T20 Worldcup 2021: హ్యాట్రిక్ తీసిన రబాడా... అయినా సెమీస్‌కి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా...

By Chinthakindhi RamuFirst Published Nov 6, 2021, 11:20 PM IST
Highlights

ఆఖరి ఓవర్‌లో రబాడా హ్యాట్రిక్... ఇంగ్లాండ్‌ను స్వల్ప స్కోరుకి కట్టడి చేయడంలో విఫలమైన సఫారీ బౌలర్లు.. నెట్‌ రన్ రేట్ ఆధారంగా సెమీస్ చేరిన ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా... 

టీ20 వరల్డ్‌కప్ 2021 సూపర్ 12 గ్రూప్ 1 నుంచి సెమీ ఫైనల్ బెర్తులు కన్ఫార్మ్ అయిపోయాయి. వరుస నాలుగు విజయాలతో దూసుకొచ్చిన ఇంగ్లాండ్, వెస్టిండీస్‌పై అద్భుత విజయం అందుకున్న ఆస్ట్రేలియా జట్లు మెరుగైన రన్‌రేట్ కారణంగా ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్నాయి. రబాడా హ్యాట్రిక్ తీసినా, బ్యాట్స్‌మెన్ భారీ స్కోరు చేసినా... సౌతాఫ్రికా జట్టుకి విజయాన్ని మాత్రమే అందించగలిగారు, సెమీస్ మాత్రం చేర్చలేకపోయారు...  అసలే మాత్రం అంచనాలు లేకుండా టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీని ప్రారంభించిన సౌతాఫ్రికా జట్టు, 5 మ్యాచుల్లో నాలుగు విజయాలు అందుకున్నా నెట్ రన్‌రేట్ తక్కువగా ఉండడంతో సెమీ ఫైనల్‌కి అర్హత సాధించలేకోయింది. 

సౌతాఫ్రికా విధించిన 190 పరుగుల లక్ష్యఛేదనలో ఐదో ఓవర్‌లో ఇంగ్లాండ్‌కి తొలి షాక్ తగిలింది. ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన ఓపెనర్ జాసన్ రాయ్, బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తొడ కండరాలు పట్టేయడంతో పెవిలియన్ చేరారు. నడవడానికి కూడా తెగ ఇబ్బందిపడిన జాసన్ రాయ్, నొప్పితో విలవిలలాడడం కనిపించింది..

15 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 26 పరుగులు చేసిన జోస్ బట్లర్, నోకియా బౌలింగ్‌లో భువమాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే బెయిర్‌స్టోని షంసీ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు. దీంతో 59 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్. ఈ దశలో మొయిన్ ఆలీ, డేవిడ్ మలాన్ కలిసి మూడో వికెట్‌కి 51 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు చేసిన మొయిన్ ఆలీ కూడా షంసీ బౌలింగ్‌లో డేవిడ్ మిల్లర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 

రబాడా వేసిన 16వ ఓవర్‌లో వరుసగా హ్యాట్రిక్ సిక్సర్లు బాదిన లియామ్ లివింగ్‌స్టోన్, ఇంగ్లాండ్ స్కోరును 140+ దాటించాడు. దీంతో సౌతాఫ్రికా జట్టు ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారంగా తప్పుకుంది. డేవిడ్ మలాన్ 26 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేసిన ప్రెటోరియస్ బౌలింగ్‌లో రబాడాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

12 బంతుల్లో 25 పరుగులు కావాల్సిన దశలో మొదటి బంతికే లివింగ్‌స్టోన్ అవుట్ అయ్యాడు. 17 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 28 పరుగులు చేసిన లివింగ్‌స్టోన్, ప్రెటోరియాస్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. ఆ ఓవర్‌లో క్రిస్ వోక్స్ సిక్స్ కొట్టడంతో 11 పరుగులు వచ్చాయి. ఆఖరి ఓవర్‌లో విజయానికి 14 పరుగులు కావాల్సిన దశలో మొదటి బంతికి క్రిస్ వోక్స్ అవుట్ అయ్యాడు. 

ఆ తర్వాతి బంతికి ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా మహరాజ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.   ఆ తర్వాతి బంతికి జోర్డాన్ కూడా భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ కావడంతో రబాడాకి హ్యాట్రిక్ దక్కింది. రబాడాకి ఇది టీ20ల్లో మొదటి హ్యాట్రిక్ కాగా, ఈ టీ20 వరల్డ్‌కప్‌లో ఓవరాల్‌గా మూడో హ్యాట్రిక్... 2007 టీ20 వరల్డ్‌కప్‌లో బ్రెట్ లీ తర్వాత మిగిలిన టోర్నీల్లో ఒక్క హ్యాట్రిక్ కూడా నమోదుకాకపోగా, ఈసారి ఇప్పటికే మూడు హ్యాట్రిక్స్ నమోదుకావడం విశేషం. 

ఆఖరి ఓవర్‌లో 3 పరుగులు మాత్రమే ఇచ్చిన రబాడా, మూడు వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ జట్టు 10 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అయినా నెట్ రన్ రేట్ కారణంగా ప్లేఆఫ్స్‌కి దూసుకెళ్లింది.

click me!