T20 worldcup 2021: భారీగా మొదలెట్టి, ఆస్ట్రేలియా ముందు ఊరించే టార్గెట్ పెట్టిన శ్రీలంక...

By Chinthakindhi RamuFirst Published Oct 28, 2021, 9:16 PM IST
Highlights

T20 worldcup 2021: నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసిన శ్రీలంక... రెండేసి వికెట్లు తీసిన ఆడమ్ జంపా, కమ్మిన్స్, స్టార్క్... 

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. ఓపెనర్ పథుమ్ నిశ్శక 7 పరుగులు చేసి అవుట్ కావడంతో 15 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది శ్రీలంక.

అయతే కుశాల్ పెరేరా, చరిత్ అసలంక కలిసి రెండో వికెట్‌కి 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 27 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 35 పరుగులు చేసిన చరిత్ అసలంక, ఆడమ్ జంపా బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

ఆ తర్వాత 25 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 35 పరుగులు చేసిన కుశాల్ పెరేరాని మిచెల్ స్టార్క్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. 7 బంతుల్లో 4 పరుగులు చేసిన ఆవిష్క ఫెర్నాండో కూడా ఆడమ్ జంపా బౌలింగ్‌లో అవుట్ కాగా, తాను మొదటి బంతికి పోర్ బాదిన వానిందు హసరంగ, ఆ తర్వాతి బంతికి మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కీపర్ మాథ్యూ వేడ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా రివ్యూకి వెళ్లిన ఆసీస్‌కు అనుకూలంగా ఫలతం దక్కింది... 19 బంతుల్లో 12 పరుగులు చేసిన లంక కెప్టెన్ దసున్ శనక, ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి మాథ్యూ వేడ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 


భనుక రాజపక్స 26 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేయగా, చమీరా కరుణరత్నే 6 బంతుల్లో 9 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు... ఒకానొకదశలో 10 ఓవర్లలో 86 పరుగులు చేసి, భారీ స్కోరు దిశగా సాగుతున్నట్టు కనిపించింది శ్రీలంక. అయితే వరుస విరామాల్లో వికెట్లు తీసిన ఆస్ట్రేలియా బౌలర్లు, లంక స్కోరును కట్టడి చేశారు...

ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 2 వికెట్లు తీసి 27 పరుగులు ఇవ్వగా, ఆడమ్ జంపా కేవలం 12 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు తీశాడు. ప్యాట్ కమ్మిన్స్ 4 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. జోష్ హజల్‌వుడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, స్టోయినిస్ వికెట్లే తీయలేకపోగా భారీగా పరుగులు సమర్పించారు... 

ఈ మ్యాచ్‌లో 2 వికెట్లు తీసిన ఆడమ్ జంపా, ఆస్ట్రేలియా తరుపున అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఆడమ్ జంపా 56 టీ20 వికెట్లు తీయగా, మిచెల్ స్టార్క్ 55 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. 

160 అంతకంటే తక్కువ స్కోరును ఛేదించడంలో ఆస్ట్రేలియాకి తిరుగులేని రికార్డు ఉంది. 160 కంటే తక్కువ పరుగుల లక్ష్యాన్ని 83 శాతం మ్యాచుల్లో విజయవంతంగా ఛేదించింది ఆసీస్... ఆస్ట్రేలియాతో పాటు శ్రీలంక కూడా టీ20 వరల్డ్‌కప్ 2021 సూపర్ 12 రౌండ్‌లో చెరో విజయాన్ని అందుకున్నాయి. ఈ మ్యాచ్ ఫలితం ఇరు జట్లకీ కీలకం కానుంది. 

click me!