టీ20 వరల్డ్ కప్ 2022 ఫైనల్: టాస్ గెలిచిన ఇంగ్లాండ్... మళ్లీ అదే నిర్ణయం...

By Chinthakindhi Ramu  |  First Published Nov 13, 2022, 1:06 PM IST

T20 World cup 2022 Final Pakistan vs England: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్... సెమీస్ జట్లలో మార్పులు లేకుండా ఫైనల్ బరిలో ఇరు జట్లు...


ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టీమిండియాతో జరిగిన సెమీ ఫైనల్‌లో 170 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఛేదించిన ఇంగ్లాండ్ జట్టు... ఫైనల్ మ్యాచ్‌లోనూ లక్ష్యఛేదనకే మొగ్గు చూపింది...

2007 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఫైనల్ చేరిన పాకిస్తాన్, ఆ తర్వాతి ఎడిషన్‌లో టైటిల్ నెగ్గింది. 2009 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి, టైటిల్ సాధించింది పాకిస్తాన్.ఆ తర్వాత పాకిస్తాన్ ఫైనల్ చేరడం ఇదే మొదటిసారి. 13 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతోంది పాకిస్తాన్...

Latest Videos

undefined

మరోవైపు ఇంగ్లాండ్ కూడా ఫైనల్ చేరడం ఇది మూడో సారి. 2010 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాని ఓడించి, టైటిల్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు, 2016 ఎడిషన్‌లోనూ ఫైనల్ చేరింది. అయితే 2016 ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై వెస్టిండీస్ విజయం సాధించి రెండోసారి టైటిల్ గెలిచింది...

ఆరేళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఫైనల్ చేరిన ఇంగ్లాండ్, రెండోసారి టీ20 వరల్డ్ కప్ గెలవాలని భావిస్తోంది. ఇరు జట్లలో ఏ జట్టు టైటిల్ గెలిచినా వెస్టిండీస్ తర్వాత రెండోసారి టైటిల్ గెలిచిన జట్టుగా నిలుస్తాయి...

మెల్‌బోర్న్‌లో ఈ రోజు వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. గ్రూప్ స్టేజీలో ఇరు జట్లు కూడా రెండో స్థానంలో నిలిచి, సెమీస్‌కి అర్హత సాధించాయి. నేడు వర్షం కారణంగా ఆట నిలిచి పోతే రేపు రిజర్వు డేలో మ్యాచ్‌ని పూర్తి చేస్తారు. ఒకవేళ రేపు కూడా వర్షం అంతరాయం కలిగించి ఆట సాధ్యం కాకపోతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.. 

ఇరు జట్లు కూడా సెమీ ఫైనల్ గెలిచిన జట్లతోనూ ఫైనల్‌ ఆడుతున్నాయి. టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో ఇప్పటిదాకా పాకిస్తాన్, ఇంగ్లాండ్‌పై విజయం సాధించలేకపోయింది. ఇంగ్లాండ్, పాకిస్తాన్ మధ్య టీ20 వరల్డ్ కప్‌లో రెండు మ్యాచులు జరగగా రెండింట్లోనూ ఇంగ్లాండ్‌నే విజయం వరించింది. 2009 గ్రూప్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ని 48 పరుగుల తేడాతో ఓడించిన ఇంగ్లాండ్, 2010లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది...

 పాకిస్తాన్ జట్టు: బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ హారీస్, షాన్ మసూద్, ఇఫ్తికర్ అహ్మద్, షాదబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, నసీం షా, హారీస్ రౌఫ్, షాహీన్ ఆఫ్రిదీ

 

ఇంగ్లాండ్ జట్టు:  జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్, ఫిలిప్ సాల్ట్, బెన్ స్టోక్స్, హారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ ఆలీ, సామ్ కుర్రాన్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, అదిల్ రషీద్

 

click me!