 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో తొలిసారి స్కాట్లాండ్‌తో తలబడింది భారత జట్టు. గ్రూప్ డీలో సెప్టెంబర్ 13, 2007న జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యింది., ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచిన స్కాట్లాండ్, బౌలింగ్ ఎంచుకున్నా, వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు... దీంతో స్కాట్లాండ్, ఇండియా మధ్య ఇదే మొట్టమొదటి టీ20 మ్యాచ్ కానుంది...

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ జట్టు 16 పరుగుల తేడాతో ఓడింది. భారీ స్కోరింగ్ గేమ్‌లో న్యూజిలాండ్ టాప్ క్లాస్ బౌలింగ్ అటాక్‌ను ఎదుర్కొంటూ స్కాట్లాండ్ చూపించిన పోరాటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎక్స్‌ట్రాల రూపంలో 20 పరుగులు సమర్పించింది స్కాట్లాండ్. ఈ ఎక్స్‌ట్రాలను నియంత్రించి ఉంటే, 16 పరుగుల తేడాతో ఓడిన స్కాట్లాండ్‌కి విజయం దక్కి ఉండేదే...  

స్కాట్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఒక మార్పుతో బరిలో దిగుతోంది భారత జట్టు. గత మ్యాచ్‌లో గాయం కారణంగా బరిలో దిగని వరుణ్ చక్రవర్తి, నేటి మ్యాచ్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. శార్దూల్ ఠాకూర్ స్థానంలో వరుణ్ చక్రవర్తికి అవకావం ఇచ్చింది భారత జట్టు. స్కాట్లాండ్ జట్టు ఎలాంటి మార్పులు లేకుండా న్యూజిలాండ్‌తో ఆడిన జట్టుతోనే బరిలో దిగుతోంది...

తొలుత బౌలింగ్ చేస్తుండడంతో పాయింట్ల పట్టికలో టాప్ 3కి వెళ్లాలంటే నేటి మ్యాచ్‌లో స్కాట్లాండ్ విధించే టార్గెట్‌ను 7.4 ఓవర్లలో ఛేదించాల్సి ఉండేది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని ఉంటే, టీమిండియా భారీ స్కోరు చేసి, స్కాట్లాండ్‌ను 56+ పరుగుల తేడాతో ఓడించి ఉంటే సరిపోయేది... హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్‌లపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పేందుకు ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో వారిని బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోట్ చేసిన టీమిండియా, భారత బౌలర్లపై వస్తున్న విమర్శలకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు తొలుత బౌలింగ్ ఎంచుకున్నట్టు తెలుస్తోంది.

Read also: రోహిత్ శర్మ కాదు, అతనికే టీమిండియా టీ20 కెప్టెన్సీ... ఏ మాత్రం కెప్టెన్సీ స్కిల్స్‌ లేని వ్యక్తికి...

భారత జట్టు: రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ( కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ

స్కాట్లాండ్ జట్టు:  కేల్ కోట్జర్ (కెప్టెన్), మాథ్యూ క్రాస్ (వికెట్ కీపర్), రిచీ బెర్రింగ్టన్, కలమ్ మెక్‌లార్డ్, మైకెల్ లీస్క్, క్రిస్ గ్రీవ్స్, మార్క్ వ్యాట్, సఫ్యాన్ షరీఫ్, అలాస్‌దెర్క ఇవాన్స్, బ్రాడ్లీ వీల్  

click me!