అలా అయినా జరిపిస్తాం.. తొందరొద్దు చర్చించాక చెబుతాం.. దక్షిణాఫ్రికా సిరీస్ పై తేల్చుకోలేపోతున్న బోర్డులు

By team teluguFirst Published Nov 27, 2021, 1:40 PM IST
Highlights

India Tour Of South Africa: దక్షిణాఫ్రికా-ఇండియా టూర్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. దీనిపై  రెండు దేశాల బోర్డులు ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. ఇక ఇప్పుడు  ఈ సిరీస్ భవితవ్యాన్ని తేల్చాల్సిన బాధ్యత ఇరు  దేశాల ప్రభుత్వాలదే..?

దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త రకం కరోనా వైరస్ ఒమిక్రాన్ (Omicron) ప్రపంచాన్ని మళ్లీ కలవరపెడుతున్నది. ఇప్పటికే ఆఫ్రికా ఖండంలో వ్యాపించే దశలో ఉన్న ఈ వైరస్ కారణంగా మరో కొవిడ్  ముప్పు తప్పదని వాదనలు వినిపిస్తున్న  తరుణంలో వచ్చే నెల జరగాల్సి ఉన్న దక్షిణాఫ్రికా-ఇండియా టూర్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. దీనిపై  రెండు దేశాల బోర్డులు ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి.  ఇరుదేశాల ప్రభుత్వ అధికారుల మధ్య  చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ సౌతాఫ్రికా (South Africa) సీఈవో ఫొలెట్సి మొసెకి (Pholetsi Moseki) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

మొసెకి మాట్లాడుతూ.. ‘ఇప్పటికైతే పర్యటన సజావుగా సాగుతుందనే భావిస్తున్నాం. బీసీసీఐ కూడా మాకు ఇదే విషయాన్ని చెప్పింది. ఒకవేళ ఏదైనా విపత్తు ముంచుకొస్తే తప్ప సిరీస్ ను వాయిదా వేయడానికి కారణాలేమీ లేవు..’ అని తెలిపాడు. 

అంతేగాక.. ‘స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా మ్యాచులను నిర్వహిస్తాం. గతంలో పాకిస్థాన్, శ్రీలంకతో ఆడినట్టుగానే భారత్ తో కూడా ఆడతాం. ఈ మేరకు మేము కఠినమైన బయో బబుల్ ఆంక్షలను కూడా పాటిస్తాం. అయితే దీనిమీద ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. దేశంలో లాక్డౌన్ (LOckdown) రాదనే అనుకుంటున్నాం. చూద్దాం మరి.. ఏం జరుగుతుందో..?’ అని మొసెకి అన్నాడు. 

Also Read: భారత్ కు కొవిడ్ కొత్త వేరియంట్ దెబ్బ.. సౌతాఫ్రికాకు వెళ్లాలా.. వద్దా? కేంద్రం అనుమతి కోసం చూస్తున్న బీసీసీఐ

ఆటగాళ్ల భద్రతకు తాము అధిక ప్రాధాన్యతను ఇస్తామని చెప్పిన సఫారీ క్రికెట్ బోర్డు.. కావాలంటే వేదికలను కూడా మారుస్తామని తెలిపింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. జోహన్నస్బర్గ్, సెంచూరీయన్, కేప్ టౌన్, పార్ల్ లలో మ్యాచులను నిర్వహించాల్సి ఉంది. అయితే తాజాగా  వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వైరస్.. ఈ వేదికలకు సమీపాన ఉన్న ప్రావిన్సులలోనే అధికంగా ఉంది. అయితే బీసీసీఐ కోరితే వేదికలను మార్చేందుకు కూడా తాము సిద్ధమని సౌతాఫ్రికా ప్రకటించింది. అంతేగాక.. ఆటగాళ్లకు ప్రత్యేకమైన విమానాలను ఏర్పాటు చేయడం.. బయో బబుల్ ను కఠినంగా అమలు చేయడం వంటివి చేస్తామని హామీ ఇస్తున్నది.

దక్షిణాఫ్రికాలో కొద్దిరోజలుగా  కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. కొవిడ్ బీ.1.1.529 కొత్త వేరియంట్ ను మొదట అక్కడే గుర్తించారు. ఈ వేరియంట్ ఎలా పుట్టుకొచ్చిందనేదానిపై ఇప్పటిదాకా శాస్త్రీయ ఆధారాలు గుర్తించనప్పటికీ.. రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ పవర్) తక్కువగా ఉన్న హెచ్ఐవీ/ఎయిడ్స్ పేషెంట్ నుంచి  ఇది పుట్టిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.  ఈ వేరియంట్ కు ఒమిక్రాన్ అని పేరు పెట్టారు.  దక్షిణాఫ్రికా తో పాటు దాని పక్కనే ఉన్న బోట్స్వానా,  నమీబియా, జింబాబ్వేలలో కూడా  దీని వ్యాప్తి ఇప్పటికే మొదలైనట్టు సమాచారం.  పాత వేరియంట్లతో పోలిస్తే కొత్త వేరియంట్ లో మ్యూటేషన్లు అధికంగా ఉండటంతో దాని వ్యాప్తి అధికంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. 

అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో  భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కేంద్రం నిర్ణయం కోసం వేచి చూస్తున్నది. శనివారం తనను కలిసిన విలేకరులతో గంగూలీ మాట్లాడుతూ.. ‘చర్చలు జరుపుతున్నాం..’ అని తెలిపాడు. ఇప్పటికైతే షెడ్యూల్ లో మార్పేమీ లేదని, కానీ కేంద్రం నిర్ణయం తర్వాతే అధికారిక ప్రకటన చేస్తామని బీసీసీఐ చెబుతున్నది. 

click me!