SRH vs KKR: బ్యాటింగ్, బౌలింగ్ లో దుమ్మురేపిన సన్‌రైజర్స్ హైదరాబాద్

Published : May 25, 2025, 11:41 PM IST
SRH crushing victory over KKR IPL 2025

సారాంశం

IPL 2025 SRH vs KKR: బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుతమైన ప్రదర్శనతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2025లో తన చివరి మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై ఘన విజయం సాధించింది. 

IPL 2025 SRH vs KKR: ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. 279 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కోల్‌కతా 168 పరుగులకే కుప్పకూలింది. మనీష్ పాండే (37) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

ఓపెనర్లు సునీల్ నరైన్, క్వింటన్ డికాక్ 3.3 ఓవర్లలో 37 పరుగులు జోడించారు. 17 బంతుల్లో 31 పరుగులు చేసిన సునీల్ నరైన్‌ను జయదేవ్ ఉనద్కట్ క్లీన్ బౌల్డ్ చేశాడు. మూడో స్థానంలో వచ్చిన కెప్టెన్ అజింక్య రహానే (15) నిలదొక్కుకోలేకపోయాడు. ఉనద్కట్ అతన్ని కూడా పెవిలియన్ చేర్చాడు. డికాక్ (9) కూడా త్వరగానే వెనుదిరగడంతో కోల్‌కతా ఒత్తిడిలోకి జారుకుంది. బడా హిట్టర్లు రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్ కూడా నిరాశపరిచారు. వీరిద్దరినీ వరుస బంతుల్లో హర్ష్ దుబే అవుట్ చేశాడు. ఒక సిక్సర్ బాదిన తర్వాత మరోసారి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రింకూను నితీష్ కుమార్ రెడ్డి బౌండరీ లైన్ వద్ద క్యాచ్ పట్టాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ఆండ్రీ రస్సెల్‌ను తొలి బంతికే హర్ష్ దుబే ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. 

ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అంగ్క్రిష్ రఘువంశి (14 పరుగులు) పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. క్రీజులోకి వచ్చిన రమణ్‌దీప్ సింగ్ హర్ష్ దుబే వేసిన వరుస బంతుల్లో రెండు బౌండరీలు బాదినా, మూడో బంతికి బౌల్డ్ అయ్యాడు. చివరి 6 ఓవర్లకు మ్యాచ్ చేరుకునే సమయానికి కోల్‌కతా 7 వికెట్లకు 111 పరుగులు చేసింది. 15వ ఓవర్లో అభిషేక్ శర్మ బౌలింగ్ లో ఒక బౌండరీ, రెండు సిక్సర్లు బాది హర్షిత్ రాణా స్కోరును పెంచాడు. తర్వాతి ఓవర్లో ఇషాన్ మలింగపై మనీష్ పాండే మూడు సిక్సర్లు బాదాడు. దీంతో 16 ఓవర్లకు కోల్‌కతా స్కోరు 150 దాటింది. 8వ వికెట్‌కు మనీష్ పాండే, నితీష్ రాణా 21 బంతుల్లో 50 పరుగులు జోడించారు.

18వ ఓవర్లో మనీష్ పాండే (23 బంతుల్లో 37 పరుగులు) ఔటవ్వడంతో కోల్‌కతా ఓటమి ఖాయమైంది. వైభవ్ అరోరాను ఉనద్కట్ రనౌట్ చేయడంతో కోల్‌కతా 9వ వికెట్ కూడా కోల్పోయింది. చివరికి హర్షిత్ రాణాను ఔట్ చేసి ఇషాన్ మలింగ కోల్‌కతా పతనాన్ని ఖరారు చేశాడు. 

అంతకుముందు సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు సునామీ నాక్ లు ఆడారు.  అభిషేక్ శర్మ కేవలం 16 బంతుల్లోనే 32 పరుగుల ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు. ట్రావిస్ హెడ్ ధనాధన్ బ్యాటింగ్ తో హాఫ్ సెంచరీ కొట్టాడు. 40 బంతుల్లో 76 పరుగుల తన ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ పరుగుల సునామీ రేపాడు.  17 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ కొట్టాడు క్లాసెన్. ఆ తర్వాత దానిని సెంచరీగా మార్చాడు. కేవలం 37 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. తన సెంచరీ ఇన్నింగ్స్ ( 105 పరుగులు) లో 7 ఫొర్లు, 9 సిక్సర్లు బాదాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !