ఎన్నాళ్లకు నిన్నిలా చూశామయ్యా సామీ... నెట్ ప్రాక్టీస్ మొదలెట్టిన శ్రేయాస్ అయ్యర్...

By Chinthakindhi RamuFirst Published Jul 16, 2021, 3:17 PM IST
Highlights

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొదటి వన్డేలో గాయపడిన శ్రేయాస్ అయ్యర్...

దాదాపు నాలుగు నెలలుగా క్రికెట్‌కి దూరమైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్...

గాయం కారణంగా ఐపీఎల్ 2021 పార్ట్ 1, శ్రీలంక టూర్‌కి దూరమైన శ్రేయాస్ అయ్యర్...

అప్పుడెప్పుడో మార్చిలో ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొదటి వన్డేలో గాయపడ్డాడు భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్. ఫీల్డింగ్ చేస్తూ కిందపడిన అయ్యర్, పక్కటెముక కదిలిందని స్కానింగ్‌లో తేలడంతో సర్జరీ నిర్వహించారు వైద్యులు.

సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి క్రికెట్‌లో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు అయ్యర్... గాయం కారణంగా ఐపీఎల్ 2021 సీజన్‌లో (పార్ట్ 1) పాల్గొనని శ్రేయాస్ అయ్యర్, ఆ తర్వాత శ్రీలంక టూర్‌కి ఎంపిక కాలేదు.

ఈపాటికి గాయం నుంచి పూర్తిగా కోలుకుని ఉంటే, లంక టూర్‌లో భారత జట్టుకి కెప్టెన్సీ చేసే అవకాశం శ్రేయాస్ అయ్యర్‌కే దక్కేది.  మార్చి 23న గాయపడిన శ్రేయాస్ అయ్యర్‌కి ఏప్రిల్ 2న శస్త్ర చికిత్స జరిగింది. దాదాపు నాలుగు నెలల తర్వాత నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు శ్రేయాస్ అయ్యర్.

శ్రేయాస్ అయ్యర్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్... ‘హమ్మయ్య.. దీన్ని చూడడానికి కళ్లు ఎంతగా వేచి చూశాయో... నువ్వు నీ జోరును అందుకోవాలని ఎదురుచూస్తున్నాం...’ అంటూ కాప్షన్ ఇచ్చింది.

అయ్యర్ గాయం కారణంగా తప్పుకోవడంతో ఐపీఎల్ 2021 పార్ట్ 1కి రిషబ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. పంత్ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ 8 మ్యాచుల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది. దీంతో యూఏఈలో జరిగే మిగిలిన మ్యాచులకు ఎవరు కెప్టెన్‌గా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

click me!