టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్... తొలుత బ్యాటింగ్ చేయనున్న టీమిండియా! గెలిస్తేనే సెమీస్ రేసులో...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో భాగంగా భారత జట్టు నేడు బంగ్లాదేశ్‌తో తలబడుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది.
ఆడిలైడ్‌లో నేడు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియచేసింది. దీంతో నేటి మ్యాచ్‌కి వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వరుణుడి అంతరాయంతో ఈ మ్యాచ్ క్యాన్సిల్ అయితే టీమిండియాపై ఆ ప్రభావం తీవ్రంగా పడుతుంది.
పాకిస్తాన్, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచుల్లో గెలిచిన టీమిండియా, సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది. ఈ పరాజయంతో సెమీ ఫైనల్ రేసులో నిలవాలంటే మిగిలిన రెండు మ్యాచుల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో ఇరుక్కుంది భారత జట్టు.
టీమిండియా నేటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై విజయం అందుకుంటే, పాకిస్తాన్ అధికారికంగా సెమీ ఫైనల్ రేసు నుంచి తప్పుకుంటుంది. తర్వాతి మ్యాచ్‌లో పాక్, సౌతాఫ్రికాపై ఎంత పెద్ద విజయం అందుకున్నా, సెమీస్ రేసులో నిలవడానికి అవకాశం ఉండదు.
undefined
నేటి మ్యాచ్‌లో పొరపాటున టీమిండియా కానీ ఓడితే, బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లకు సెమీ ఫైనల్ ఛాన్సులు పెరుగుతాయి. సౌతాఫ్రికాతో మ్యాచ్ ఓడినా నెదర్లాండ్స్, జింబాబ్వేలపై భారీ విజయాలు అందుకుంది బంగ్లాదేశ్. 4 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్, తర్వాతి మ్యాచ్‌లో పాక్‌తో తలబడుతుంది.ఈ మ్యాచ్ గెలిస్తే సెమీస్ చేరాలంటే బంగ్లా, చివరి మ్యాచ్‌లో పాక్‌ని ఓడిస్తే సరిపోతుంది...
ఇప్పటికే బంగ్లా సారథి షకీబ్ అల్ హసన్ కూడా టీమిండియా వరల్డ్ కప్ ఆశలపై నీళ్లు చల్లడం తమకెంతో సంతృప్తినిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశాడు...
టీమిండియా ఓపెనర్ కెఎల్ రాహుల్, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఇప్పటిదాకా ఒక్క ఇన్నింగ్స్‌లో కూడా డబుల్ డిజిట్ స్కోరును అందుకోలేకపోయాడు. అలాగే సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్, మొదటి మూడు మ్యాచుల్లో పెద్దగా మెప్పించలేకపోయాడు... నేటి మ్యాచ్‌లో ఈ ఇద్దరికీ చోటు దక్కడం కష్టమేనని టాక్ వినిపించినా... మార్పులు చేసేందుకు రోహిత్ శర్మ అండ్ కో ఇష్టపడలేదు..
గత మ్యాచ్‌లో వికెట్ కీపింగ్ చేస్తూ గాయపడిన దినేశ్ కార్తీక్ పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో నేటి మ్యాచ్‌ల బరిలో దిగుతున్నాడు. అయితే గత మ్యాచ్‌కి దూరమైన అక్షర్ పటేల్ తిరిగి తుది జట్టులోకి వచ్చాడు
టీమిండియా తుది జట్టు ఇదే: రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్
బంగ్లాదశ్ జట్టు ఇది: నజీముల్ హుస్సేన్ షాంటో, లిట్టన్ దాస్, షకీబ్ అల్ హసన్, అఫిఫ్ హుస్సేన్, యాసిర్ ఆలీ, ముసడెక్ హుస్సేన్, షోరిఫుల్ ఇస్లాం, నురుల్ హసన్, ముస్తఫిజుర్ రహ్మాన్, హసన్ మహ్మద్, టస్కీన్ అహ్మద్