వర్షం రాకముందు.. వచ్చిన తర్వాత..! ఒత్తిడికి చిత్తైన బంగ్లాదేశ్, ఇండియా సెమీస్ బెర్త్ ఖాయం..!

By Srinivas M  |  First Published Nov 2, 2022, 5:55 PM IST

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది.  తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో  6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఆ  తర్వాత ఉత్కంఠంగా సాగిన పోరులో బంగ్లాదేశ్ పై 5 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. 


తెలుగులో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి  దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన చిత్రం సై గుర్తుందా..? ఆ సినిమాలో  చివర్లో రగ్బీ మ్యాచ్ ఆడుతూ  నితిన్ వాళ్ల జట్టు ఓటమి  అంచుల వరకు వెళ్తుంది.  బిక్షు యాదవ్ (విలన్) టీమ్ ఆటకు నితిన్ టీమ్  భయపడిపోతుంది. ఆటగాళ్లందరికీ గాయాలు. కానీ  మ్యాచ్ లో రెండో భాగం ప్రారంభమవ్వడానికి ముందు నితిన్ టీమ్ కోచ్ రాజీవ్ కనకాల  ఆటగాళ్లలో స్ఫూర్తిని  నింపే  స్పీచ్ ఇస్తాడు.  ఆ స్పీచ్ తర్వాత నితిన్ వాళ్ల జట్టు  బిక్షు యాదవ్ టీమ్ ను తుక్కుతుక్కుగా ఓడిస్తుంది.  ఇండియా-బంగ్లాదేశ్ మ్యాచ్ లో కూడా  సరిగ్గా అదే జరిగిందేమో అనిపిస్తుంది. వర్షం రాకముందు భారత జట్టు ఆటగాళ్ల ముఖాల్లో  నిస్సహాయత కనిపించింది. కానీ వాన వెలిశాక టీమిండియా తన అసలైన ఆటను బయటపెట్టింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ గురించి చెప్పుకోవాలంటే వర్షం రాక ముందు వర్షం వచ్చిన  తర్వాత  అని చెప్పుకోవచ్చు. 

టీ20 ప్రపంచకప్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది.  తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో  6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో  బంగ్లాదేశ్ తొలి ఏడు ఓవర్ల వరకు  అడ్డూ అదుపూ లేకుండా బాదింది. కానీ వరుణుడు అంతరాయం కలిగించిన తర్వాత ఆ జట్టు ఫేట్ మారిపోయింది. లక్ష్యాన్ని డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 16 ఓవర్లలో 151 పరుగులకు కుదించారు.  లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్.. 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఫలితంగా భారత్.. 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

Latest Videos

వర్షం రాక ముందు.. 

భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ ఓపెనర్లు ఆ జట్టుకు  సాలిడ్ ఆరంభాన్ని అందించారు.  లిటన్ దాస్ (27 బంతుల్లో 60, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) వన్ మ్యాన్ షో చేశాడు. తొలి ఓవర్లో భువనేశ్వర్ పరుగులేమీ ఇవ్వకపోయినా.. అర్ష్‌దీప్ వేసిన రెండో ఓవర్లో లిటన్.. మూడు బౌండరీలు బాదాడు. ఆ తర్వాత భువనేశ్వర్ ఓవర్లో.. 6, 4, 4, కొట్టాడు. 3వ ఓవర్లకే బంగ్లా స్కోరు 30 చేరింది. 

undefined

షమీ వేసిన నాలుగో ఓవర్లో 5 పరుగులే  ఇచ్చాడు. కానీ ఆరో ఓవర్లో లిటన్ అతడిని కూడా  ఆటాడుకున్నాడు.   తొలి బంతికే భారీ సిక్సర్ బాదాడు. దీంతో 21 బంతుల్లోనే అతడి హాప్ సెంచరీ పూర్తయింది. అదే ఓవర్లో  మరో ఫోర్ కొట్టిన లిటన్.. బంగ్లా స్కోరును 60కి చేర్చాడు.  

పవర్ ప్లే తర్వాత  స్పిన్నర్ ను దించిన రోహిత్.. ఏడో ఓవర్ ను అక్షర్ పటేల్ తో వేయించాడు. ఈ ఓవర్లో ఆరు పరుగులొచ్చాయి. అదే సమయానికి వర్షం రావడంతో మ్యాచ్ కు  అరగంట సేపు అంతరాయం కలిగింది.  ఆట ఆగే సమయానికి  బంగ్లా 7 ఓవర్లకు 66 పరుగులు చేస్తే అందులో లిటన్ దాస్ వే 59 పరుగులు కావడం గమనార్హం. మరో ఓపెనర్ నజ్ముల్ హోసేన్ (21).. 16 బంతులాడి ఏడు పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఆ సమయంలో వర్షం గనక ఆగకుంటే డక్ వర్త్ లూయిస్ ప్రకారం బంగ్లా విజయం ఖరారయ్యేదే.. కానీ వర్షం ఆగడంతో ఆట తిరిగి ప్రారంభమైంది. 

వర్షం తర్వాత.. 

వర్షం వెలిశాక మ్యాచ్ ను డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో  బంగ్లా టార్గెట్ ను  16 ఓవర్లకు 151కు కుదించారు. అంటే అప్పటికీ  బంగ్లా 9 ఓవర్లలో 85 పరుగులు చేయాల్సి ఉంది.  అప్పుడు మొదలైంది అసలు ఆట.  మ్యాచ్ తిరిగి  ప్రారంభమైన రెండో బంతికి  జోరుమీదున్న లిటన్ దాస్ ను కెఎల్ రాహుల్ రనౌట్ చేశాడు. ఆ తర్వాత మరో ఓపెనర్  శాంతో  4,6 తో దాస్ బాధ్యతలు తీసుకుందామని చూసినా  భారత్ అతడికి ఆ అవకాశమివ్వలేదు. షమీ వేసిన పదో ఓవర్ తొలి బంతికి అతడు సూర్యకుమార్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అశ్విన్ వేసిన 11వ ఓవర్లో షకీబ్ అల్ హసన్ (13) రెండు ఫోర్లు బాదాడు. కానీ అర్ష్‌దీప్ సింగ్ బంగ్లాకు డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. తొలి బంతికి అఫిఫ్ హోసేన్ (3) ను, ఐదో బంతికి షకిబ్ ను ఔట్ చేశాడు.   దీంతో ఈ మ్యాచ్ లో భారత్ మళ్లీ పోటీలోకి వచ్చింది. 

ఆ తర్వాత హార్ధిక్ పాండ్యా.. 13వ ఓవర్లో తొలి బంతిని యాసిర్ అలీ (1)ని ఐదో బంతికి మొసాదేక్ హోసేన్ (6) ను పెవిలియన్ చేర్చాడు.  అర్ష్‌దీప్ వేసిన 14వ ఓవర్లో 12 పరుగులు రాగా.. హార్దిక్ పాండ్యా 15వ ఓవర్లో 11 పరగులొచ్చాయి. ఇక అర్ష్‌దీప్ వేసిన చివరి ఓవర్లో 19 పరుగులు అవసరం కాగా.. ఆ జట్టు 14 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత్.. ఐదు పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. 

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన  భారత్.. రోహిత్ శర్మ (2) వికెట్ ను త్వరగా కోల్పోయింది. కానీ కెఎల్ రాహుల్ (50) విరాట్ కోహ్లీ (64 నాటౌట్)తో కలిసి రెండో వికెట్ కు  67 పరుగులు జతచేశాడు. దూకుడుగా ఆడిన రాహుల్ హాఫ్ సెంచరీ తర్వాత  నిష్క్రమించినా..  సూర్యకుమార్ యాదవ్ (16 బంతుల్లో 30, 4 ఫోర్లు)  ఉన్నంతసేపు దాటిగా ఆడాడు. సూర్యతో కలిసి కోహ్లీ మూడో వికెట్ కు 38 పరుగులు జోడించాడు.  ఆ తర్వాత హార్ధిక్ పాండ్యా (5), దినేశ్ కార్తీక్ (7), అక్షర్ పటేల్ (7) లు విఫలమయ్యారు.

click me!