బజ్‌బాల్‌కు కౌంటర్ ఇచ్చిన ‘కమ్‌బాల్’.. ఆసీస్ సారథి ఆటపై ప్రశంసలు

Published : Jun 21, 2023, 10:12 AM IST
బజ్‌బాల్‌కు కౌంటర్ ఇచ్చిన ‘కమ్‌బాల్’.. ఆసీస్ సారథి ఆటపై ప్రశంసలు

సారాంశం

Ashes 2023: బజ్‌బాల్  దూకుడు మంత్రానికి ఆస్ట్రేలియా  కళ్లెం వేసింది.  తమకు ఎదురేలేదన్న దృక్పథంతో ఎగిరెగిరి పడుతున్న ఇంగ్లాండ్‌ను ఒక్క దెబ్బకు కిందికి దించారు కంగారూలు.. 

ఏడాదికాలంగా  ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, హెడ్‌కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ కలయికలో  ఇంగ్లాండ్ ఆడుతున్న ఆటకు వాళ్లు పెట్టుకున్న పేరు ‘బజ్‌బాల్’.  పరిస్థితులు ఎలా ఉన్నా.. ప్రత్యర్థి ఎవరైనా దూకుడే మంత్రం.  టెస్టులు ఆడే విధానాన్ని సమూలంగా మార్చేసి దానిని వన్డే తరహాలో ఆడుతూ  స్టేడియంలో ప్రేక్షకులను  అలరించడమే తమ ధ్యేయం అంటూ  ఇంగ్లాండ్ కొత్త ఆట ఆడుతోంది. గతేడాది  జూన్ లో న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ లో మొదలైన ఈ దూకుడుకు  ఇప్పుడు అడ్డుకట్ట పడింది.  బజ్‌బాల్‌కు  ‘కమ్‌బాల్’ కౌంటర్ ఇచ్చింది. 

కమ్‌బాల్ అంటే.. 

కమ్‌బాల్ అంటే అదేదో  కొత్త రకం ఆటతీరేం కాదు. దానికోసం   డిక్షనరీలు తిరగేయాల్సిన పని కూడా లేదు. ఆస్ట్రేలియా సారథి  పాట్ కమిన్స్  పేరులోని (Cum) మొదటి  మూడు అక్షరాలను తీసుకుని దానికి బాల్ (Ball)  జత చేశారు అభిమానులు. ఎడ్జ్‌బాస్టన్  టెస్టులో ఆసీస్ విజయానికి ఈ కమ్‌బాల్ ఆటే కారణం.. 

280 పరుగుల లక్ష్య ఛేదనలో  భాగంగా 227 పరుగులకు ఆసీస్  8 వికెట్లు కోల్పోయింది. విజయానికి  53 పరుగుల దూరంలో నిలిచిన క్రమంలో కమిన్స్.. లియాన్ తో కలిసి  తీవ్రమైన ఒత్తిడిలోనూ   క్రీజులో నిలబడ్డాడు.  ప్రత్యర్థి కవ్వించే బంతులు వేసినా వాటి జోలికి పోకుండా  ప్రశాంతంగా ఆడాడు.  పార్ట్ టైమ్ స్పిన్నర్ జో రూట్ తో బౌలింగ్ వేయిస్తే  భారీ షాట్ ఆడి వికెట్ పారేసుకుంటాడేమో అనుకుంటే అతడి బౌలింగ్ లో రెండు భారీ సిక్సర్లు బాదాడు. స్టువర్ట్ బ్రాడ్, ఓలీ రాబిన్సన్,  బెన్ స్టోక్స్.. బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా కమిన్స్ మాత్రం ఏకాగ్రత కోల్పోలేదు.  తన తర్వాత మరెవరూ బ్యాటర్ లేకపోవడంతో  కమిన్స్ గొప్పగా పోరాడాడు. 

 

లియాన్‌తో కలిసి 8వ వికెట్‌కు  55 పరుగులు జోడించాడు కమిన్స్.   తాను బౌలర్‌ను మాత్రమే కాదని.. అవసరమైతే   ప్రధాన బ్యాటర్లంతా నిష్క్రమించినా తన జట్టును   పోరాడి గెలిపిస్తానని నిరూపించాడు. ఈ ఇన్నింగ్స్ లో కమిన్స్ చూపిన తెగువ, పోరాటం కచ్చితంగా  యువ బౌలర్లు నేర్చుకోవాల్సిందేనని చాలామంది క్రికెట్ విశ్లేషకులు అతడిపై  ప్రశంసలు కురిపిస్తున్నారు.   రెండో ఇన్నింగ్స్  లో కమిన్స్..  (73 బంతుల్లో 44 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), నాథన్ లియన్ (28 బంతుల్లో 16 నాటౌట్, 2 ఫోర్లు) లు అద్భుతంగా పోరాడారు. 

ఎడ్జ్‌బాస్టన్ టెస్టు ముగిసిన తర్వాత ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. ‘మీరు యువ బౌలర్ అయితే ఇది గుర్తుంచుకోండి.  మీ బౌలింగే కాదు..  బ్యాటింగ్ ద్వారా కూడా మ్యాచ్ ను గెలిపించొచ్చనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.   జీవితంలో  మన మాతృభాషనే కాకుండా సెకండ్ లాంగ్వేజ్  కూడా తెలిసుంటే చాలా  ఉపయోగకరం..’అని ట్వీట్ చేశాడు.  

 

యాషెస్ తొలి టెస్టు స్కోరు వివరాలు : 

ఇంగ్లాండ్ :  393-8, 273 
ఆస్ట్రేలియా : 386, 282-8  

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !