T20 World cup 2023: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా... కోలుకున్న టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్...

Published : Feb 23, 2023, 06:14 PM ISTUpdated : Feb 23, 2023, 06:25 PM IST
T20 World cup 2023: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా... కోలుకున్న టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్...

సారాంశం

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా..  అనారోగ్యం నుంచి కోలుకున్న టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.. పూజా వస్త్రాకర్ స్థానంలో స్నేహ్ రాణాకి అవకాశం.. 

ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా టీమిండియాతో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సెమీ ఫైనల్‌కి ముందు టీమిండియా శిబిరంలో గందరగోళ పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే..

భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్, స్పిన్నర్ రాధా యాదవ్ అనారోగ్యానికి గురయ్యారు. జ్వరంతో ఆసుపత్రిలో చేరిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, పూర్తిగా కోలుకోవడంతో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో బరిలో దిగనుంది.. ఆమె నిజంగానే పూర్తిగా కోలుకుందా? లేక సెమీస్ మ్యాచ్ కావడంతో జ్వరంతోనే బరిలో దిగుతోందా? అనేది తేలాల్సి ఉంది.

స్పిన్నర్ రాధా యాదవ్ కూడా భారత జట్టులోకి తిరిగి వచ్చింది. అయితే ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్, అనారోగ్యంతో టీ20 వరల్డ్ కప్ టోర్నీ నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో మరో ఆల్‌రౌండర్ స్నేహ్ రాణాకి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అవకాశం దక్కనుంది.. 

టీమిండియాపై ఆస్ట్రేలియాకి ఘనమైన రికార్డు ఉంది. ఇప్పటిదాకా ఇరుజట్ల మధ్య 30 మ్యాచులు జరగగా 22 మ్యాచుల్లో ఆస్ట్రేలియానే గెలిచింది. 7 మ్యాచుల్లో భారత జట్టు గెలిచింది. ఓ మ్యాచ్ ఫలితం తేలకుండానే రద్దయ్యింది..

2022 డిసెంబర్‌లో ఇండయాలో పర్యటించిన ఆస్ట్రేలియా జట్టు, ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌ని 4-1 తేడాతో కోల్పోయింది. అంతకుముందు కామన్వెల్త్ గేమ్స్‌ 2022లోనూ ఆస్ట్రేలియా మహిళా జట్టు, టీమిండియాపై రెండు మ్యాచుల్లోనూ గెలిచింది.. గ్రూప్ మ్యాచ్‌లో భారత జట్టును ఓడించిన ఆస్ట్రేలియా, ఫైనల్ మ్యాచ్‌లోనూ ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది.. 

అయితే ఐసీసీ వరల్డ్ కప్ గెలవాలనే కలను నెరవేర్చుకోవాలంటే టీమిండియా ఆస్ట్రేలియా గండాన్ని దాటి తీరాల్సిందే. నేటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియానే ఫెవరెట్. పెద్దగా అంచనాలు లేకుండా బరిలో దిగుతుండడం టీమిండియాకి అడ్వాంటేజ్. భారత జట్టు కరెక్టుగా ప్రయత్నిస్తే, ఆస్ట్రేలియాని ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు కూడా...

షెఫాలీ వర్మ పరుగులు చేస్తున్నా టీ20ల్లో ఆమె స్ట్రైయిక్ రేటు, 100 కంటే తక్కువగా ఉంటోంది. జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి శర్మ, యస్తికా భాటియా, స్నేహ్ రాణా వరకూ బ్యాటింగ్ ఆర్డర్ ఉన్నా ఆస్ట్రేలియాని ఎంత తక్కువ స్కోరుకి నిలువరిస్తారనే విషయంపైనే టీమిండియా విజయం ఆధారపడి ఉంది. ఆసీస్‌ని 150 పరుగుల లోపు నిలువరించగలిగితే టీమిండియాకి విజయావకాశాలు పెరుగుతాయి..

ఆస్ట్రేలియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. టీ20 ఫార్మాట్‌లో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న ఆసీస్, భారత్‌లోనే టీమిండియాని చిత్తు చేసింది. అయితే టీమిండియా తక్కువ అంచనా వేస్తే మాత్రం ఆస్ట్రేలియా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.

భారత జట్టు ఇది: షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్, దీప్తి శర్మ, యస్తికా భాటియా, స్నేహ్ రాణా, శిఖా పాండే, రాధా యాదవ్, రేణుకా ఠాకూర్ సింగ్

ఆస్ట్రేలియా జట్టు: అలీసా హీలి, బెత్ మూనీ, మెగ్ లానింగ్, అష్‌లీగ్ గార్నర్, ఎలీసా పెర్రీ, తహిళా మెక్‌గ్రాత్, గ్రాస్ హారీస్, జార్జియా వారెహం, జెస్ జానసెన్, మెగన్ స్కాట్, డార్సీ బ్రౌన్

PREV
click me!

Recommended Stories

IND vs SA : గిల్ రెడీనా? భారత జట్టులోకి ముగ్గురు స్టార్ల రీఎంట్రీ
Smriti Mandhana: ఔను.. నా పెళ్లి రద్దయింది.. స్మృతి మంధాన, పలాష్ ముచ్ఛల్ సంచలన పోస్టులు