అతని క్రీడాస్ఫూర్తిని మెచ్చుకోవాల్సిందే... స్టువర్ట్ బ్రాడ్‌పై షేన్ వార్న్ వ్యంగ్య వ్యాఖ్యలు...

Published : Dec 19, 2021, 06:21 PM IST
అతని క్రీడాస్ఫూర్తిని మెచ్చుకోవాల్సిందే... స్టువర్ట్ బ్రాడ్‌పై షేన్ వార్న్ వ్యంగ్య వ్యాఖ్యలు...

సారాంశం

2013 యాషెస్ సిరీస్‌లో జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్... అవుటైనా, అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడంతో క్రీజు కదలని స్టువర్ట్ బ్రాడ్...

క్రికెట్‌లో భారత్, పాకిస్తాన్ మ్యాచుల తర్వాత అంతటి క్రేజ్ ఉండేది యాషెస్ సిరీస్‌కే. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ఈ ‘బూడిద’ పోరులో ప్రతీ సంఘటన, ఆసక్తికరంగానే సాగుతుంది. ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న ఇంగ్లాండ్ జట్టు, అంచనాలను అందుకోవడానికి అష్టకష్టాలు పడుతోంది. కెప్టెన్ జో రూట్ ఒక్కడే కాస్తో కూస్తో బ్యాటింగ్ భారాన్ని మోస్తుంటే, అతనికి సరైన సపోర్ట్ దొరకడం లేదు...

బ్రిస్బేన్‌లోని గబ్బా టెస్టులో 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన ఇంగ్లాండ్ జట్టు, ఆడిలైడ్‌లో జరుగుతున్న డే నైట్ టెస్టులో పరాజయం అంచున నిలిచింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది ఇంగ్లాండ్. ఆఖరి రోజున ఇంగ్లాండ్ విజయానికి మరో 386 పరుగులు చేయాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా మరో 6 వికెట్లు తీస్తే సిరీస్‌లో వరుసగా రెండో విజయాన్ని అందుకుంటుంది...

అయితే  ఈ టెస్టు మ్యాచ్‌లో అంపైర్ల నిర్ణయాలు కొన్ని వివాదాస్పదమయ్యాయి. బెన్ స్టోక్స్ ఏకంగా నాలుగు నో బాల్స్ వేసినా ఫీల్డ్ అంపైర్లు కానీ, టీవీ అంపైర్ కానీ గుర్తించకపోవడంతో వివాదం రేగింది. దీంతో 2013 యాషెస్ సిరీస్‌కి సంబంధించిన ఓ వీడియో, ఇప్పుడు వైరల్ అవుతోంది...

నాటింగ్‌హమ్‌లోని ట్రెంట్‌బ్రిడ్జ్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 297/6 పరుగుల వద్ద ఉన్న సమయంలో అస్టన్ అగర్ బౌలింగ్‌లో స్టువర్ట్ బ్రాడ్ కొట్టిన ఓ షాట్, నేరుగా స్లిప్‌లో ఉన్న ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లింది. క్యాచ్ అందుకున్న ఫీల్డర్, అవుట్‌గా అప్పీల్ చేశాడు..

అయితే అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. అప్పటికే 37 పరుగులతో క్రీజులో ఉన్న స్టువర్ట్ బ్రాడ్‌కి బంతి, బ్యాటుకి తగిలిన విషయం తెలిసినా, అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడంతో బ్యాటింగ్ కొనసాగించాడు. 8 ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన గురించి ఇప్పుడు ప్రస్తావించాడు ఆసీస్ దిగ్గజ బౌలర్ షేన్ వార్న్...

‘స్టువర్ట్ బ్రాడ్ అవుటైన విషయం తెలిసినా, క్రీజు నుంచి బయటికి వెళ్లకపోవడాన్ని అభినందించాల్సిందే.  అతను తన క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు... హాహాహా... అంపైర్ అలీం దార్ ఎంత చెత్త అంపైరింగ్ చేసేవాడో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. చాలా సార్లు ఇలా తప్పుడు నిర్ణయాలే ఇచ్చాడు... ’ అంటూ కామెంట్ చేశాడు షేన్ వార్న్...

ప్రస్తుతం ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకి టెస్టుల్లో జేమ్స్ అండర్సన్ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఉన్నాడు స్టువర్ట్ బ్రాడ్. ఆడిలైడ్‌లో జరుగుతున్న టెస్టు బ్రాడ్ కెరీర్‌లో 150వ టెస్టు కావడం మరో విశేషం...

‘నా బ్యాటుకి బాల్ తగిలిందని నాకు తెలుసు, అయితే ఫీల్డ్‌లో ఉన్న ప్లేయర్లకు నేను ఆ బాల్‌ కొట్టానా? లేదా? అనే విషయం క్లియర్‌గా తెలియలేదు. హడిన్ గ్లవ్స్‌కి బంతి తగలడంలో కొంచెం కంఫ్యూజన్ రేగింది. నేను అవతలి ఎండ్‌కి వెళ్లినప్పుడు ఇయాన్ బెల్ కూడా ఈ విషయాన్ని అడిగాడు... ఆఖరికి బౌలర్ అస్టన్ అగర్ కూడా వచ్చి, నీ బ్యాటుకి బాల్ తగిలింది కదా? అంటూ అనుమానంగా అడిగాడు.

అప్పుడు నేను స్వచ్ఛందంగా బయటికి వెళ్లాలని అనుకోలేదు. ఎందుకంటే ఆ సమయంలో అంత ఆలోచించే సమయం ఉండదు. అప్పుడు ఫ్రస్టేషన్‌కి గురైతే, వేరే ఆలోచన లేకుండా నడుచుకుంటూ వెళ్లేవాడినేమో..’ అంటూ ఆ మ్యాచ్ అనంతరం కామెంట్ చేశాడు స్టువర్ట్ బ్రాడ్...
 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !