IPL 2022 SRH vs CSK: బోణీ కొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్... సీఎస్‌కేకి వరుసగా నాలుగో ఓటమి...

Published : Apr 09, 2022, 07:04 PM IST
IPL 2022 SRH vs CSK: బోణీ కొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్... సీఎస్‌కేకి వరుసగా నాలుగో ఓటమి...

సారాంశం

IPL 2022: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి సీజన్‌లో తొలి విజయం... వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ సీఎస్‌కేకి తప్పని ఓటమి, ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం...   

ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌‌కి వరుసగా నాలుగో పరాజయాన్ని రుచి చూపిస్తూ, సీజన్‌లో తొలి విజయాన్ని అందుకుంది ఆరెంజ్ ఆర్మీ. వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మిగిలిన 10 మ్యాచుల్లో కనీసం 8 మ్యాచుల్లో గెలిస్తేనే సీఎస్‌కే ప్లేఆఫ్స్ చేరే అవకాశం ఉంటుంది.


155 పరుగుల ఈజీ లక్ష్యఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి శుభారంభం దక్కింది. కేన్ విలియంసన్, అభిషేక్ శర్మ కలిసి తొలి వికెట్‌కి 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మొదటి రెండు మ్యాచుల్లో ఇంప్రెస్ చేయలేకపోయిన యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ, ఐపీఎల్‌ కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు... 

ఓ వైపు యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ హిట్టింగ్‌కి దిగి, షాట్లు ఆడుతుంటే కేన్ మామ, అతనికి స్ట్రైయిక్ ఇవ్వడానికి కూడా ఇబ్బందిపడ్డాడు. జిడ్డు బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌ని విసిగించాడు. 40 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 పరుగులు చేసిన కేన్ విలియంసన్, ముఖేశ్ చౌదరి బౌలింగ్‌లో మొయిన్ ఆలీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

విజయానికి 4 ఓవర్లలో 30 పరుగులు కావాల్సిన దశలో క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో ఓ సిక్స్, రెండు ఫోర్లతో 19 పరుగులు రాబట్టాడు రాహుల్ త్రిపాఠి. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి ఆఖరి 3 ఓవర్లలో 11 పరుగులు కావాల్సి వచ్చింది...

50 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 75 పరుగులు చేసిన అభిషేక్ శర్మ, డ్వేన్ బ్రావో బౌలింగ్‌లో క్రిస్ జోర్డాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. క్రీజులోకి వస్తూనే ఫోర్ బాదిన నికోలస్ పూరన్,  లక్ష్యాన్ని తగ్గించగా రాహుల్ త్రిపాఠి ఫోర్ బాది మ్యాచ్‌ని ముగించాడు. 17.4 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయాన్ని అందుకుంది.. 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. ఓపెనర్ రాబిన్ ఊతప్ప 11 బంతుల్లో ఓ ఫోర్‌తో 15 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. మొదటి మూడు మ్యాచుల్లో ఫెయిల్ అయిన రుతురాజ్ గైక్వాడ్ 13 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు చేసి నటరాజన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...

36 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది చెన్నై సూపర్ కింగ్స్. ఈ దశలో అంబటి రాయుడు, మొయిన్ ఆలీ కలిసి మూడో వికెట్‌కి 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 27 బంతుల్లో 4 ఫోర్లతో 27 పరుగులు చేసిన అంబటి రాయుడు, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో అయిడిన్ మార్క్‌రమ్‌‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేసిన మొయిన్ ఆలీ, అయిడిన్ మార్క్‌రమ్ బౌలింగ్‌లో రాహుల్ త్రిపాఠికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 5 బంతుల్లో 3 పరుగులు చేసిన శివమ్ దూబే, నట్టూ బౌలింగ్‌లో ఉమ్రాన్ మాలిక్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

ఎమ్మెస్ ధోనీ 6 బంతుల్లో 3 పరుగులు చేసి మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.నటరాజన్ వేసిన 19వ ఓవర్‌లో వరుసగా ఓ ఫోర్, సిక్సర్ బాదిన రవీంద్ర జడేజా ఆ ఓవర్‌లో 14 పరుగులు రాబట్టాడు. భువీ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించిన జడ్డూ, కేన్ విలియంసన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

అయితే ఆఖరి ఓవర్‌లో ఏకంగా నాలుగు వైడ్లు వేసిన భువనేశ్వర్ కుమార్, 15 పరుగులు సమర్పించాడు. డ్వేన్ బ్రావో 8 పరుగులు, క్రిస్ జోర్డాన్ 6 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.  

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !