
ఇంగ్లాండ్ కౌంటీలలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సర్రే క్రికెట్ టీమ్ చరిత్ర సృష్టించింది. క్రికెట్ లో అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. టెస్టు క్రికెట్ లో 350 ప్లస్ టార్గెట్ ను ఛేదించడానికి జట్లు నానా తంటాలు పడుతుంటే సర్రే మాత్రం ఏకంగా 501 పరుగుల టార్గెట్ ను దంచేసింది. కెంట్ విధించిన 501 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన సర్రే సరికొత్త రికార్డులు సృష్టించింది. గతంలో కౌంటీ క్రికెట్ చరిత్రలో 500 ప్లస్ టార్గెట్ ను ఛేదించిన రెండో టీమ్ గా చరిత్రకెక్కింది. 1925 తర్వాత ఒక జట్టు 500 ప్లస్ టార్గెట్ ను ఛేదించడం ఇదే ప్రథమం.
కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ వన్ - 2023 టోర్నీలో భాగంగా కెంట్‌బర్రీలోని సెయింట్ లారెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో కెంట్ జట్టు తొలుత 301 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ కెంట్ తరఫున ఈ మ్యాచ్ లోనే అరంగేట్రం చేశాడు.
సర్రే తన తొలి ఇన్నింగ్స్ లో 43.2 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌట్ అయింది. సర్రే ఇన్నింగ్స్ లో అర్ష్‌దీప్ 14 ఓవర్లు వేసి 2 వికెట్లు పడగొట్టాడు. 156 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ లో కెంట్.. 81 ఓవర్లలో 344 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో సర్రే ముందు 500 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
501 పరుగుల భారీ లక్ష్యంలో 91 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన సర్రేను డొమినిక్ సిబ్లే (415 బంతులలో 140 నాటౌట్), జేమి స్మిత్ (114), బెన్ ఫోక్స్ (124) లు సెంచరీలు చేసి విజయాన్ని అందించారు. సుమారు రెండు రోజుల పాటు ఆడిన సిబ్లే ఓపికగా ఆడుతూ వికెట్ కాపాడుకోవడమే గాక చివరిదాకా క్రీజులో నిలిచి సర్రేకు విజయాన్ని అందించాడు. ఆట ఆఖర్లో విల్ జాక్స్ (19), జోర్డాన్ క్లార్క్ (26 నాటౌట్) లు ధాటిగా ఆడి సర్రేకు విజయాన్ని అందించారు. తొలి ఇన్నింగ్స్ లో 2 వికెట్లు తీసిన అర్ష్‌దీప్.. రెండో ఇన్నింగ్స్ లో కూడా రెండు వికెట్లు తీశాడు.
కాగా 1925లో ట్రెంట్ బ్రిడ్జి వేదికగా నాట్స్ తో జరిగిన మ్యాచ్ లో మిడిల్‌సెక్స్ టీమ్ 502 పరుగుల టార్గెట్ ను ఛేదించింది. ఇప్పుడు ఆ జాబితాలో సర్రే కూడా నిలిచింది. ఇదిలా ఉండగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో హయ్యస్ట్ ఛేజ్ రికార్డు భారత దేశవాళీలోనే నమోదైంది. 2009-10 సీజన్ లో దులీప్ ట్రోఫీలో భాగంగా వెస్ట్ జోన్ - సౌత్ జన్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో వెస్ట్ జోన్.. సౌత్ జోన్ నిర్దేశించిన 537 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్.. 190 బంతుల్లో 19 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 210 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.