T20 worldcup 2021: డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ... ఆస్ట్రేలియాకి వరుసగా రెండో విజయం...

By Chinthakindhi RamuFirst Published Oct 28, 2021, 10:43 PM IST
Highlights

T20 worldcup 2021: 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకున్న ఆస్ట్రేలియా... అద్భుత హాఫ్ సెంచరీతో అదరగొట్టిన డేవిడ్ వార్నర్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో మరో మ్యాచ్ టాస్ గెలిచిన జట్టుకే విజయాన్ని కట్టబెట్టింది. శ్రీలంక విధించిన 155 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి 17 ఓవర్లలోనే ఛేదించి నెట్ రన్‌రేట్‌ను మెరుగు పర్చుకుంది ఆస్ట్రేలియా...

ఆస్ట్రేలియాకి ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ ‌కలిసి శుభారంభాన్ని అందించారు. ఈ ఇద్దరూ మొదటి ఓవరి నుంచి లంక బౌలర్లపై ఎదురుదాడి చేయడంతో 6.4 ఓవర్లలో 70 పరుగుల స్కోరును అందుకుంది ఆస్ట్రేలియా...

ఈ దశలో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ 2500 టీ20 పరుగులను పూర్తిచేసుకున్నాడు. 78 ఇన్నింగ్స్‌లో  మైలురాయిని అందుకున్న ఆరోన్ ఫించ్, భారత సారథి విరాట్ కోహ్లీ (68 ఇన్నింగ్స్‌ల్లో) తర్వాత అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన రెండో బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.

23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు చేసిన ఆరోన్ ఫించ్‌ను వానిందు హసరంగ క్లీన్‌బౌల్డ్ చేశాడు. 6 బంతుల్లో 5 పరుగులు చేసిన గ్లెన మ్యాక్స్‌వెల్ కూడా హసరంగ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు.
80 పరుగుల వద్ద రెండో వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా.

18 పరుగుల వద్ద వికెట్ కీపర్ పెరేరా ఈజీ క్యాచ్ డ్రాప్ చేయడంతో బతికిపోయిన డేవిడ్ వార్నర్, తిరిగి పూర్వ ఫామ్‌ను అందుకుని చెలరేగిపోయాడు. 31 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న డేవిడ్ వార్నర్, టీ20ల్లో 20వ అర్ధశతకాన్ని నమోదుచేశాడు. విరాట్ కోహ్లీ 29, రోహిత్ శర్మ 26, బాబర్ ఆజమ్ 22 హాఫ్ సెంచరీలతో వార్నర్ కంటే ముందున్నారు. ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీలో వార్నర్‌కి ఇది 11వ హాఫ్ సెంచరీ. ఆసీస్ మాజీ ప్లేయర్లు రికీ పాంటింగ్, షేన్ వాట్సన్‌ల రికార్డును సమం చేశాడు వార్నర్..

ఇంతకుముందు షేన్ వాట్సన్‌తో కలిపి 1108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన డేవిడ్ వార్నర్, ఈ మ్యాచ్ ద్వారా ఆరోన్ ఫించ్‌లో 1018 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తిచేసుకున్నాడు. టీ20ల్లో ఇద్దరు ప్లేయర్లతో 1000+ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన మొదటి ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు డేవిడ్ వార్నర్...

42 బంతుల్లో 10 ఫోర్లతో 65 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, శనక బౌలింగ్‌లో రాజపక్సకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే అప్పటికే ఆస్ట్రేలియా విజయానికి 30 బంతుల్లో 25 పరుగులు కావాల్సిన స్థితికి చేరుకుంది. శ్రీలంకపైన టీ20ల్లో 500 పరుగులు పూర్తిచేసుకున్న డేవిడ్ వార్నర్, లంకపై ఈ ఫీట్ సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.

మార్కస్ స్టోయినిస్ 7 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 16 పరుగులు చేయగా, స్టీవ్ స్మిత్ 26 బంతుల్లో ఓ ఫోర్‌తో 28 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. లంక బౌలర్లలో హసరంగ ఒక్కడే 2 వికెట్లు తీసి ఆకట్టుకోగా కెప్టెన్ శనక ఓ వికెట్ తీశాడు. 4 ఓవర్లలో 12 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసిన ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపాకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. 

 

click me!