T20 World Cup 2022: పొట్టి ప్రపంచకప్ సాధనే లక్ష్యంగా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన రోహిత్ శర్మ అండ్ కో.. ఆ దిశగా మరో ముందడుగు వేసింది. సిడ్నీలో నెదర్లాండ్స్‌తో ముగిసిన మ్యాచ్‌లో ఈజీ విక్టరీ కొట్టి గ్రూప్-2 లో అగ్రస్థానంలో నిలిచింది.
టీ20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై ఉత్కంఠ పోరులో నెగ్గిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్ మీద ఈజీ విక్టరీ కొట్టింది. సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో నెదర్లాండ్స్‌పై 56 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రోహిత్ శర్మ (39 బంతుల్లో 53, 4 ఫోర్లు, 3 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (44 బంతుల్లో 62 నాటౌట్, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ల క్లాస్ ఆటకు తోడు చివర్లో సూర్యకుమార్ యాదవ్ (25 బంతుల్లో 51, 7 ఫోర్లు, 1 సిక్స్) ఊరబాదుడు తోడై నిర్ణీత 20 ఓవర్లలో భారత్.. 2 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. 180 పరుగుల లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్.. 9 వికెట్ల నష్టానికి 123 పరుగులకే పరిమితమైంది.
భారీ లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్‌కు ఆశించిన ఆరంభమేమీ దక్కలేదు. తొలి ఓవర్ వేసిన భువనేశ్వర్ మెయిడిన్ వేశాడు. తన రెండో ఓవర్లో కూడా భువీ.. ఓపెనర్ విక్రమ్ జీత్ సింగ్ (9) ను బౌల్డ్ చేశాడు. ఈ ఓవర్ కూడా మెయిడిన్ అయింది.
నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో అక్షర్ పటేల్.. రెండో బంతికి మ్యాక్స్ ఓడౌడ్ (16) ను క్లీన్ బౌల్డ్ చేశాడు. తొలి పవర్ ప్లే ముగిసేసరికి నెదర్లాండ్స్.. 2 వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది. పదో ఓవర్లో అక్షర్ మరోసారి నెదర్లాండ్స్ కు దెబ్బకొట్టాడు. క్రీజులో కుదురుకుంటున్న బస్ డి లీడె (16) ను ఔట్ చేశాడు. ఆ తర్వాత డచ్ జట్టు క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయింది.
A comprehensive win for India at the SCG against Netherlands 🙌🏻 | | 📝: https://t.co/o5TLZpv2Gs pic.twitter.com/eeXMcLzU76
— T20 World Cup (@T20WorldCup)అశ్విన్ 12.1వ ఓవర్లో అకర్‌మన్ (17) తో పాటు టాప్ కూపర్ (9) ను కూడా పెవిలియన్ కు చేర్చాడు. 15 ఓవర్లకు నెదర్లాండ్స్ 5 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. 16.3 ఓవర్లో షమీ.. టిమ్ ప్రింగిల్ (20) ను ఔట్ చేయగా.. 17 వ ఓవర్ మూడో బంతికి ఎడ్వర్డ్స్ (5)ను భువీ ఔట్ చేశాడు. అర్ష్‌దీప్ వేసిన 18వ ఓవర్ నాలుగు, ఐదో బంతికి బీక్ (3), ఫ్రెండ్ క్లాసెన్ (0) ఔటయ్యారు. చివరి ఓవర్లో అర్ష్‌దీప్.. హ్యాట్రిక్ ఫోర్లు ఇవ్వడంతో నెదర్లాండ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. ఫలితంగా భారత్ 56 పరుగుల తేడాతో విజయం సాధించింది.
భారత బౌలర్లలో అర్ష్‌దీప్, భువనేశ్వర్, అక్షర్ పటేల్, అశ్విన్ లు తలా రెండు వికెట్లు తీశారు. మహ్మద్ షమీకి ఒక వికెట్ దక్కింది. భువీ.. తన రెండు ఓవర్లు మెయిడిన్ చేయడం గమనార్హం.
ఈ విజయంతో భారత జట్టు గ్రూప్-2లో టాప్ లో నిలిచింది. భారత్ రెండు మ్యాచ్ (పాకిస్తాన్, నెదర్లాండ్స్) లు ఆడి రెండింటిలోనూ విజయాలు సాధించింది. తద్వారా భారత్ కు నాలుగు పాయింట్లు దక్కాయి. ఈ మెగా టోర్నీలో భారత జట్టు ఆదివారం సౌతాఫ్రికాతో తలపడనుంది.
A clinical victory sends to the 🔝 of Group B 🔥 pic.twitter.com/NI0toX4VOB
— SunRisers Hyderabad (@SunRisers)