
విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ మధ్య పాత పగలు ఏమైనా ఉన్నాయో లేదో తెలీదు కానీ ఈ ఇద్దరి వ్యవహారం... దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. సౌరవ్ గంగూలీకి నచ్చకపోవడం వల్లే విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించామని మాజీ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ, స్టింగ్ ఆపరేషన్‌లో ఓపెన్ అయిన విషయం తెలిసిందే..
ప్రస్తుతం భారత టాపార్డర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ ఫామ్ గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్, రాహుల్‌ని ఎడాపెడా ఆడేసుకుంటున్నాడు. అతను టెస్టు టీమ్‌లో ఉండడానికే పనికి రాడని వరుస ట్వీట్లతో రచ్చ చేస్తున్నాడు...
సునీల్ శెట్టికి అత్యంత ఆత్మీయుడు, నమ్మకస్థుడు అయిన ఆకాశ్ చోప్రా, కెఎల్ రాహుల్‌కి సపోర్ట్ చేసేందుకు ప్రయత్నించడంతో వెంకటేశ్ ప్రసాద్ మరింత రెచ్చిపోయాడు. ఈ రాద్ధాంతం కారణంగా ఇక తప్పదని, కెఎల్ రాహుల్‌ని టెస్టు వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించింది బీసీసీఐ. మూడో టెస్టులో రాహుల్ ఉంటే, సోషల్ మీడియా రెస్పాన్స్ మామూలుగా ఉండదు...
తాజాగా కెఎల్ రాహుల్ ఫామ్ గురించి స్పందించాడు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ... ‘ఇండియాలో కూడా పరుగులు చేయలేకపోతే తిట్లు తినడానికి సిద్ధంగా ఉండాల్సిందే. కెఎల్ రాహుల్ ఒక్కడినే టార్గెట్ చేస్తున్నారు కానీ టీమ్‌లో ఇంకొందరు ప్లేయర్లు కూడా పరుగులు చేయలేకపోతున్నారు...
ఫామ్‌లో లేని ప్లేయర్లపై చాలా ప్రెషర్ ఉంటుంది. అందరూ వాళ్లు ఎలా ఆడతారా? అని ఎదురుచూస్తుంటారు. ఇది అతన్ని మరింత ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. టీమ్ మేనేజ్‌మెంట్ ఆ ప్లేయర్ గురించి ఆలోచిస్తుంది. అతను టీమ్‌కి ఎంత ముఖ్యమైనవాడో చూస్తుంది.. చివరకి కోచ్, కెప్టెన్ ఏమనుకుంటున్నారనేదే ముఖ్యం...
కెఎల్ రాహుల్ ఇంతకుముందు చాలాసార్లు టీమ్‌కి విజయాలు అందించాడు. వరుసగా ఫెయిల్ అవుతున్నప్పుడు ఇలాంటి విమర్శలు రావడం అత్యంత సహజం. రాహుల్‌లో సత్తా ఉంది, అతనికి మరిన్ని అవకాశాలు వస్తాయి. పరుగులు చేయడానికి ఏం చేయాలో అతనికి బాగా తెలుసు..
ఫామ్‌లో లేనప్పుడు సాధారణ పిచ్ కూడా క్లిష్టమైన పిచ్‌గా కనిపిస్తుంది. రాహుల్ టీమ్‌కి చాలా ముఖ్యమైన ప్లేయర్ కాబట్టే అతనికి వరుసగా అవకాశాలు ఇస్తున్నారు... ’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ..
మిగిలిన ప్లేయర్లు అంటూ పరోక్షంగా సౌరవ్ గంగూలీ మరోసారి విరాట్ కోహ్లీనే టార్గెట్ చేశాడని అంటున్నారు అభిమానులు. కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత కూడా కోహ్లీపై సౌరవ్ గంగూలీకి పగ తీరనట్టు ఉందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
‘ఇండియాలో ఇండియాని ఓడించడం అంత తేలికైన విషయం కాదు. అదీకాకుండా ఆస్ట్రేలియా ఇంతకుముందులా పటిష్టంగా కనిపించడం లేదు. స్టీవ్ వా, రికీ పాంటింగ్ కెప్టెన్సీలో ఆసీస్ అత్యంత పటిష్టమైన టీమ్‌గా ఉండేది. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు భారత జట్టు 4-0 తేడాతో క్లీన్ స్వీప్ చేస్తుందనే అనుకుంటున్నా. భారత జట్టును ఆపాలంటే ఆస్ట్రేలియా సత్తాకి మించి ఏదైనా చేయాలి...’ అంటూ చెప్పుకొచ్చాడు సౌరవ్ గంగూలీ..