''స్మిత్ ఓ ఛీటర్ మాత్రమే...ఎప్పటికీ గొప్ప ఆటగాడు కాలేడు''

By Arun Kumar PFirst Published Sep 9, 2019, 6:38 PM IST
Highlights

యాషెస్ సీరిస్ లో అదరగొడుతున్న ఆసిస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ పై ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ హర్మిసన్ విరుచుకుపడ్డాడు.  అతడెంత గొప్పగా ఆడినా ప్రజల దృష్టిలో ఎప్పటికీ ఛీటరే అంటూ విమర్శించాడు.  

ప్రతిష్టాత్మక యాషెస్ సీరిస్ లో ఆస్ట్రేలియా జట్టు అదరగొడుతోంది. కాదు...కాదు ఆసిస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ అదరగొడుతున్నాడు. ఈ సీరిస్ లో స్మిత్ ప్రదర్శనకు పిధా అయిన అభిమానుల అభిప్రాయమిది. వరుస సెంచరీలతో చెలరేగుతున్న అతడిని ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆసిస్ మాజీలు, అభిమానులు మరో అడుగు ముందుకేసి అంతర్జాతీయ క్రికెట్లో స్మితే నెంబర్ వన్ బ్యాట్స్ మెన్ అంటూ ఓ బిరుదును కూడా అందించారు. అయితే ఇంగ్లాండ్ మాజీ  ప్లేయర స్టీవ్ హర్మిసన్  మాత్రం స్మిత్ ప్రదర్శనపై ఘాటుగా స్పందించాడు.  

''స్టీవ్ స్మిత్ ను క్రికెట్ ప్రియులు ఎప్పటికీ ఓ ఛీటర్ గానే గుర్తుంచుకుంటారు. గొప్ప ఆటగాడిగా మాత్రం కాదు. యాషెస్ సీరిస్ లో ప్రస్తుతం అతడు వరుస సెంచరీలతో చెలరేగుతున్నా ఇది ఎవ్వరికీ ఎక్కువకాలం గుర్తుండదు. కానీ అతడు ఛీటర్ అన్న విషయం క్రికెట్ బ్రతికున్నంతకాలం అందరికి గుర్తుంటుంది. 

ఓ మోసగాడు ఎంత గొప్పగా ఆడినా నా దృష్టిలో ఎప్పటికీ గొప్ప ఆటగాడు కాలేడు. గతంలో అతడు బాల్ ట్యాపరింగ్ కు పాల్పడినప్పుడే గౌరవాన్ని కోల్పోయాడు.  మోసగాడని తెలిసిన తర్వాత తియ్యగా మాట్లాడుతూ పొగడటం నా వల్ల కాదు. అతడు కేవలం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పరువు తీయడమే  కాదు అంతర్జాతీయ క్రికెట్ మొత్తానికి తలవంపులు తీసుకొచ్చాడు. అలాంటి వ్యక్తిని ఇప్పుడంతా గొప్ప ఆడగాడంటూ పొగడటం నాకు అస్సలు నచ్చడంలేదు.'' అంటూ స్మిత్ పై హర్మిసన్ విరుచుకుపడ్డాడు. 

స్టీవ్ స్మిత్ యాషెస్ సీరిస్ ఆరంభం నుండి వరుస సెంచరీలతో అదరగొడుతున్నాడు. మొదటి టెస్ట్ రెండు ఇన్నింగ్సుల్లోనూ సెంచరీలతో రాణించి ఆసిస్ ను విజయతీరానికి చేర్చాడు. అయితే గాయం కారణంగా రెండో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్, మూడో టెస్ట్ మొత్తానికిి దూరమయ్యాడు. ఇక నాలుగో టెస్ట్ లో మళ్లీ  జట్టులోకి పునరాగమనం చేసిన అతడు మరింత కసితో ఆడాడు. ఓ డబుల్ సెంచరీ,మరో హాఫ్ సెంచరీతో  చెలరేగి జట్టును గెలిపించాడు. దీంతో ఇంగ్లాండ్ పై ఆసిస్ 2-1 ఆధిక్యాన్ని పొందింది. ఇలా ఒంటిచేత్తో జట్టును గెలిపిస్తున్న స్టీవ్ స్మిత్ ను అందరూ ప్రశంసిస్తుంటే హర్మిసన్ మాత్రం ఘాటుగా విమర్శించాడు. 

click me!