IPL2021 KKR vs DC: తుస్సుమనిపించిన ఢిల్లీ క్యాపిటల్స్... కేకేఆర్ ముందు ఈజీ టార్గెట్...

By Chinthakindhi RamuFirst Published Oct 13, 2021, 9:15 PM IST
Highlights

IPL2021 KKR vs DC 2nd Qualifier: నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్... ఆఖరి బంతికి సిక్సర్ బాదిన శ్రేయాస్ అయ్యర్... 

ఐపీఎల్ 2021 ఫైనల్‌కి చేరేందుకు దక్కిన అవకాశాన్ని ఢిల్లీ క్యాపిటల్స్, ఒడిసి పట్టుకోవడానికి తెగ ఇబ్బంది పడుతున్నట్టే కనిపిస్తోంది. క్వాలిఫైయర్ 1లో సీఎస్‌కే చేతుల్లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్, రెండో క్వాలిఫైయర్‌లో భారీ స్కోరు చేయలేకపోయింది...

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌కి శుభారంభమే దక్కింది. పృథ్వీషా మెరుపులతో 4 ఓవర్లలోనే 32 పరుగులు చేసింది ఢిల్లీ. 12 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 18 పరుగులు చేసిన పృథ్వీషాను వరుణ్ చక్రవర్తి అవుట్ చేయడంతో సీన్ మొత్తం మారిపోయింది...

వన్‌డౌన్‌లో వచ్చిన మార్కస్ స్టోయినిస్ పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. మరో ఎండ్‌లో శిఖర్ ధావన్ కూడా డిఫెన్స్‌ మూడ్‌లోకి రావడంతో రన్‌రేట్ ఘోరంగా పడిపోయింది. 23 బంతుల్లో ఓ ఫోర్‌తో 18 పరుగులు చేసిన మార్కస్ స్టోయినిస్‌ను శివమ్ మావి క్లీన్‌బౌల్డ్ చేశాడు.

ఆ తర్వాత  39 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 36 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో షకీబుల్ హసన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు... రిషబ్ పంత్ 6 పరుగులు చేసి భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో హెట్మయర్ అవుట్ అయినా, ఆ బంతి నో బాల్ కావడంతో తిరిగి ఫీల్డ్‌లోకి వచ్చాడు...

ఫర్గూసన్ వేసిన ఓవర్‌లో రెండు సిక్సర్లు కొట్టిన హెట్మయర్ 10 బంతుల్లో 17 పరుగులు చేసి, లేని పరుగు కోసం రనౌట్ అయ్యాడు. ఆఖరి ఓవర్‌లో ఆఖరి బంతికి సిక్సర్ కొట్టిన శ్రేయాస్ అయ్యర్, 27 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 30 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కేకేఆర్ మూడోసారి ఫైనల్ చేరేందుకు 120 బంతుల్లో 136 పరుగులు చేస్తే, సరిపోతుంది...

click me!