IPL 2021: థ్రిల్లర్‌ను తలపించిన రెండో క్వాలిఫైయర్... ఫైనల్ చేరిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

By Chinthakindhi RamuFirst Published Oct 13, 2021, 11:18 PM IST
Highlights

IPL 2021 KKR vs DC: రెండో క్వాలిఫైయర్‌లో మూడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్న కేకేఆర్... ఆఖరి ఓవర్‌ ఐదో బంతికి విజయాన్ని అందుకున్న కోల్‌కత్తా...

ఐపీఎల్ 2021 సీజన్‌ రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో నరాలు తెగేంత ఉత్కంఠభరితంగా సాగి, క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాని అందించింది. ఒకానొకదశలో వన్‌సైడ్ అవుతుందనుకున్న మ్యాచ్ కాస్తా... ఒక్కసారిగా టర్న్ తిరిగి ఆఖరి ఓవర్ ఆఖరి రెండో బంతిదాకా థ్రిల్లర్‌ని తలపించింది. 

ఈ లో స్కోరింగ్ గేమ్‌లో అద్భుత విజయం అందుకున్న కోల్‌కత్తా, ఫైనల్‌కి దూసుకెళ్లింది. సెకండ్ ఫేజ్ ఆరంభానికి ముందు ఏడో స్థానంలో ఉన్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్... అద్బుత విజయాలతో ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లి, కీలక మ్యాచుల్లో పూర్తి ఆధిపత్యం చూపించి ఫైనల్‌లో అడుగుపెట్టింది... కేకేఆర్ ఫైనల్ చేరడం ఇది మూడోసారి కాగా, ఇంతకుముందు ఫైనల్ చేరిన రెండుసార్లు టైటిల్ గెలిచింది...

136 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్, శుబ్‌మన్ గిల్... అదిరిపోయే ఓపెనింగ్ అందించారు. మొదటి వికెట్‌కి 96 పరుగులు జోడించి, దాదాపు విజయాన్ని ఖాయం చేసేశారు. 

41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 55 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్, సీజన్‌లో మూడో హాఫ్ సెంచరీ నమోదుచేశాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఎంట్రీ ఇచ్చిన అయ్యర్, 320 పరుగులు చేసి  మొదటి 9 మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసిన ఐదో ప్లేయర్‌గా నిలిచాడు.. 

రబాడా బౌలింగ్‌లో వెంకటేశ్ అయ్యర్ అవుటైన తర్వాత వస్తూనే సిక్సర్ బాదిన నితీశ్ రాణా 13 పరుగులు చేసి నోకియా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...అయితే అప్పటికే 24 బంతుల్లో 13 పరుగులు కావాల్సిన పొజిషన్‌కి చేరుకుంది కేకేఆర్. ఆ తర్వాతి ఓవర్‌లో 46 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 46 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్‌ను ఆవేశ్ ఖాన్‌ అవుట్ చేశాడు... ఆ తర్వాతి ఓవర్‌లో ఒకే ఒక్క పరుగు ఇచ్చిన రబాడా, దినేశ్ కార్తీక్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు...

19వ ఓవర్‌లో మూడు పరుగులు మాత్రమే ఇచ్చిన నోకియా, ఇయాన్ మోర్గాన్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో విజయానికి ఆఖరి ఓవర్‌లో 7 పరుగులు కావాల్సి వచ్చింది... అశ్విన్ వేసిన ఆఖరి ఓవర్‌ మొదటి బంతికి త్రిపాఠి సింగిల్ తీశాడు. ఆ తర్వాతి బంతికి పరుగులేమీ రాలేదు. మూడో బంతికి షకీబుల్ హసన్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు.

నాలుగో బంతికి సునీల్ నరైన్ కూడా భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు... నెక్ట్స్ బంతికి సిక్సర్ బాదిన రాహుల్ త్రిపాఠి, మ్యాచ్‌ను ముగించాడు.. కెప్టెన్‌గా ఆడుతున్న మొదటి సీజన్‌లోనే టైటిల్ గెలవాలని ఆశపడిన యంగ్ సెన్సేషన్ రిషబ్ పంత్ ఆశలు నెరవేరలేదు. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను నడిపించిన శ్రేయాస్ అయ్యర్, జట్టును ఫైనల్ చేర్చగా... రిషబ్ పంత్ కెప్టెన్సీలో మాత్రం ఢిసీ మూడో స్థానంతోనే సరిపెట్టుకుంది.

click me!