IPL2021: సూపర్ క్యాచ్.. కానీ నో బాల్ అయిపోయింది..!

By telugu news teamFirst Published Oct 14, 2021, 8:24 AM IST
Highlights

గిల్‌ క్యాచ్‌ పట్టినప్పటికీ అంపైర్‌కు నోబాల్‌ అనే అనుమానం వచ్చింది. వెంటనే రిప్లై చూడగా.. అందులో వరుణ్‌ చక్రవర్తి ఫ్రంట్‌ ఫుట్‌ క్రీజు దాటి ముందుకు వచ్చినట్లు కనిపించింది.

IPL2021 లో Kolkata Night riders, Delhi Capitals తో తలపడిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ మ్యాచ్ లో చివరకు విజయం కోల్ కతా నైట్ రైడర్స్ కే దక్కింది. మొదటి నుంచి ట్రోఫీ కోసం చాలా కష్టపడిన ఢిల్లీ క్యాపిటల్స్ కి మాత్రం నిరాశే ఎదురైంది.  అయితే.. ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో శుబ్‌మన్‌ గిల్‌ సూపర్‌ క్యాచ్‌తో మెరిశాడు. అయితే అది నో బాల్‌ కావడంతో ప్రత్యర్థి బ్యాటర్‌ బతికిపోయాడు. 

ఢిల్లీ క్యాపిటల్స్‌ 17వ ఓవర్‌లో ఇది చోటుచేసుకుంది. ఆ ఓవర్‌ వరుణ్‌ చక్రవర్తి వేయగా.. ఓవర్‌ 4వ బంతిని హెట్‌మైర్‌ లాంగాన్‌ దిశగా భారీ షాట్‌ ఆడాడు. అయితే బౌండరీ లైన్‌ వద్ద ఉన్న గిల్‌ ముందుకు పరిగెత్తి డైవ్‌ చేస్తూ అద్భుతంగా క్యాచ్‌ తీసుకున్నాడు. దీంతో హెట్‌మైర్‌ పెవిలియన్‌ చేరాడు. ఇక్కడే అసలు కథ మొదలైంది. 

గిల్‌ క్యాచ్‌ పట్టినప్పటికీ అంపైర్‌కు నోబాల్‌ అనే అనుమానం వచ్చింది. వెంటనే రిప్లై చూడగా.. అందులో వరుణ్‌ చక్రవర్తి ఫ్రంట్‌ ఫుట్‌ క్రీజు దాటి ముందుకు వచ్చినట్లు కనిపించింది. అయితే బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద అంపైర్‌ నోబాల్‌ ఇవ్వడంతో కేకేఆర్‌కు నిరాశ మిగిలింది. ఆ ఒక్క బాల్ విషయంలో నిరాశ ఎదురైనా విజయం మాత్రం ఆ జట్టుకే దక్కింది. 

Also Read: IPL 2021: థ్రిల్లర్‌ను తలపించిన రెండో క్వాలిఫైయర్... ఫైనల్ చేరిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

2021 సీజన్‌లో ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకోవాలనుకున్న ఢిల్లీ ఆశలు అడియాసలయ్యాయి. ఈ సీజన్ మొత్తం నిలకడగా రాణించిన పంత్ సేన.. కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓటమిపాలై లీగ్ నుంచి నిష్క్రమించింది. చేసింది తక్కువ స్కోరే అయినా విజయం  కోసం  చివరి బంతికి వరకు పోరాడింది. ఢిల్లీ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా 7 వికెట్లు కోల్పోయి 19.5 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్‌లు వెంకటేశ్ అయ్యర్‌ (55) శుభ్‌మన్‌ గిల్ (46) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో రవిచంద్రన్‌ అశ్విన్, కగిసో రబాడ, అన్రిచ్‌ నోర్జే తలో రెండు వికెట్లు, అవేశ్‌ ఖాన్‌ ఒక వికెట్‌ పడగొట్టారు.

స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్‌ ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌, వెంకటేశ్‌ అయ్యర్‌ 12 ఓవర్ల వరకు వికెట్ కోల్పోకుండా జట్టును విజయం వైపుకు నడిపించారు. అయితే 13వ నుంచి ఢిల్లీ బౌలర్లు ఒక్కసారిగా రెచ్చిపోయారు. వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా (13) వెంటవెంటనే ఔట్ అయ్యారు. 17వ ఓవర్లో శుభ్‌మన్‌ గిల్ .. ఆ వెంటనే దినేశ్‌ కార్తిక్‌ (0), కెప్టెన్‌ ఇయాన్ మోర్గాన్‌ (0) ఔటవ్వడంతో మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. చివరి ఓవర్లో సమీకరణం ఆరు బంతుల్లో ఏడు పరుగులుగా మారింది. ఆఖరి ఓవర్ వేసిన అశ్విన్ వరుస బంతుల్లో.. షకిబ్‌ అల్ హసన్‌ (0), సునీల్ నరైన్ (0) పెవిలియన్‌కు పంపాడు. దీంతో సమీకరణం రెండు బంతుల్లో ఆరు పరుగులుకు మారడంతో పాటు మ్యాచ్ చూస్తున్న వారిలో టెన్షన్ పెరిగిపోయింది. అయితే, 19.5 బంతిని రాహుల్ త్రిపాఠి (12) భారీ సిక్సర్‌గా మలచడంతో కోల్‌కతా ఘన విజయం . ఈ విజయంతో నైట్ రైడర్స్ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. శుక్రవారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తుదిపోరులో తలపడనుంది.  

click me!