మనల్నెవడ్రా ఆపేది..! మళ్లీ చెలరేగిన కోహ్లీ.. బంగ్లా ముందు భారీ టార్గెట్ పెట్టిన భారత్

By Srinivas MFirst Published Nov 2, 2022, 3:19 PM IST
Highlights

T20 World Cup 2022: సెమీస్  అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ రెచ్చిపోయింది. భారీ స్కోరు సాధించే క్రమంలో వరుసగా వికెట్లు కోల్పోయినా చివర్లో పుంజుకుని బంగ్లాదేశ్ ముందు భారీ టార్గెట్ ఉంచింది. 

టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారిన పరిస్తితుల్లో  బంగ్లాదేశ్ తో కీలక మ్యాచ్ ఆడుతున్న భారత జట్టు బ్యాటింగ్ లో పడుతూ లేస్తూ భారీ స్కోరు సాధించింది. ఇన్నింగ్స్ మొదట్లో, మిడిల్ ఓవర్లలో ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించిన భారత బ్యాటర్లు.. చివరి ఓవర్లలో తేలిపోయారు.  కెఎల్ రాహుల్  (32 బంతుల్లో 50, 3 ఫోర్లు, 4 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (44 బంతుల్లో 64 నాటౌట్, 8 ఫోర్లు, 1 సిక్సర్) లు రాణించారు. ఫలితంగా భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.  ఓ క్రమంలో 200 ఈజీగా చేస్తారనే స్థితి నుంచి భారత్.. 184 కే పరిమితమైంది.  ఇక ఈ మ్యాచ్ లో గెలవాలంటే భారత్ బౌలర్లు ఈ బంగ్లా బ్యాటర్లను ఏ మేరకు కట్టడి చేస్తారో మరికొద్దిసేపట్లో తేలనుంది. 

టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన  భారత్ కు ఆశించిన ఆరంభమేమీ దక్కలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ  (2) మరోసారి విఫలమయ్యాడు. కానీ గత  మూడు మ్యాచ్ లలో విఫలమవుతూ తీవ్ర విమర్శల పాలవుతున్న  కెఎల్ రాహుల్ దూకుడుగా ఆడాడు.  విరాట్ కోహ్లీతో కలిసి రెండో వికెట్ కు  67 పరుగులు జతచేశాడు. 

హసన్ మహ్మద్ వేసిన నాలుగో ఓవర్లో రాహుల్ 4, 6 తో బాదడం స్టార్ట్ చేశాడు.  టస్కిన్ అహ్మద్ వేసిన తర్వాత ఓవర్లో రెండు వరుస ఫోర్లు బాదాడు. ఇక షోరిఫుల్  ఇస్లాం వేసిన 9వ ఓవర్లో తొలి బంతికి కోహ్లీ ఫోర్ కొట్టగా  తర్వాత రాహుల్.. 6, 6, 6, 4 తో హాఫ్  సెంచరీకి దగ్గరయ్యాడు. షకిబ్ అల్ హసన్ వేసిన పదో ఓవర్లో తొలి బంతికి రెండు పరుగులు తీసి అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న రాహుల్.. తర్వాత బంతికే భారీ షాట్ ఆడబోయి షార్ట్ ఫైన్ వద్ద ముస్తాఫిజుర్ కు క్యాచ్ ఇచ్చాడు. 

 

India finish strongly to set Bangladesh a target of 185 🔥

Who is winning? | | 📝: https://t.co/vDRjKeeGvf pic.twitter.com/iLVp1UT35p

— ICC (@ICC)

రాహుల్ ఔటయ్యాక వచ్చిన సూర్య కుమార్ యాదవ్ (16 బంతుల్లో 30, 4 ఫోర్లు)  ఉన్నంతసేపు దాటిగా ఆడాడు. సూర్యతో కలిసి కోహ్లీ మూడో వికెట్ కు 38 పరుగులు జోడించాడు.  కానీ అతడిని షకిబ్ అల్ హసన్ బౌల్డ్ చేశాడు. అతడి స్థానంలో వచ్చిన హార్ధిక్ పాండ్యా (5) కూడా  విఫలమయ్యాడు.  16 ఓవర్లకు భారత్  4 వికెట్ల నష్టానికి  140 పరుగులు చేసింది. అదే ఓవర్లో కోహ్లీ.. 2 పరుగులు తీసి ఈ టోర్నీలో మూడో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ తర్వాత బంతికి దినేశ్ కార్తీక్ (7).. కోహ్లీతో సమన్వయం కొరవడి రనౌట్ అయ్యాడు.  

ముస్తాఫిజుర్ వేసిన  18వ ఓవర్లో అక్షర్ పటేల్ పరుగులు తీయడానికి ఇబ్బందిపడ్డాడు. ఆ ఓవర్లో 7 పరుగులు మాత్రమే వచ్చాయి. కానీ చివరి రెండు ఓవర్లలో కోహ్లీ..  బ్యాట్ ఝుళిపించి ఆడాడు. హసన్ మహ్మద్ వేసిన 19వ  ఓవర్లో చివరి రెండు బంతులను 4, 6 కు తరలించాడు. చివరి ఓవర్లో అశ్విన్.. 6, 4  బాదడంతో భారత్ కు భారీ స్కోరు దక్కింది.

click me!