రోహిత్, కోహ్లీ, సూర్య హాఫ్ సెంచరీలు... నెదర్లాండ్స్‌ ముందు భారీ టార్గెట్ పెట్టిన టీమిండియా...

By Chinthakindhi Ramu  |  First Published Oct 27, 2022, 2:20 PM IST

నెదర్లాండ్స్ ముందు 180 పరుగుల టార్గెట్ పెట్టిన టీమిండియా... మరోసారి విఫలమైన కెఎల్ రాహుల్... రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలు..


నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత టాపార్డర్ టాప్ క్లాస్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది.. కెఎల్ రాహుల్ మినహా రోహిత శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలతో చెలరేగి నెదర్లాండ్స్ ముందు భారీ టార్గెట్ పెట్టారు.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి  179 పరుగుల స్కోరు చేసింది...

గత మ్యాచ్‌లో 4 పరుగులు చేసి నిరాశపరిచిన కెఎల్ రాహుల్, నెదర్లాండ్స్‌పైన కూడా ప్రతాపం చూపించలేకపోయాడు. 12 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, వాన్ మీకీరన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అంపైర్ అవుట్‌గా ప్రకటించగానే కెఎల్ రాహుల్ డీఆర్‌ఎస్ కూడా తీసుకోకుండా పెవిలియన్ చేరాడు. అయితే టీవీ రిప్లైలో బంతి వికెట్లను మిస్ అవుతున్నట్టు స్పష్టంగా కనిపించింది...

Latest Videos

రోహిత్ శర్మను కూడా అంపైర్ ఎల్బీడబ్ల్యూ అవుట్‌గా ప్రకటించగా డీఆర్‌ఎస్‌లో బంతి బ్యాటుని తాకినట్టు కనిపించడంతో బతికిపోయాడు. అలాగే నెదర్లాండ్స్ ఫీల్డర్లు క్యాచులు డ్రాప్ చేయడంతో రెండు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రోహిత్ శర్మ... 39 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగులు చేశాడు...

టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా తరుపున అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ. ఇంతకుముందు యువరాజ్ సింగ్ 33 సిక్సర్లు బాదగా రోహిత్ శర్మ 34 సిక్సర్లతో టాప్‌లోకి వెళ్లాడు. ఓవరాల్‌గా టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా క్రిస్ గేల్ 63 సిక్సర్లతో టాప్‌లో ఉన్నాడు. క్రిస్ గేల్ తర్వాతి ప్లేస్‌లో రోహిత్, యువరాజ్ ఉన్నారు...

రోహిత్ శర్మ అవుటైన తర్వాత సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ కలిసి మూడో వికెట్‌కి అజేయంగా 95 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. ఆరంభంలో బంతికో పరుగు తీస్తూ నెమ్మదిగా ఇన్నింగ్స్ నిర్మించిన విరాట్ కోహ్లీ, డెత్ ఓవర్లలో బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు...

విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగులు చేసి, టీ20 వరల్డ్ కప్‌లో వరుసగా రెండో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 25 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 51 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సిక్సర్ బాది హాఫ్ సెంచరీ అందుకున్నాడు...

click me!