Suryakumar Yadav: దక్షిణాఫ్రికా టూర్‌లో గాయపడిన టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్య కుమార్ యాదవ్ ప్రస్తుతం వాకింగ్ స్టిక్స్ సాయంతో నడుస్తున్నాడు. కాలిపై ఎలాంటి ఒత్తిడి పడకుండా ఈ మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.
Suryakumar Yadav: దక్షిణాఫ్రికా టూర్‌లో గాయపడిన సూర్యకుమార్ యాదవ్ తాజాగా ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇందులో అతను కాలికి ప్లాస్టర్ వేసుకుని కనిపించాడు. దీనితో పాటు.. అతను ఊతకర్రల సహాయంతో నడుస్తూ కనిపిస్తాడు. ఈ వీడియోను ఇండియన్ మిస్టర్ 360 పంచుకుంటూ.. 'గాయాలు ఎప్పుడూ సరదాగా ఉండవని నేను కొంత తీవ్రంగా చెప్పాలనుకుంటున్నాను. అయినప్పటికీ.. నేను ముందుకు నడుస్తాను. త్వరలో పూర్తిగా ఫిట్‌గా ఉంటానని వాగ్దానం చేస్తాను. అప్పటి వరకు, మీరందరూ సెలవు సమయాన్ని ఆస్వాదిస్తున్నారని, ప్రతిరోజూ చిన్న చిన్న ఆనందాలను అనుభవిస్తున్నారని నేను ఆశిస్తున్నాను.'అనే క్యాప్షన్ ఇచ్చిన సూర్య వీడియోను షేర్ చేశాడు. సూర్య కుమార్ షేర్ చేసిన వీడియోలో వెల్ కమ్ సినిమాలోని ఓ డైలాగ్ కూడా ప్లే అవుతోంది.
ఆఫ్ఘనిస్థాన్‌తో ఆడటం కష్టమే..
జనవరి 11 నుంచి అఫ్గానిస్థాన్‌తో జరిగే 3వ టీ20 సిరీస్‌లో సూర్య ఆడే అవకాశం లేదు. మీడియా కథనాల ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ వరకు గాయం నుండి కోలుకునే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయి. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో సూర్యకుమార్ చిక్సిత పొందుతున్నారు. జనవరిలో ఆఫ్ఘనిస్థాన్‌తో భారత్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. జనవరి 11న మొహాలీలో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. రెండో టీ20 జనవరి 14న ఇండోర్‌లో, మూడో టీ20 బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.
కాగా.. సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో ఫీల్డింగ్ చేస్తుండగా సూర్య గాయపడ్డాడు. దీంతో మైదానం వీడాల్సి వచ్చింది. అతను మైదానాన్ని వీడిన తర్వాత.. వైస్ కెప్టెన్ రవీంద్ర జడేజా జట్టుకు కెప్టెన్సీని తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సూర్య తన నాల్గవ T-20 సెంచరీని సాధించాడు, ఈ మ్యాచ్ లో భారత్ గెలువడంతో మూడు మ్యాచ్‌ల T-20 సిరీస్‌ను సమం అయ్యింది. తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా జరగకపోగా, రెండో టీ20లో సౌతాఫ్రికా విజయం సాధించింది.
దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు, ODI ప్రపంచకప్ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన T-20 మ్యాచ్‌లలో సూర్య టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరించి భారత్‌ను గెలిపించిన విషయం తెలిసిందే. సూర్య గత వారం దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత స్కాన్ చేయగా.. అతనికి చీలమండ గాయం ఉందని తేలింది. అన్నీ కుదిరితే ఫిబ్రవరి మొదటి వారం నాటికి సూర్య రికవరీ కానున్నారు. ఐపీఎల్‌కు ముందు ఫిబ్రవరిలో జరగనున్న దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో సూర్య తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటాడని అంతా భావించారు.