
ఆసియా కప్ 2023 టోర్నీపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. షెడ్యూల్ ప్రకారం 2023 ఆసియా కప్‌కి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సింది. అయితే పాకిస్తాన్‌లో పర్యటించేందుకు టీమిండియా సుముఖత వ్యక్తం చేయకపోవడంతో డ్రామా మొదలైంది..
యూఏఈలో, ఇంగ్లాండ్‌లో కూడా ఆసియా కప్ 2023 టోర్నీ నిర్వహించబోతున్నారని ప్రచారం జరిగింది. ఎట్టకేలకు ఆసియా కప్ 2023 షెడ్యూల్‌పై ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నుంచి అధికారిక ప్రకటన వచ్చిది..
ఆగస్టు 31న ప్రారంభమయ్యే ఆసియా కప్ 2023 టోర్నీ, సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్‌తో పాటు ఆసియా కప్‌లో ఈసారి నేపాల్ కూడా మొట్టమొదటిసారిగా ఆడబోతోంది.
మొత్తంగా 13 మ్యాచుల ఈ టోర్నీని హైబ్రీడ్ మోడల్‌లో నిర్వహించబోతున్నట్టు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. నాలుగు మ్యాచులు పాకిస్తాన్‌లో జరుగబోతుంటే, మిగిలిన మ్యాచులన్నీ శ్రీలంక వేదికగా జరుగుతాయి..
ఆసియా కప్ 2023 ఎడిషన్‌లో మూడేసి జట్లుగా రెండు గ్రూప్‌లుగా మొదటి రౌండ్ మ్యాచులు జరుగుతాయి. ఆ తర్వాత సూపర్ 4 రౌండ్‌లో టాప్‌లో నిలిచిన రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది..
పాకిస్తాన్‌లో జరిగే నాలుగు మ్యాచులు కూడా పాక్ ఆడే గ్రూప్, సూపర్ 4 రౌండ్ మ్యాచులే... సూపర్ 4 మ్యాచులతో పాటు ఫైనల్ మ్యాచ్‌ని కూడా శ్రీలంకలోనే నిర్వహించబోతున్నారు. ఇండియా, పాకిస్తాన్, నేపాల్ ఓ గ్రూప్‌లో ఉంటే శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్ రెండో గ్రూప్‌లో ఉన్నాయి. కాబట్టి మరీ అద్భుతం జరిగితే తప్ప గ్రూప్ 1 నుంచి ఇండియా, పాకిస్తాన్ జట్లు సూపర్ 4 రౌండ్‌కి అర్హత సాధించడం గ్యారెంటీ...
గ్రూప్ 2లో ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘాన్‌లలో ఏ జట్టు సూపర్ 4 చేరుతుందో అంచనా వేయడం మాత్రం కాస్త కష్టమే. ఎందుకంటే ఈ మూడు జట్లు కూడా ఎప్పుడు ఎలా ఆడతాడో ఎవ్వరూ ఊహించలేరు. ఒకవేళ శ్రీలంక గ్రూప్ స్టేజీ నుంచి నిష్కమిస్తే మాత్రం లంకలో నిర్వహించే మిగిలిన సూపర్ 4 మ్యాచులకు పెద్దగా ఆదరణ దక్కకపోవచ్చు..
2018 నుంచే ఆసియా కప్ టోర్నీ, తటస్థ వేదికలపై జరుగుతూ వస్తోంది. 2022 ఆసియా కప్ కూడా యూఏఈలోనే జరిగింది. ఆసియా కప్ 2022 ప్రారంభానికి ముందే బీసీసీఐ సెక్రటరీ జై షా, ఆసియా కప్ 2023 టోర్నీ పాకిస్తాన్‌లో జరిగితే టీమిండియా అక్కడికి వెళ్లదని, ఈసారి కూడా తటస్థ వేదికపైనే టోర్నీ నిర్వహిస్తామని కామెంట్ చేశాడు..
ఆ వ్యాఖ్యలతో దుమారం రేగింది. పీసీబీ కూడా ఆసియా కప్ 2023 టోర్నీ విషయంలో పట్టు వదల్లేదు. ఆసియా కప్ 2023 టోర్నీని పాకిస్తాన్ నుంచి తరలిస్తే, తాము ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ నుంచి తప్పుకుంటామని హెచ్చరించింది..సుదీర్ఘ హైడ్రామా మధ్య అనేక సార్లు సమావేశమైన ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఎట్టకేలకు ఆసియా కప్ 2023 షెడ్యూల్ విషయంలో క్లారిటీ తెచ్చేసింది...