ఇది ఫైనల్.. వరల్డ్ కప్ లో హర్ధిక్ పాండ్యా పరిస్థితేంటో తేల్చేసిన బీసీసీఐ.. శార్దుల్ ఎంపిక అందుకేనా..?

By team teluguFirst Published Oct 14, 2021, 11:38 AM IST
Highlights

Hardik Pandya: మరో మూడు  రోజుల్లో ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ కు ముందు భారత్ కు ఊహించని షాక్ తగిలింది. ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్న స్టార్ ఆల్ రౌండర్ హర్ధిక్ పాండ్యా ను టోర్నీలో ఎలా వాడనున్నారో బీసీసీఐ తేల్చేసింది. 

భారత క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా (Hardik pandya) ఫిట్నెస్ గురించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తేల్చేసింది. టీ20 ప్రపంచకప్ (ICC T20 World Cup)లో భారత జట్టుకు ఎంపికైన పాండ్యా బౌలింగ్ చేస్తాడా..? లేదా..? అనే విషయంపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. 

గతేడాది వెన్ను నొప్పి కారణంగా హర్ధిక్ పాండ్యా కు శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత అతడు శ్రీలంక  టూర్ కు వెళ్లిన జట్టులో సభ్యుడిగా ఉన్న పెద్దగా బౌలింగ్ చేయలేదు. అయినా పాండ్యాను టీ20 జట్టుకు ఎంపికచేయడం విమర్శలకు తావిచ్చింది. ఐపీఎల్ (IPL) రెండో అంచెలో కూడా ముంబై ఇండియన్స్ (Mumbai Indians) అతడితో బౌలింగ్ చేయించలేదు. దీంతో అభిమానుల్లో ఆందోళనలు పెరిగిపోయాయి.  అసలు పాండ్యా ప్రపంచకప్ లో ఉంటాడా..? ఉండడా..? ఉంటే బౌలింగ్ చేస్తాడా..? లేదా..? అనే అనుమానాలు నెలకొన్నాయి. 

ఇది కూడా చదవండి: IPL2021: ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్ల గుండె పగిలిన క్షణం.. కన్నీరుమున్నీరైన రిషభ్ పంత్, పృథ్వీ షా

దీనిపై బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘నేను చెప్పేది స్పష్టం. వరల్డ్ కప్ లో అతడు (పాండ్యా) బౌలింగ్ వేయడు. కేవలం బ్యాట్స్మెన్ గానే కొనసాగుతాడు. ఒకవేళ  అతడు బంతి విసరడానికి ఫిట్ గా ఉంటే మాత్రం దాని గురించి ఆలోచిస్తాం. ఇప్పుడైతే పాండ్యా బ్యాట్స్మెన్ గానే జట్టులో ఉంటాడు’ అని తెలిపాడు. 

ప్రపంచకప్ దగ్గరపడుతున్న కొద్దీ పాండ్యా ఫిట్నెస్ (Hardik pandya Fitness) గురించి అభిమానులతో పాటు బీసీసీఐ లోనూ ఆందోళన పెరిగిపోయింది. దీనిపై  దృష్టి సారించిన బోర్డు ముంబై ఇండియన్స్ నుంచి ఆగమేఘాల మీద పాండ్యా మెడికల్ రిపోర్టులు తెప్పించుకుని పరిశీలించింది. వాటిని బీసీసీఐ  మెడికల్ టీమ్ క్షుణ్ణంగా పరిశీలించి.. బౌలింగ్ వేయడానికి పాండ్యా సిద్ధంగా లేడని తేల్చి  చెప్పినట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే భారత జట్టు  అక్షర్ పటేల్ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్  (Chennai super kings) బౌలర్ శార్దుల్ ఠాకూర్ (shardul Thakur) ను ఎంపిక చేసినట్టు తెలుస్తున్నది. 

శార్దుల్ ఎంపిక అందుకేనా..?

టీ20 ప్రపంచకప్ కోసం ఎంపికచేసిన 15 మంది సభ్యులలో ముగ్గురు మాత్రమే స్పెషలిస్టు ఫాస్ట్ బౌలర్లున్నారు. వారిలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్. వీరికి తోడుగా పాండ్యా ఉంటారని సెలక్టర్లు భావించారు. కానీ ఫిట్నెస్  లేమితో బాధపడుతున్న పాండ్యా.. బౌలింగ్  వేయలేడని నిర్ధారించుకున్న తర్వాతే నాలుగో పేసర్ కోసం అక్షర్ ను పక్కనబెట్టి శార్దుల్ ను ఎంపికచేసినట్టు  సమాచారం. 

ఇది కూడా చదవండి:T20 World Cup: టీమిండియా కొత్త జెర్సీ వచ్చేసింది.. రెట్రో బ్లూ డ్రెస్సులతో అదరగొడుతున్న భారత క్రికెటర్లు

‘శార్దుల్ ఎంపికపై బీసీసీఐ చర్చోపచర్చలు చేసి నిర్ణయం తీసుకుంది. అక్షర్ పటేల్ ఆల్ రౌండర్ జాబితాలో టీమ్ ఇండియా బృందంలోకి తీసుకున్నా.. నాలుగో పేసర్ కొరత నేపథ్యంలో శార్దుల్ ను తీసుకున్నామ’ని  బీసీసీఐ ప్రతినిధి తెలిపాడు. ఐపీఎల్ లో ఈ ఇద్దరూ మెరుగ్గానే రాణించారు. 

ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన అక్షర్ పటేల్ 12 మ్యాచుల్లో 12 వికెట్లు తీశాడు.  మరోవైపు చెన్నై తరఫున ఆడిన శార్దుల్ ఠాకూర్.. 18 వికెట్లు పడగొట్టాడు. పటేల్ తో పోలిస్తే శార్దుల్ బౌలింగ్ లోనే గాక బ్యాటింగ్ లోనూ రాణిస్తున్నాడు. ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ సందర్భంగా అది రుజువైంది కూడా. ఈ నేపథ్యంలోనే శార్దుల్  ఎంపిక జరిగిందని తెలుస్తున్నది. 

టీ20కి భారత జట్టు : విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, రిషభ్ పంత్, సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, హార్ధిక్ పాండ్యా, ఆర్. అశ్విన్, రాహుల్ చాహర్, శార్దుల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ
స్టాండ్ బై ప్లేయర్లు : శ్రేయస్ అయ్యర్, దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్ 

వీరితో పాటుగా ఐపీఎల్ లో రాణించిన ఉమ్రన్ మాలిక్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, వెంకటేష్ అయ్యర్ వంటి ఆటగాళ్లు టీమ్ ఇండియా నెట్ బౌలర్లు గా ఎంపికయ్యారు. వీళ్లంతా త్వరలోనే భారత బయో బబుల్ తో కలువనున్నారు.

click me!