
జింబాబ్వే ఆల్ రౌండర్ సికందర్ రజా సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డేలలో జింబాబ్వే తరఫున అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. మూడు రోజుల క్రితం ఇదే దేశానికి చెందిన సీన్ విలియమ్స్ రికార్డును బ్రేక్ చేశాడు. జింబాబ్వే వేదికగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లో భాగంగా రజా ఈ ఘనత సాధించాడు.
హరారే వేదికగా మంగళవారం నెదర్లాండ్స్ - జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 315 పరుగులు సాధించింది. నెదర్లాండ్స్ తరఫున విక్రమ్‌జీత్ సింగ్ (88), మాక్క్ ఓడౌడ్ (59), ఎడ్వర్డ్స్ (83) లు రాణించారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే సమిష్టిగా రాణించింది. ఓపెనర్లు గుంబీ (40), క్రెయిగ్ ఎర్విన్ (50) లు శుభారంభం అందించారు. ఆ తర్వాత సీన్ విలియమ్స్ (58 బంతుల్లో 91, 10 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా ధాటిగా ఆడాడు. సికందర్ రజా.. 54 బంతుల్లోనే 6 బౌండరీలు, 8 భారీ సిక్సర్లతో 102 పరుగులు చేశాడు. రజా దూకుడుతో జింబాబ్వే.. 316 పరుగుల లక్ష్యాన్ని 40.5 ఓవర్లలోనే ఛేదించింది. ఇదే మ్యాచ్ లో రజా.. బౌలింగ్ లో నాలుగు వికెట్లు తీసుకోవడం గమనార్హం.
కాగా జింబాబ్వే తరఫున అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన రజా.. ఈ క్రమంలో ఇదే దేశానికి జూన్ 18న నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో సీన్ విలియమ్స్ రికార్డును బ్రేక్ చేశాడు. విలియమ్స్ నేపాల్ తో మ్యాచ్ లో 70 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. రెండో రోజుల్లోనే ఈ రికార్డు తుడిచిపెట్టుకుపోయిది. వన్డేలలో అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన రికార్డు దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు ఏబి డివిలియర్స్ పేరిట ఉంది. డివిలియర్స్.. 31 బంతులలోనే సెంచరీ చేశాడు. భారత్ తరఫున విరాట్ కోహ్లీ 52 బంతుల్లో శతకం బాదాడు.