
T20 World Cup, India: వచ్చే ఏడాది అమెరికా, వెస్టిండీస్‌లో ఐసీసీ టీ20 ప్రపంచకప్ సిరీస్ జరగనుంది. ఐసీసీ వన్డే క్రికెట్ వరల్డ్ కప్ ఇటీవలే ముగిసింది. తక్కువ టైమ్ గ్యాప్ లోనే టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఇటీవల ముగిసిన ఐసీసీ వన్డే ప్రపంచకప్ సిరీస్‌లో వరుసగా 10 విజయాలతో తిరుగులేని జట్టుగా నిలిచిన భారత్.. ఫైనల్లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడిపోయి మెగా టోర్నమెంట్ ట్రోఫీని కోల్పోయింది.
వచ్చే టీ20 ప్రపంచ కప్ పరిస్థితిపై భారత జట్టు మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ.. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు గట్టి పోటీనిస్తుందని అన్నారు. "ఏదీ సులభంగా రాదు. భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రపంచకప్ గెలవడానికి 6 ప్రపంచకప్‌ల వరకు వేచి ఉండాల్సి వచ్చింది. ప్రపంచకప్ గెలవడం అంత సులభం కాదు. ప్రపంచకప్ గెలవాలంటే ఫైనల్ రోజు అద్భుతంగా ఉండాలి. ఫైనల్స్‌కు ముందు మీరు ఏమి చేసినా పరిగణనలోకి తీసుకోరు. ఫైనల్‌లోనూ అమలు చేయాలి. సెమీ ఫైనల్స్, ఫైనల్స్‌లో రెండు రోజులూ మంచి ప్రదర్శన కనబర్చాలని" అన్నారు.
సెమీ ఫైనల్స్, ఫైనల్స్ కీలమైన మ్యాచ్ లనీ, ఒత్తిడి లేకుండా ముగిస్తే కప్పు కొట్టడం ఖాయమని పేర్కొన్నారు. "ఆరెండు రోజుల్లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తే మీరే విజేత. ఆ రెండు రోజుల్లోనూ ఆస్ట్రేలియా రాణించి ట్రోఫీని కైవసం చేసుకుంది. భారత్ ఓటమి చాలా నిరాశపరిచింది. అయితే ఆటగాళ్లు ఓటమితో కుంగిపోకుండా ముందుకు సాగాలి. భారత్ ప్రపంచకప్ గెలిచే రోజు ఎంతో దూరంలో లేదు. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌ను గెలవాలంటే భారత జట్టు గట్టి పోటీదారుగా నిలవనుందని" అన్నారు. అలాగే, ఇటీవల ముగిసిన ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో భారత్ పటిష్టమైన జట్టుగా ఉన్నప్పటికీ ట్రోఫీని గెలవకపోవడం నిరాశపరిచిందని అన్నాడు.