T20 worldcup 2021: లంక ఓపెనర్ నిశ్శంక ఒంటరిపోరాటం... సౌతాఫ్రికా ముందు ఈజీ టార్గెట్...

By Chinthakindhi RamuFirst Published Oct 30, 2021, 5:13 PM IST
Highlights

T20 worldcup 2021: 20 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌట్ అయిన శ్రీలంక... 72 పరుగులు చేసిన లంక ఓపెనర్ పథుమ్ నిశ్శంక..

టీ20 వరల్డ్‌కప్ 2021  టోర్నీ సూపర్ 12 రౌండ్‌లో సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 142 పరుగుల స్కోరుకు ఆలౌట్ అయ్యింది. సౌతాఫ్రికా, శ్రీలంక జట్లు సూపర్ 12లో ఇప్పటిదాకా రెండేసి మ్యాచులాడి ఒక్కో విజయాన్ని నమోదుచేసుకున్నాయి. దీంతో ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంటుంది...

10 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసిన కుశాల్ పెరేరాని నోకియా క్లీన్ బౌల్డ్ చేశాడు. 20 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది లంక జట్టు. చరిత్ అసలం, పతుమ్ నిశ్శంక కలిసి రెండో వికెట్‌కి 41 పరుగుల భాగస్వామ్యం జోడించి ఆదుకునే ప్రయత్నం చేశారు. 14 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేసిన అసలంక రనౌట్ కావడంతో 61 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది లంక.

Latest Videos

must Read: ఇలా అయితే ఆ జట్లకి స్టార్ క్రికెటర్లు ఎలా దొరుకుతారు... ఐపీఎల్ 2022 రిటెన్షన్ పాలసీపై ఆకాశ్ చోప్రా...

ఆ తర్వాత భనుక రాజపక్సేని డకౌట్ చేసిన షంసీ, 5 బంతుల్లో 3 పరుగులు చేసిన ఆవిష్క ఫెర్నాండోను కూడా పెవిలియన్ చేర్చారు. ఈ ఇద్దరూ షంసీ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ కావడం మరో విశేషం.. ఈ ఏడాది టీ20ల్లో 32 వికెట్లు తీసిన షంసీ, ఒకే ఏడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. 5 బంతుల్లో 4 పరుగులు చేసిన వానిందు హసరంగ, షంసీ బౌలింగ్‌లోనే మార్క్‌రమ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 

కెప్టెన్ దసున్ శనక 12 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు చేసి పెట్రోరియస్ బౌలింగ్‌లో రబాడాకి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా చమీర కరుణ రత్నే కూడా పెట్రోరియస్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
ఓ వైపు వికెట్లు పడుతున్నా దూకుడుగా బ్యాటింగ్ కొనసాగించిన ఓపెనర్ పథుమ్ నిశ్శంక, రబాడా వేసిన 18వ ఓవర్‌లో ఓ సిక్స్, రెండు ఫోర్లతో 17 పరుగులు రాబట్టాడు.

అయితే పెట్రోరియిస్ వేసిన ఆ తర్వాతి ఓవర్‌లో 58 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 72 పరుగులు చేసిన నిశ్శంక, భారీ షాట్‌కి ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. ఛమీరా 3 పరుగులు చేసి నోకియా బౌలింగ్‌లో బౌల్డ్ కాగా తీక్షణ మాత్రం 7 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి కుమార రనౌట్ కావడంతో 142 పరుగులకి ఆలౌట్ అయ్యింది శ్రీలంక...

ఇదీ చదవండి: వెన్నెముక లేని వెధవలు, మతం పేరుతో దూషిస్తారా... మహ్మద్ షమీపై వచ్చిన ట్రోల్స్‌పై విరాట్ కోహ్లీ ఫైర్...

సౌతాఫ్రికా బౌలర్లలో డ్వైన్ పెట్రోరియస్ 3 ఓవర్లలో 17 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, తబ్రేజ్ షంసీ 4 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. నోకియా 4 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. కగిసో రబాడా 3 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి అందరి కంటే ఎక్కువ ఎకానమీతో పరుగులు సమర్పించడం విశేషం. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు ప్లేఆఫ్ రేసు నుంచి దాదాపు తప్పుకోనుంది. గ్రూప్ 1లో ఉన్న బంగ్లాదేశ్ ఇప్పటికే మొదటి మూడు మ్యాచుల్లో ఓడి, ప్లేఆఫ్ రేసు నుంచి నిష్కమించింది.

click me!