T20 Worldcup 2021: ఆఫ్ఘాన్‌ను ఆదుకున్న నయిబ్, నబీ... పాకిస్తాన్ ముందు ఊరించే టార్గెట్...

By Chinthakindhi RamuFirst Published Oct 29, 2021, 9:20 PM IST
Highlights

టీ20 వరల్డ్‌కప్ 2021: ఒకానొక దశలో 76 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘాన్.. ఏడో వికెట్‌కి 71 పరుగులు జోడించి ఆఫ్ఘాన్‌ను ఆదుకున్న నయిబ్, మహ్మద్ నబీ...

టీ20 వరల్డ్‌కప్ 2021  టోర్నీలో పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్‌మెన్ ఆత్రం స్పష్టంగా తేటతెల్లమైంది. వచ్చిన బ్యాట్స్‌మెన్ వచ్చినట్టు భారీ షాట్స్ ఆడాలని ప్రయత్నించి అవుట్ కావడంతో ఒకానొక దశలో 76 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది ఆఫ్ఘాన్..

అయితే ఆ తర్వాత నయిబ్, మహ్మద్ నబీ ఇన్నింగ్స్‌ల కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది ఆఫ్ఘనిస్తాన్... ఛేదనలో వరుసగా రెండు విజయాలు అందుకున్న పాకిస్తాన్‌పై టాస్ గెలిచి కూడా తొలుత బ్యాటింగ్ ఎంచుకుని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు ఆఫ్ఘాన్ కెప్టెన్ మహ్మద్ నబీ.

Latest Videos

అయితే నబీ నిర్ణయం ఏ మాత్రం కరెక్ట్ కాదని, మొదటి ఓవర్‌లోనే వికెట్ పారేసుకుని తెలియచేశారు ఆఫ్ఘాన్ బ్యాట్స్‌మెన్... 5 బంతుల్లో పరుగులేమీ చేయలేకపోయిన హజ్రతుల్లా జిజాయి, ఇమాద్ వసీం బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. 7 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఆఫ్ఘాన్...

9 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసిన మహ్మద్ షాబజ్, షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి బాబర్ ఆజమ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది ఆఫ్ఘాన్.  ఈ దశలో అస్గర్ ఆఫ్ఘాన్, రహ్మనుల్లా కలిసి మూడో వికెట్‌కి 20 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 7 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 10 పరుగులు చేసిన అస్గర్ ఆఫ్ఘాన్, హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

Read also: టాస్ గెలవడమే అదృష్టం... అలాంటిది టాస్ గెలిచి కూడా ఆఫ్ఘాన్ ఇలాంటి నిర్ణయమా...

ఆ తర్వాత 7 బంతుల్లో ఓ సిక్సర్‌తో 10 పరుగులు చేసిన రహ్మనుల్లా కూడా హసన్ ఆలీ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి బాబర్ ఆజమ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా బ్యాట్స్‌మెన్ దూకుడు మాత్రం తగ్గించలేదు. 17 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 15 పరుగులు చేసిన కరీం జనత్, ఇమాద్ వసీం బౌలింగ్‌లో ఫకార్ జమాన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

64 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది ఆఫ్ఘనిస్తాన్... 21 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేసిన జద్రాన్, షాదబ్ ఖాన్ బౌలింగ్‌లో కీపర్ రిజ్వాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 17 ఓవర్లు ముగిసేసరికి 104/6 పరుగులు మాత్రమే చేసింది ఆఫ్ఘాన్. అయితే హసన్ ఆలీ వేసిన 18వ ఓవర్‌లో ఓ సిక్స్, రెండు ఫోర్లతో 21 పరుగులు రాబట్టాడు నయిబ్. ఆ తర్వాతి ఓవర్‌లో నబీ రెండు ఫోర్లు బాదగా, నయిబ్ ఓ ఫోర్ బాదడంతో 15 పరుగులు వచ్చాయి. 

Read also: ముంబై ఇండియన్స్‌లోకి కెఎల్ రాహుల్... పంజాబ్ కింగ్స్‌ కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా... ఐపీఎల్ 2022 సీజన్‌లో...

ఈ దశలో 45 బంతుల్లో 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన గుల్బాదిన్ నయిబ్, మహ్మద్ నబీ ఆఫ్ఘాన్‌ను ఆదుకున్నారు. మహ్మద్ నబీ 32 బంతుల్లో 5 ఫోర్లతో 35 పరుగులు చేయగా 25 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 35 పరుగులు చేశాడు నయిబ్...
 
టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో టాస్ గెలిచిన జట్లు, మరో ఆలోచన లేకుండా తొలుత ఫీల్డింగ్ చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా ఇప్పటిదాకా జరిగిన మెజారిటీ మ్యాచుల్లో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లు విజయాలను అందుకున్నాయి.  

టీ20 వరల్డ్‌కప్ 2021 సూపర్ 12 రౌండ్‌లో ఇప్పటిదాకా జరిగిన 11 మ్యాచుల్లో 9సార్లు రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయం దక్కింది. యూఏఈలోని పిచ్‌లు తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకి పెద్దగా సహకరించకపోవడం, సెకండ్ ఇన్నింగ్స్ సమయానికి పిచ్ మీద తేమ, వాతావరణం బ్యాట్స్‌మెన్‌కి స్వర్గధామంగా మారుతున్నాయి. 

ఈ కారణంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌తో పాటు పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ వంటి మ్యాచుల్లో కూడా టాస్ కీలక పాత్ర పోషించింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టుకే ఛేదనలో విజయం దక్కింది. అలాంటి పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు, తొలుత బ్యాటింగ్ ఎంచుకుని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.  

click me!