T20 Worldcup 2021: జోస్ బట్లర్ అద్భుత సెంచరీ... భారీ స్కోరు చేసిన ఇంగ్లాండ్...

By Chinthakindhi RamuFirst Published Nov 1, 2021, 9:19 PM IST
Highlights

T20 worldcup 2021: ఆఖరి బంతికి సిక్సర్ బాది, సెంచరీ అందుకున్న జోస్ బట్లర్... మూడు వికెట్లు తీసిన వానిందు హసరంగ...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 4  వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. 6 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసిన ఓపెనర్ జాసన్ రాయ్‌ని వానిందు హసరంగ క్లీన్ బౌల్డ్ చేశాడు. 13 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్. ఆ తర్వాత 8 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన డేవిడ్ మలాన్, ఛమీరా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ఆ తర్వాత జానీ బెయిర్ స్టో‌ని గోల్డెన్ డకౌట్ చేశాడు వానిందు హసరంగ. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా రివ్యూకి వెళ్లిన శ్రీలంకకు అనుకూలంగా ఫలితం దక్కింది... ఈ వికెట్‌తో ఈ ఏడాది అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసిన సౌతాఫ్రికా స్పిన్నర్ తబ్రిజ్ షంసీని అధిగమించాడు వానిందు హసరంగ.

Must Read: కీలక మ్యాచ్‌లో ఇలాంటి చెత్త ప్రయోగాలా... ధోనీ, టీమిండియాను ఏం చేయాలనుకుంటున్నావ్..

షంసీ ఈ ఏడాది 32 టీ20 వికెట్లు తీస్తే, హసరంగ 33 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు. ఈ టోర్నీ ముగిసే సరికి ఈ ఇద్దరూ తమ రికార్డులను మరింత మెరుగుపర్చుకునే అవకాశం ఉంది. జానీ బెయిర్‌స్టోకి ఇది టీ20ల్లో ఐదో డకౌట్. లుక్ రైట్ 9 సార్లు, మొయిన్ ఆలీ, జాసన్ రాయ్ ఆరేసి సార్లు తర్వాత అత్యధిక సార్లు డకౌట్ అయిన ఇంగ్లాండ్ ప్లేయర్‌గా నిలిచాడు బెయిర్ స్టో...

35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ఇంగ్లాండ్. అయితే వికెట్ కీపర్ జోస్ బట్లర్, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కలిసి నాలుగో వికెట్‌కి 112 పరుగుల భాగస్వామ్యం అందించా, ఇంగ్లాండ్‌ను ఆదుకున్నారు. 

ఓ వైపు వికెట్లు పడుతున్నా దూకుడుగా బ్యాటింగ్ కొనసాగించిన జోస్ బట్లర్, టీ20ల్లో 2 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. టీ20ల్లో 2 వేల పరుగులు అందుకున్న 13వ ప్లేయర్‌గా నిలిచాడు బట్లర్. టెస్టులు, వన్డేల్లో, టీ20ల్లో 2 వేలకు పైగా పరుగులు చేసిన మొట్టమొదటి ఇంగ్లాండ్ ప్లేయర్‌గా చరిత్ర లిఖించాడు జోస్ బట్లర్.. 

Must Read: టీ20 వరల్డ్‌కప్‌లో ఆఖరిగా వికెట్ తీసిన భారత బౌలర్‌ ఎవరో తెలుసా... విరాట్ కోహ్లీ తర్వాత...

36 బంతుల్లో ఓ ఫోర్, మూడు సిక్సర్లతో 40 పరుగులు చేసిన ఇయాన్ మోర్గాన్, హసరంగ బౌలింగ్‌లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 4 ఓవర్లలో 21 పరుగులు మాత్రమే ఇచ్చిన వానిందు హసరంగ మూడు వికెట్లు పడగొట్టి, అద్భుత ప్రదర్శన ఇచ్చాడు.

మోర్గాన్ వికెట్‌తో టీ20ల్లో 50 వికెట్లు పూర్తి చేసుకున్నాడు హసరంగ. అత్యంత వేగంగా టీ20ల్లో 50 వికెట్లు పూర్తిచేసుకున్న మూడో బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు హసరంగ. అజంతా మెండీస్ 26 టీ20 మ్యాచుల్లో ఈ ఫీట్ సాధించగా, మార్క్ అడైర్ 28 మ్యాచుల్లో వానిందు హసరంగ 31 మ్యాచుల్లో ఈ మైలురాయి అందుకుని రషీద్ ఖాన్, ఇమ్రాన్ తాహీర్‌లతో సమంగా నిలిచాడు...

67 బంతుల్లో 6 ఫోర్లు. 6 సిక్సర్లతో 101 పరుగులు చేసిన జోస్ బట్లర్, ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సిక్సర్ బాది సెంచరీ మార్కును అందుకున్నాడు. 2014లో అలెక్స్ హేల్స్ తర్వాత టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో సెంచరీ చేసిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు బట్లర్...

click me!