India vs Ireland: టీ20 వ‌ర‌ల్డ్ కప్ 2024లో ఐర్లాండ్ తో తొలి పోరుకు సై.. భార‌త్ రికార్డులు ఇవే

By Mahesh Rajamoni  |  First Published Jun 2, 2024, 6:19 PM IST

India vs Ireland : టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 టైటిల్ గెల‌వ‌డ‌మే ల‌క్ష్యంగా అమెరికా గ‌డ్డ‌పై అడుగుపెట్టింది భార‌త్. టీ20 పోరులో తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ తో త‌ల‌ప‌డ‌నుంది. ఇప్ప‌టివ‌ర‌కు భార‌త్-ఐర్లాండ్ రికార్డులు గ‌మ‌నిస్తే.. 
 


India vs Ireland: అమెరికా, వెస్టిండీస్ వేదిక‌లుగా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 ఘ‌నంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో సహ-ఆతిథ్య అమెరికా కెనడాను చిత్తు చేసి తొలి విజ‌యం అందుకుంది. అయితే, ఈ సారి ఎలాగైనా టీ20 టోర్నీ టైటిల్ ను గెలుచుకోవాల‌ని రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీ లోని భార‌త జ‌ట్టు అమెరికాలో గ‌డ్డ‌పై అడుగుపెట్టింది. యూఎస్ఏ చేరుకున్న వెంట‌నే అక్క‌డి ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకోవ‌డానికి ముమ్మ‌రంగా ప్రాక్టీస్ చేసింది. ఈ క్ర‌మంలోనే టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 కు ముందు త‌న ఏకైక‌ ప్రాక్టీస్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసింది.

ఈ గెలుపుతో టీమిండియా ఫ్యాన్స్ మ‌స్తు ఖుషీ అవుతున్నారు. టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 లో భార‌త జ‌ట్టు త‌న తొలి మ్యాచ్‌ని ఐర్లాండ్‌తో ఆడనుంది. అమెరికా, పాకిస్థాన్‌, ఐర్లాండ్‌, కెనడాతో పాటు భారత్‌ గ్రూప్‌-ఏలో ఉంది. జూన్ 5న రోహిత్ శర్మ సేన త‌న తొలి మ్యాచ్ ను ఆడ‌నుంది. ఆ తర్వాత జూన్ 9న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ రెండో మ్యాచ్ ఆడనుంది. 12న అమెరికాతో టీమిండియా మూడో మ్యాచ్ ఆడనుంది. న్యూయార్క్‌లో నిర్మించిన కొత్త స్టేడియంలో ఈ మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. దీని తర్వాత జూన్ 15న ఫ్లోరిడాలో కెనడాతో భారత్ తలపడనుంది.

Latest Videos

భార‌త్ vs ఐర్లాండ్ హెడ్ టు హెడ్ రికార్డులు

భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్ ల‌లో టీమిండియాదే పైచేయి అని చెప్పాలి. ఇరు జట్లు ఇప్ప‌టివ‌ర‌కు 7 మ్యాచ్‌ల్లో తలపడగా అన్ని మ్యాచ్‌ల్లోనూ భారత జట్టు విజయం సాధించింది ఐర్లాండ్ పై తిరుగులేని అధిప‌త్యం ప్ర‌ద‌ర్శ‌న చేసింది. ఈ మ్యాచ్‌లు 2009 - 2023 మధ్య జ‌రిగాయి. 2023 ఆగస్టు 23 తర్వాత మ‌ళ్లీ భార‌త జ‌ట్టు ఐర్లాండ్ తో త‌ల‌ప‌డుతోంది.

టీ20 ప్రపంచకప్‌లో రికార్డులు.. 

15 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌లో భారత్, ఐర్లాండ్ జట్లు తలపడుతున్నాయి. చివరిసారి 2009లో నాటింగ్‌హామ్ లో అంతర్జాతీయ టీ20లో ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జ‌రిగింది. భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నాయ‌క‌త్వంలోని భార‌త జ‌ట్టు 8 వికెట్ల తేడాతో ఐర్లాండ్ ను చిత్తు చేసింది. భారత్ తరఫున రోహిత్ శర్మ అజేయంగా 52 పరుగులు చేశాడు. ఇప్పుడు కెప్టెన్ గా హిట్ మ్యాన్ ఐర్లాండ్ తో ఎదుర్కొవ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు.

టీ20 ప్రపంచకప్ 2024 లో ఇరు జ‌ట్లు ఇలా.. 

భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రిత్ సింగ్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. రిజర్వ్: శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.

ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), మార్క్ అడైర్, రాస్ అడైర్, ఆండ్రూ బల్బిర్నీ, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, గ్రాహం హ్యూమ్, జోష్ లిటిల్, బారీ మెక్‌కార్తీ, నీల్ రాక్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్.

"భార‌త్-పాకిస్తాన్ మ్యాచ్ అంచనాలు-హైప్ భయాన్ని క‌లిగిస్తున్నాయి.." అస‌లు ఏం జ‌రుగుతోంది భ‌య్యా.. !

click me!