IPL 2025 ఎలిమినేటర్‌లో గుజరాత్ ఓటమికి శుభ్‌మన్ గిల్ కారణమా?

Published : Jun 01, 2025, 12:17 AM IST
Gujarat Titans skipper Shubman Gill (Photo: IPL)

సారాంశం

Shubman Gill: ఐపీఎల్ 2025 ఎలిమినేటర్ మ్యాచ్‌లో కెప్టెన్ గిల్ తీసుకున్న నిర్ణయం గుజరాత్‌ను దెబ్బకొట్టిందనీ, అందుకే ముంబయి చేతిలో 20 పరుగుల తేడాతో ఓడిపోయి టోర్నమెంట్‌కు గుడ్‌బై చెప్పిందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.

Shubman Gill: ఐపీఎల్ 2025 ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిపోయి గుజరాత్ టైటన్స్ జట్టు టోర్నమెంట్‌కు గుడ్‌బై చెప్పింది. ఈ కీలక మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ చేతిలో 20 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఓడిపోయింది. ట్రోఫీ గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. 229 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలోని గుజరాత్ జట్టు ఒక దశలో విజయానికి సమీపంలో కనిపించినా, చివర్లో ముంబై బౌలర్లు రాణించడంతో ఓటమిపాలైంది.

సాయి సుదర్శన్-వాషింగ్టన్ సుందర్ జోడీ సూపర్ షో

ఇన్నింగ్స్ మధ్యలో సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ క్రీజులో నిలిచినప్పుడు గుజరాత్ విజయం సాధించవచ్చని కనిపించింది. ఎందుకంటే వీరిద్దరూ అద్భుతంగా ఆడారు. అయితే జస్ప్రీత్ బుమ్రా, రిచర్డ్ గ్లీసన్ కీలక సమయంలో ఈ ఇద్దరిని ఔట్ చేయడంతో మ్యాచ్ ముంబయి వైపుకు మళ్లింది. చివరి నాలుగు ఓవర్లలో ముంబయి బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేస్తూ గుజరాత్‌ను కట్టడి చేశారు.

గిల్ నిర్ణయం గుజరాత్ ను దెబ్బకొట్టిందా?

ఈ మ్యాచ్‌పై స్పందించిన భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప, గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. ప్రసిద్ధ్ కృష్ణకు కొత్త బంతితో బౌలింగ్ అప్పగించడం పెద్ద తప్పిదమని వ్యాఖ్యానించారు. సాధారణంగా మధ్య ఓవర్లలో విజయవంతంగా బౌలింగ్ చేసే ప్రసిద్ధ్‌ను పవర్‌ప్లేలో ప్రయోగించడం వ్యూహపరంగా తప్పుడు నిర్ణయమని ఉతప్ప అన్నారు.

ప్రసిద్ధ్ తన తొలి ఓవర్లో 10 పరుగులు ఇచ్చారు. కానీ రెండో ఓవర్లో జానీ బెయిర్‌స్టో చెలరేగి మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు కొట్టి మొత్తం 26 పరుగులు రాబట్టాడు. దీంతో గుజరాత్‌పై ఒత్తిడి పెరిగిందని చెప్పాడు. 

ఫీల్డింగ్ వైఫల్యాలు గుజరాత్ జట్టును దెబ్బకొట్టాయి

జియోస్టార్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబిన్ ఉతప్ప గుజరాత్ చెత్త ఫీల్డింగ్‌ ను కూడా ప్రస్తావించారు. 'గుజరాత్ వ్యూహం స్పందనాత్మకంగా ఉంది, చురుకుగా కాదు. పలు క్యాచ్‌లు వదిలేయడం వల్ల మ్యాచ్‌లో వెనకబడి పోయారు. ఇలా మీరు సింపుల్ క్యాచ్‌లు వదిలేస్తే ఛాంపియన్ అవ్వలేరు' అని పేర్కొన్నారు.

ప్రసిద్ధ్ కృష్ణా బౌలింగ్ రికార్డులు

ఈ మ్యాచ్‌లో ప్రసిద్ధ్ కృష్ణా 4 ఓవర్లలో 52 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశారు. రోహిత్ శర్మ, నమన్ ధీర్ వికెట్లను తీసి తమ వికెట్ తీయగల సామర్థ్యాన్ని చూపించారు. మొత్తం ఈ సీజన్‌లో ప్రసిద్ధ్ 25 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ పోటీలో ప్రస్తుతానికి మొదటి స్థానంలో ఉన్నారు.

అతని తరువాత స్థానాల్లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ నూర్ అహ్మద్ (24 వికెట్లు), ఫైనల్‌కు చేరిన ఆర్సీబీ బౌలర్ జోష్ హేజిల్ వుడ్ (21 వికెట్లు) ఉన్నారు. హేజిల్ వుడ్ ఫైనల్‌లో ఆడే అవకాశం ఉన్నందున పర్పుల్ క్యాప్ గెలుచుకునే అవకాశం ఉంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Mandhana : పలాష్ ముచ్చల్, స్మృతి మంధాన పెళ్లి పై బిగ్ అప్డేట్
Joe Root : సచిన్ సాధించలేని రికార్డులు.. జో రూట్ అదరగొట్టాడు !