T20 Worldcup 2021: శ్రీలంకకు రెండో విజయం... వెస్టిండీస్ కూడా ప్లేఆఫ్స్ రేసు నుంచి అవుట్...

By Chinthakindhi RamuFirst Published Nov 4, 2021, 11:22 PM IST
Highlights

T20 Worldcup 2021: సూపర్ 12 రౌండ్‌లో రెండో విజయంతో టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీని ముగించిన శ్రీలంక... మూడో పరాజయంతో ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న వెస్టిండీస్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ సూపర్ 12 రౌండ్‌లో శ్రీలంక జట్టు రెండో విజయంతో ముగించింది శ్రీలంక జట్టు. డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో  విజయాన్ని అందుకుంది లంక. సూపర్ 12 రౌండ్‌లో మూడో పరాజయాన్ని చవిచూసిన వెస్టిండీస్ కూడా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్కమించింది. దీంతో గ్రూప్ 1 నుంచి ఇంగ్లాండ్ ఇప్పటికే సెమీస్ చేరగా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల మధ్య మరో ప్లేస్ కోసం పోటీ జరగనుంది. 

190 పరుగుల భారీ టార్గెట్‌తో ఇన్నింగ్స్ మొదలెట్టిన వెస్టిండీస్‌కి శుభారంభం దక్కలేదు. క్రిస్ గేల్ 1 పరుగు చేసి ఫెర్నాండో బౌలింగ్‌లో అవుట్ కాగా, ఎవిన్ లూయిస్ 8 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. రోస్టన్ ఛేజ్ 9 పరుగులు చేసి అవుట్ కావడంతో 47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది విండీస్.

నికోసల్ పూరన్ 34 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్లతో 46 పరుగులు చేయగా, కిరన్ పోలార్డ్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఆండ్రే రస్సెల్ 2, జాసన్ హోల్డర్ 8, డ్వేన్ బ్రావో 2 పరుగులు చేసి పెవిలియన్ చేరగా ఓ వైపు వికెట్లు పడుతున్న సిమ్రన్ హెట్మయర్ మాత్రం 54 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 81 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు...

ఆఖరి రెండు ఓవర్లలో 52 పరుగులు కావాల్సిన దశలో కరుణరత్నే వేసిన 19వ ఓవర్‌లో 18 పరుగులు వచ్చాయి. ఆఖరి ఓవర్‌లో విజయానికి 34 పరుగులు కావాల్సి రాగా... 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు ఛమీర. దీంతో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులకి పరిమతమైంది విండీస్.


అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లంక జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 3  వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది... శ్రీలంక ఓపెనర్లు కుశాల్ పెరేరా, పథుమ్ నిశ్శంక కలిసి మొదటి వికెట్‌కి 42 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 21 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 29 పరుగులు చేసిన కుశాల్ పెరేరా, ఆండ్రే రస్సెల్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 

ఆ తర్వాత పథుమ్ నిశ్శంక, చరిత్ అసలంక కలిసి రెండో వికెట్‌కి 91 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 41 బంతుల్లో 5 ఫోర్లతో 51 పరుగులు చేసిన ఓపెనర్ పథుమ్ నిశ్శంక 51 పరుగులు చేసి బ్రావో బౌలింగ్‌లో హట్మయర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

చరిత్ అసలంక, కెప్టెన్ దసున్ శనక కలిసి మూడో వికెట్‌కి 66 పరుగుల భాగస్వామ్యం అందించారు. 41 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 68 పరుగులు చేసిన చరిత్ అసలంక, ఆండ్రే రస్సెల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి, హెట్మయర్‌ పట్టిన అద్భుత క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు...

వెస్టిండీస్ బౌలర్లు జాసన్ హోల్డర్ వేసిన 17వ ఓవర్‌లో 16 పరుగులు, ఆ తర్వాత డ్వేన్ బ్రావో వేసిన 18వ ఓవర్‌లో 17 పరుగులు రాబట్టారు లంక బ్యాట్స్‌మెన్... టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో  ఇది మూడో అత్యధిక స్కోరు. ఇంతకుముందు ఇండియా, ఆఫ్ఘాన్‌పై 210 పరుగుల స్కోరు చేయగా, స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 190 పరుగులు చేసింది. కెప్టెన్ దసున్ శనక 14 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేయగా, చరిత్ కరుణరత్నే 3 బంతుల్లో 3 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో 231 పరుగులు పూర్తి చేసుకున్న చరిత్ అసలంక, అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా టాప్‌లో నిలిచాడు. లంక ఓపెనర్ పథుమ్ నిశ్శంక 221 పరుగులతో రెండో స్థానంలో ఉండగా, జోస్ బట్లర్ 214, పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 199 పరుగులతో టాప్ 4 ఉండగా, పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 198 పరుగులు చేసి టాప్ 5లో ఉన్నాడు. 

click me!