
శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) తీసుకున్న నిర్ణయంతో ఓ యువ ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇటీవలే ముగిసిన T20 World Cupలో Srilanka తరఫున అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో టాప్-3లో ఉన్న Bhanuka Rajapaksa.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తాను తప్పుకుంటానని SLCకి లేఖ పంపాడు. అయితే దీనిపై ఇంకా ఎస్ఎల్సీ ఎటువంటి నిర్ణయమూ తీసుకోకపోగా.. తాను మాత్రం శ్రీలంక క్రికెట్ పెట్టే ఆంక్షల్ని భరించేందుకు సిద్ధంగా లేనని తెలిపాడు. Srilanka తరఫున 5 వన్డేలు, 18 టీ20లలో ప్రాతినిథ్యం వహించిన రాజపక్స రిటైర్మెంట్ పై పలువురు సీనియర్ ఆటగాళ్లు స్పందించారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు.
శ్రీలంక తరఫున అండర్-19 నుంచే జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న రాజపక్స.. అక్కడ మెరిసి ఆ తర్వాత సీనియర్ జట్టులోకి వచ్చాడు. గతేడాది శ్రీలంకకు వెళ్లిన భారత జట్టు పర్యటనలోనే అతడు వన్డేలలో అరంగ్రేటం చేశాడు. ఆ జట్టు తరఫున వన్డేలలో 89 పరుగులు చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఇక టీ20లలో లంక తరఫున 18 మ్యాచులు ఆడిన అతడు.. 320 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి.
రిటైర్మెంట్ ఎందుకు..?
శ్రీలంక క్రికెట్ ఇటీవలే కొత్త ఫిట్నెస్ మార్గదర్శకాలు విడుదల చేసింది. దీని ప్రకారం.. ఆటగాళ్లకు కొన్ని ఫిట్నెస్ టెస్టులను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం.. జట్టులో ఉన్న ప్రతి ఆటగాడు 8.10 నిమిషాలలో రెండు కిలోమీటర్లు పరుగెత్తాలి. ఒకవేళ 8.35 నిమిషాల నుంచి 8.55 నిమిషాల మధ్య రెండు కిలోమీటర్ల దూరం పరిగెత్తితే ఆటగాళ్ల వేతనాల్లో కోత పెట్టనున్నారు. ఎంతమేర కోత విధిస్తారన్నది మాత్రం ఇంకా వెల్లడించలేదు. దీంతోపాటు ప్రతి నెలా స్కిన్ టెస్టు నిర్వహించనున్నారు. ఇది బాడీ ఫ్యాట్ ను కొలిచే ఓ పరీక్ష. ఒక పరికరం ద్వారా శరీరంలోని కొవ్వును కొలుస్తారు. స్కిన్ ఫోల్డ్ టెస్టులో 70-85 కంటే తక్కువ ఉన్నవారినే తుది జట్టులో ఉంచుతారు.
అయితే ఈ కొత్త నిబంధనలపై రాజపక్స అసంతృప్తి వ్యక్తం చేశాడు. స్కిన్ ఫోల్డ్ టెస్టు ద్వారా తన సహజ ఆట మీద ప్రభావం పడుతుందని అతడు ఆందోళన చెందుతున్నాడు. తాను ప్రత్యేకంగా ఆడే పవర్ హిట్టింగ్ మీద కూడా ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని రాజపక్స తనవారిదగ్గర వాపోయినట్టు తెలుస్తున్నది. కానీ శ్రీలంక క్రికెట్ కు రాసిన లేఖలో మాత్రం తన కుటుంబం, వ్యక్తిగత జీవిత బాధ్యతలను పంచుకోవడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు పేర్కొన్నాడు.
వద్దు.. ఆలోచించు : లసిత్ మలింగ
Rajapaksa Retirement నిర్ణయంపై శ్రీలంక పేస్ దిగ్గజం Lasith Malinga ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరాడు. ‘అంతర్జాతీయ స్థాయిలో మీ దేశానికి ప్రాతినిథ్యం వహించడం అంత తేలికైన పని కాదు. ఆటగాళ్లు ఎప్పుడూ సవాళ్లను ఎదుర్కుంటారు. భానుక రాజపక్స ఇంకా శ్రీలంక క్రికెట్ కు చాలా సేవ చేయాల్సి ఉందని నేను భావిస్తున్నాను. రిటైర్మెంట్ నిర్ణయాన్ని పునరాలోచించమని నేను కోరుతున్నాను...’ అని ట్వీట్ చేశాడు. మరి దీనిపై రాజపక్స ఏవిధంగా స్పందిస్తాడో వేచి చూడాల్సి ఉంది.