రాక్ స్టార్ జడేజా నా అభిమాన ఆటగాడు: హ్యాట్రిక్ హీరో అగర్

By telugu teamFirst Published Feb 22, 2020, 3:48 PM IST
Highlights

ప్రపంచంలో తన అభిమాన ఆటగాడు టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అని ఆస్ట్రేలియా హ్యాట్రిక్ హీరో ఆస్టన్ అగర్ అన్నాడు. జడేజాతో మాట్లాడిన తర్వాతనే తనలో విశ్వాసం పెరిగిందని చెప్పాడు.

జోహెన్నెస్ బర్గ్: ఇక్కడి వాండరర్స్ స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచులో ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాపై 107 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. బ్యాట్ తోనూ, బంతితోనూ తన సత్తా చాటి విజయంలో కీలక పాత్ర పోషించిన హీరో ఆస్టన్ అగర్. చివరలో ఆస్ట్రేలియాకు కావాల్సిన పరుగుల వేగాన్ని అగర్ అందించాడు. 9 బంతుల్లో 20 పరుగులు చేశాడు. 

ఆ తర్వాత అద్భుతంగా బౌలింగ్ చేసి 24 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఇందులో ఓ హ్యాట్రిక్ కూడా ఉంది.దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు అతను ఇండియాతో ఆడాడు. భారతదేశంలో జరిగిన సిరీస్ లో అతి సాధారణమైన బౌలర్ గా కనిపించాడు. మూడు వన్డే మ్యాచుల సిరీస్ లో కేవలం రెండు వికెట్లు తీసుకున్నాడు. 

దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచు తర్వాత తన సక్సెస్ రహస్యాన్ని చెప్పాడు. ఇండియా సిరీస్ తర్వాత భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాతో మాట్లాడానని, ఆ సంభాషణే తనలో విశ్వాసాన్ని పెంచిందని అగర్ చెప్పాడు. 

ప్రపంచంలో తనకు అత్యంత అభిమాన ఆటగాడు రవీంద్ర జడేజా అని ఆయన చెప్పాడు. "ప్రపంచంలో అతను నా ఫేవరైట్ ప్లేయర్. అతని లాగా నేను క్రికెట్ ఆడాలని అనుకుంటా"  అని రవీంద్ర జడేజా గురించి cricket.com.auతో చెప్పాడు.

రవీంద్ర జడేజాకు మిగతా ఆల్ రౌండర్లకు మధ్య ఉన్న తేడా గురించి కూడా అగర్ చెప్పాడు. ఆటలోని మూడు విభాగాలైన బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ల్లో జడేజా సత్తా చాటుతాడని, అదే అతన్ని సంపూర్ణమైన రాక్ స్టార్ గా మార్చిందని అన్నాడు.

"అతను సంపూర్ణమైన రాక్ స్టార్. షాట్లు కొడుతాడు. గన్ ఫీల్డర్, బంతిని స్పిన్ చేస్తాడు. అతన్ని చూస్తుంటే నాలో విశ్వాసం పెరుగుతుంది" అని అగర్ అన్నాడు. స్పిన్ బౌలింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు బంతిని స్పిన్ చేయడానికి ప్రయత్నించు అని చెప్తాడని, బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నిజాయితీగా సానుకూల దృష్టితో చేస్తాడని, ఫీల్డింగ్ లోనూ అదే విధంగా ఉంటాడని ఆయన అన్నాడు. జడేజాతో మాట్లాడి తాను ఎంతో స్ఫూర్తిని పొందానని చెప్పాడు.

click me!