తొందరపాటు.. చేసింది చేటు..! ఇంగ్లాండ్‌ను నిండా ముంచిన ‘ముందస్తు’ వ్యూహం

Published : Jun 21, 2023, 10:52 AM IST
తొందరపాటు.. చేసింది చేటు..! ఇంగ్లాండ్‌ను నిండా ముంచిన ‘ముందస్తు’ వ్యూహం

సారాంశం

Ashes 2023: ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్ జట్టు సారథి బెన్ స్టోక్స్‌ తీసుకున్న ‘ముందస్తు’ నిర్ణయం ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఆ జట్టును నిండాముంచింది. 

కాలం ఎప్పుడూ  మనకు అనుకూలంగా ఉండదు.  నిన్న చేసిన పనిలో విజయవంతమయ్యాం కదా అని రేపు కూడా అదే పనిచేసి  సక్సెస్ కొడదామంటే కుదరదు. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా  వ్యూహాలు మారాలి.  ముఖ్యంగా పోటీ ప్రపంచంలో  ప్రత్యర్థి కంటే  సమర్థమైన వ్యూహాలతో, మెరుగైన పనితీరుతో   పోటీ పడితేనే విజయం సాధ్యమవుతుంది. నిన్న వర్క్అవుట్ అయిన ఐడియా రేపటికి బెడిసికొట్టే  ఛాన్స్ లేకపోలేదు. యాషెస్ టెస్టు సిరీస్ లో భాగంగా.. ఎడ్జ్‌బాస్టన్ లో ఇంగ్లాండ్ ఓటమే ఇందుకు నిదర్శనం. 

గతేడాది జూన్ నుంచి  ఇంగ్లాండ్ జట్టుకు బెన్ స్టోక్స్ - బ్రెండన్ మెక్‌కల్లమ్ (హెడ్ కోచ్)ల ద్వయం  అద్భుతాలు చేస్తోంది.   ఎడ్జ్‌బాస్టన్ టెస్టుకు ముందు ఈ జోడీ  13 టెస్టులలో 10 విజయాలు సాధించి  జోరుమీదుంది. వీళ్ల దూకుడైన ఆటకు ఇంగ్లాండ్ పెట్టుకున్న పేరు  ‘బజ్ బాల్’.  

స్వదేశంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇండియాతో ఒక టెస్టులో ఇదే మంత్రాన్ని పాటించి ఇంగ్లాండ్ విజయాలు సాధించింది. ఇక సిమెంట్ రోడ్డు వంటి  బ్యాటింగ్ పిచ్ లు తయారుచేసిన  పాకిస్తాన్‌లో కూడా  సిరీస్ ను గెలుచుకుంది. కానీ ఇంగ్లాండ్‌కు అసలు సవాలు ఆస్ట్రేలియాతో మొదలైన యాషెస్‌తోనే మొదలైంది.  ఇదే బజ్‌బాల్ వ్యూహంతో ఆసీస్ ను దెబ్బతీయాలనుకున్న ఇంగ్లాండ్ తాను తీసిన గోతిలో తానే బలైంది.

తొందరపాటు తెచ్చిన ముప్పు.. 

ఎడ్జ్‌బాస్టన్ వేదికగా  జరిగిన ఈ టెస్టులో  ఇంగ్లాండ్  చేసిన   పెద్ద తప్పు  తొలి రోజే ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం అన్నది  విమర్శకుల నుంచి  ముక్తకంఠంగా వినిపిస్తున్న మాట. తొలి రోజు 78 ఓవర్లు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. 8 వికెట్లు కోల్పోయి 393 పరుగుల వద్ద  బెన్ స్టోక్స్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు. అప్పటికీ  సెంచరీ హీరో  జో రూట్   (118) క్రీజులో ఉండగా చేతిలో మరో రెండు వికెట్లు కూడా ఉన్నాయి. ఎంతలేదన్నా ఆ జట్టు మరో  50 పరుగులైతే కచ్చితంగా చేసుండేది.  కానీ స్టోక్స్ మాత్రం.. అతి విశ్వాసానికి పోయి చేతులు కాల్చుకున్నాడు. ఇంగ్లాండ్ ఓటమికి కూడా ఇక్కడే పునాధి పడింది. 

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ డిక్లరేషన్ ఇచ్చాక  ఆ రోజు ఆసీస్  నాలుగు ఓవర్లు ఆడి ఒక్క వికెట్ కూడా కోల్పలేదు. రెండో రోజు కూడా ఉస్మాన్ ఖవాజా  (141) సెంచరీకి తోడుగా  అలెక్స్ కేరీ (66), హెడ్ (50) లు రాణించారు.  దీంతో ఆసీస్ రెండు, మూడో రోజు తొలి సెషన్ లో కూడా బ్యాటింగ్ చేసింది. ఇప్పుడే స్టోక్స్ కు తాను తీసుకున్న నిర్ణయం ఎంత తొందరపాటుదో అర్థమై ఉంటుంది.  మూడో రోజు వర్షం కారణంగా ఆట సాధ్యం కాకపోయినా నాలుగో రోజైనా ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో కాస్త నిలకడగా ఆడి ఉంటే ఫలితం కచ్చితంగా మరో విధంగా ఉండేదేమో.. కానీ ఆ జట్టులో అందరూ త్వరగా ఆడాలన్న తొందర్లో  273 పరుగులకు ఆలౌట్ అయ్యారు.  

ఇక 280 పరుగుల లక్ష్యాన్ని  ఆసీస్‌కు అప్పజెప్పి నాలుగో రోజు ఆసీస్  బ్యాటర్లలో ప్రధానమైన డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్ ల వికెట్లు తీసిన ఇంగ్లాండ్.. ఆఖరి  రోజు మాత్రం ఐదు వికెట్లే తీసింది. చివర్లో  విజయం దిశగా దూసుకుపోయినా కంగారూల తోకను కత్తిరించలేక చతికిలపడింది. పాట్ కమిన్స్, నాథన్ లియాన్ ల జోడీని విడదీయలేక  ఇంగ్లాండ్ ప్రపంచ స్థాయి బౌలర్లు  విఫలమయ్యారు.  
 

PREV
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !