Latest Videos

IPL 2024 SRH vs RR : అదే జరిగితే... రాజస్థాన్ ను ఓడించకుండానే హైదరాబాద్ ఫైనల్ కు..!!

By Arun Kumar PFirst Published May 23, 2024, 11:53 AM IST
Highlights

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కీలక క్వాలిఫయర్ 2 మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచివుంది. ఒకవేళ వర్షం కారణంగా ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మధ్య మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది? ఏ జట్టు ఫైనల్ కు చేరుతుంది? 

IPL 2024 Qualifier‌ 2 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 కీలక దశకు చేరుకుంది... కేవలం రెండు మ్యాచులు మాత్రమే మిగిలివున్నాయి. ఇప్పటికే కోల్ కతా నైట్ రైడర్స్ ఫైనల్ కు చేరగా మరో రెండు జట్లు ఫైనల్ బెర్తు కోసం తలపడనున్నాయి... రేపు (మే 24, శుక్రవారం) జరిగే క్వాలిఫయర్ 2 లో విజేతగా నిలిచే జట్టు టైటిల్ రేసులో నిలవనుంది. క్వాలిఫయర్ 1 లో ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్, ఎలిమినేటర్ మ్యాచ్ విజేత రాజస్థాన్ రాయల్స్ మధ్య క్వాలిఫయర్ 2 మ్యాచ్ జరగనుంది. అయితే  అదృష్టం కలిసివస్తే ఈ మ్యాచ్ ఆడకపోయినా మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ కు చేరే అవకాశాలున్నాయి. అదెలాగో చూద్దాం. 

క్వాలిఫయర్ 2 మ్యాచ్ కు వర్షం ముప్పు : 

గత రెండు నెలలుగా క్రికెట్ ప్రియులను అలరిస్తున్న ఐపిఎల్ 2024 క్లైమాక్స్ కు చేరుకుంది. ఇప్పటికే లీగ్ మ్యాచులన్నీ పూర్తయి ప్లేఆఫ్ కు చేరిన జట్లమధ్య రసవత్తర పోరు సాగుతోంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ రేసునుండి తప్పుకోగా రాజస్థాన్, హైదరాబాద్ జట్లు ఫైనల్ బెర్తు కోసం తలపడనున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మే 24న క్వాలిఫయర్-2 మ్యాచ్ జరగనుంది. ఇందులో విజేతగా నిలిచే జట్టు ఫైనల్ చేరనుంది... ఓడే జట్టు ఇంటిదారి పడుతుంది. 

అయితే ఐపిఎల్ చివరిదశ మ్యాచులకు వర్షం ఆటంకం సృష్టిస్తోంది. ఇప్పటికే వర్షం కారణంగా ఈ సీజన్ లో మూడు మ్యాచులు రద్దయ్యాయి... ఇప్పుడు కూడా కీలక క్వాలిఫయర్ 2 మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచివుంది. రేపు చెన్నైలో వర్షం కురిసే అవకాశం వుందన్న వాతావరణ ప్రకటన అభిమానులను కలవరపెడుతోంది. రాగల 48 గంటలపాటు చెన్నైలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.  

హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ రద్దయితే ఎలా..? 

చెన్నైలో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అభిమానుల్లో కొన్ని ప్రశ్నలు మెదులుతున్నాయి. ఒకవేళ సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) మధ్య జరిగే క్వాలిఫయర్-2 వర్షం కారణంగా రద్దయితే ఏం జరుగుతుంది? ఫైన‌ల్ కు ఎవ‌రు వెళతారు?  అని. ఈ పరిస్థితిని ముందే ఊహించిన ఐపిఎల్  మేనేజ్ మెంట్ ఓ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసింది. 

ఒకవేళ రేపు హైదరాబాద్, రాజస్థాన్ మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడితే ఓవర్లను కుదించి ఆడించే ప్రయత్నం చేస్తారు. భారీ వర్షం కురిసి మ్యాచ్ నిర్వహించలేని పరిస్థితి వుంటే శనివారం అంటే మే 25న మ్యాచ్ జరుగుతుంది. గత ఐపీఎల్ సీజన్‌లో కేవలం ఫైనల్ కు మాత్రమే రిజర్వ్ డే వుండగా ఈ సీజన్‌లో మొత్తం నాలుగు ఐపీఎల్ ప్లేఆఫ్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఉంది. అయితే శనివారం కూడా వర్షం కురిసి మ్యాచ్ రద్దయితే మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ నేరుగా ఫైనల్ కు చేరుతుంది. 

ఐపిఎల్ నిబంధనల ప్రకారం... వర్షం కారణంగా ఏదయినా మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. మరి ప్లే ఆఫ్ మ్యాచులకు వర్షం అడ్డుపడితే పాయింట్ టేబుల్ ను పరిగణలోకి తీసుకుంటారు. ఏ జట్టయితే ఎక్కువ పాయింట్లను కలిగివుంటుందో ఆ టీం ను విజేతగా ప్రకటిస్తారు. అంటే క్వాలిఫయర్ 2 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే పాయింట్ల పట్టికలో రాజస్థాన్ కంటే మెరుగైన స్థానంలో వున్న సన్ రైజర్స్ నేరుగా ఫైనల్ కు చేరుతుందన్నమాట. కాబట్టి ఆర్ఆర్ ను ఓడించి సన్ రైజర్స్ ఫైనల్ కు చేరుతుందో... లేక వర్షమే హైదరాబాద్ ను ఫైనల్ కు చేరుస్తుందో చూడాలి. వర్షమేమీ లేకుండా మ్యాచ్ సజావుగా సాగి...ఒకవేళ కమిన్స్ సేనను శాంసన్ బృందం ఓడిస్తే మాత్రం ఐపిఎల్ 2024 ఫైనల్ కోల్ కతా, రాజస్థాన్ మధ్య జరుగుతుంది. 


 

click me!