T20 Worldcup 2021: ఫైనల్ చేరిన న్యూజిలాండ్... ఎట్టకేలకు ఇంగ్లాండ్‌పై ప్రతీకారం తీర్చుకున్న కివీస్...

By Chinthakindhi RamuFirst Published Nov 10, 2021, 11:05 PM IST
Highlights

T20 Worldcup 2021: ఇంగ్లాండ్ విధించిన లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించిన న్యూజిలాండ్... పొట్టి ప్రపంచకప్ టోర్నీలో తొలిసారి ఫైనల్ చేరిన కివీస్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో గ్రూప్ మ్యాచులు ఇవ్వని మజా, మొదట సెమీ ఫైనల్‌ ఇచ్చింది. చేతులు మారుతూ దాదాపు ఆఖరి ఓవర్ ఉత్కంఠభరితంగా సాగిన మొదటి సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్న న్యూజిలాండ్, 2021 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఫైనల్‌కి దూసుకెళ్లింది. పొట్టి ప్రపంచకప్ ఫైనల్‌కి అర్హత సాధించడం న్యూజిలాండ్‌కి ఇదే తొలిసారి.  2019 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఎదురైన పరాభవానికి ఎట్టకేలకు ప్రతీకారం తీర్చుకుంది న్యూజిలాండ్. ఇదే ఏడాది ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ గెలిచిన న్యూజిలాండ్, మరో టైటిల్‌కి చేరువైంది. 

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొదటి సెమీ ఫైనల్‌, 2019 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌ని తలపించింది. ఓవర్, ఓవర్‌కి ఆధిక్యం చేతులు మారుతూ సాగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధించింది. 

167 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన న్యూజిలాండ్‌కి మొదటి ఓవర్‌లోనే ఊహించని షాక్ తగిలింది. మొదటి బంతికి ఫోర్‌తో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన మార్టిన్ గుప్టిల్, మూడో బంతికి భారీ షాట్‌కి ప్రయత్నించి మొయిన్ ఆలీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ కేన్ విలియంసన్ 11 బంతులాడి క్రిస్ వోక్స్ ట్రాప్‌లోనే పడి పెవిలియన్ చేరాడు. వోక్స్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించిన కేన్ విలియంసన్, అదిల్ రషీద్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

దీంతో 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్. ఈ దశలో డివాన్ కాన్వే, డార్ల్ మిచెల్ కలిసి మూడో వికెట్‌కి 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 38 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 46 పరుగులు చేసిన డివాన్ కాన్వే, లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. 

ఆ తర్వాత వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ 2 పరుగులకే అవుటైనా డార్ల్ మిచెల్, జేమ్స్ నీశమ్ కలిసి దూకుడు పెంచారు. 16వ ఓవర్‌లో ఫిలిప్‌ను అవుట్ చేసిన లివింగ్‌స్టోన్ 3 పరుగులు మాత్రమే ఇవ్వడంతో రన్‌రేట్ పెరుగుతూ పోయింది. అయితే క్రిస్ జోర్డాన్ వేసిన 17వ ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 23 పరుగులు రాబట్టాడు జేమ్స్ నీశమ్...

ఆ తర్వాత అదిల్ రషీద్ వేసిన 18వ ఓవర్‌లో సిక్సర్ బాదిన మిచెల్ 42 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 11 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 27 పరుగులు చేసిన జేమ్స్ నీశమ్, 18వ ఓవర్ ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు. ఆ సమయానికి న్యూజిలాండ్ విజయానికి 12 బంతుల్లో 20 పరుగులు కావాలి. 

క్రిస్ వోక్స్ వేసిన 19వ ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్ బాదిన డార్ల్ మిచెల్ మ్యాచ్‌ను ముగించేశాడు. 47 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచిన డార్ల్ మిచెల్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. బెయిర్ స్టో 17 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసి ఆడమ్ మిల్నే బౌలింగ్‌లో కేన్ విలియంసన్ పట్టిన అద్భుత క్యాచ్‌కి పెవిలియన్ చేరడంతో 37 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్. 

ఆ తర్వాత 24 బంతుల్లో 4 ఫోర్లతో 29 పరుగులు చేసిన జోస్ బట్లర్, ఇష్ సోదీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. బట్లర్ రివ్యూ తీసుకున్నా, ఫలితం లేకపోయింది. ఆ తర్వాత డేవిడ్ మలాన్, మొయిన్ ఆలీ కలిసి మూడో వికెట్‌కి 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 30 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 42 పరుగులు చేసిన డేవిడ్ మలాన్, టిమ్ సౌథీ బౌలింగ్‌లో కాన్వేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో 269 పరుగులు చేసిన జోస్ బట్లర్, ఒకే సీజన్‌లో 250+ పరుగులు పూర్తి చేసుకున్న మొట్టమొదటి ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.  ఆడమ్ మిల్నే వేసిన 18వ ఓవర్‌లో మొయిన్ ఆలీ, లివింగ్‌స్టోన్ చెరో సిక్సర్ బాది 16 పరుగులు రాబట్టారు. జేమ్స్ నీశమ్ వేసిన ఆఖరి ఓవర్‌లో మొదటి బంతికి సింగిల్ రాగా, రెండో బంతికి భారీ షాట్‌కి ప్రయత్నించిన లియామ్ లివింగ్‌స్టోన్ అవుట్ అయ్యాడు. 

10 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 17 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు లివింగ్‌స్టోన్. ఆ తర్వాతి బంతికి బౌండరీ బాది హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు మొయిన్ ఆలీ... 37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు మొయిన్ ఆలీ. ఆఖరి బంతికి మొయిన్ ఆలీ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను ఫిలిప్స్ డ్రాప్ చేయడంతో మరో రెండు పరుగులు వచ్చాయి.

click me!