T20 Worldcup 2021 final: కేన్ విలియంసన్ మాస్ ఇన్నింగ్స్... ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ముందు...

By Chinthakindhi RamuFirst Published Nov 14, 2021, 9:12 PM IST
Highlights

T20 Worldcup 2021 Australia vs New Zealand: టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా కేన్ విలియంసన్... మూడు వికెట్లు తీసిన మిచెల్ స్టార్క్...

టీ20 వరల్డ్‌కప్ 2021  టోర్నీలో పెద్దగా మెరుపులు మెరిపించలేకపోయిన కేన్ విలియంసన్, ఫైనల్ మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్‌తో కివీస్‌కి మంచి స్కోరు అందించాడు. కేన్ మామ మాస్ ఇన్నింగ్స్‌తో  టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఫైనల్ మ్యాచ్‌లో కివీస్‌కి శుభారంభం దక్కలేదు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న డార్ల్ మిచెల్ స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. 8 బంతుల్లో ఓ సిక్సర్‌తో 11 పరుగులు చేసి అవుట్ అయ్యాడు మిచెల్.

Read also: మూడు ఫార్మాట్స్, మూడు ఫైనల్స్, అన్నింట్లోనూ అతనే... కేన్ మామ కాస్త నీ సక్సెస్ సీక్రెట్ ఏంటో చెప్పు...

స్లో అండ్ స్టడీ మంత్రంతో బ్యాటింగ్ మొదలెట్టిన న్యూజిలాండ్ ఓపెనర్ 35 బంతుల్లో 3 ఫోర్లతో 28 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆడమ్ జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించిన మార్టిన్ గుప్టిల్, స్టోయినిస్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు... ఆ తర్వాత కేన్ విలియంసన్, గ్లెన్ ఫిలిప్ కలిసి మూడో వికెట్‌కి 37 బంతుల్లో 68 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. 21 పరుగుల వద్ద మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కేన్ విలియంసన్ ఇచ్చిన క్యాచ్‌ను న్యూజిలాండ్ ఫీల్డర్ జోష్ హజల్‌వుడ్ జారవిడిచాడు. 

మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన కేన్ విలియంసన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 32 బంతుల్లో అర్ధశతకం అందుకున్న కేన్ విలియంసన్, టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ అందుకున్న బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...మిచెల్ స్టార్ వేసిన 16వ ఓవర్‌లో నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 22 పరుగులు రాబట్టాడు కేన్ విలియంసన్... 

కెప్టెన్ దూకుడుగా ఆడుతుండడంతో అవతలి ఎండ్‌లో యాంకర్ రోల్ పోషించిన గ్లెన్ ఫిలిప్స్, 17 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 18 పరుగులు చేసి జోష్ హజల్‌వుడ్ బౌలింగ్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. గ్లెన్ ఫిలిప్స్ అవుటైన ఓవర్‌లోనే మూడు బంతుల తర్వాత కేన్ విలియంసన్ కూడా పెవిలియన్ చేరాడు. 48 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 85 పరుగులు చేసిన కేన్ విలియంసన్, హజల్ వుడ్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా మార్లన్ శామ్యూల్స్ 66 బంతుల్లో 85 పరుగుల రికార్డును అధిగమించిన కేన్ విలియంసన్స్, 48 బంతుల్లోనే 85 పరుగులు చేసి టాప్‌లో నిలిచాడు. ఓవరాల్‌గా ఐసీసీ వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో అత్యధిక స్కోరు చేసిన నాలుగో కెప్టెన్‌గా నిలిచాడు కేన్ విలియంసన్. 2003 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాపై ఆసీస్ కెప్టెన్ రికీ పాంటింగ్ 140 పరుగులు చేసి టాప్‌లో ఉండగా, క్లెయివ్ లార్డ్ 102 పరుగులు 1975 వరల్డ్‌కప్‌లో, ఎమ్మెస్ ధోనీ 2011 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌లో 91 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు...

ఓవరాల్‌గా కెప్టెన్‌గా మూడో ఐసీసీ ఫైనల్ ఆడుతున్న కేన్ విలియంసన్, ఫైనల్స్‌లో 216 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా టాప్‌లో నిలిచాడు. రికీ పాంటింగ్ ఫైనల్స్‌లో 178, సౌరవ్ గంగూలీ 141 పరుగులతో టాప్ 3లో ఉన్నారు.

జోష్ హజల్‌వుడ్ 4 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. టీ20 వరల్డ్‌కప్ 2007 ఫైనల్ మ్యాచ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన ఇర్ఫాన్ పఠాన్ కూడా బౌలింగ్‌లో 3 వికెట్లు తీసి 16 పరుగులే ఇవ్వడం విశేషం.  కేన్ విలియంసన్ బాదుడికి మిచెల్ స్టార్క్ నాలుగు ఓవర్లలో 60 పరుగులు సమర్పించుకున్నాడు.

click me!