మొన్న స్టేడియంలో గుట్కా తింటూ వైరల్.. నేడేమో అది తినొద్దని పోస్టర్.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న గుట్కా బాయ్

By team teluguFirst Published Nov 27, 2021, 12:39 PM IST
Highlights

India Vs New Zealand Test: ఇది సోషల్ మీడియా యుగం. ఈ రోజుల్లో వింతలు, విశేషాలు చూడటానికి ఎక్కడెక్కడికో  వెళ్లాల్సిన పన్లేదు.  చేతిలో ఉన్న ఫోన్ లోని సామాజిక మాధ్యమాలను చెక్ చేస్తే చాలు.  ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న కాన్పూర్ లో జరుగుతున్న తొలి టెస్టులో ఓ వ్యక్తి .. తాను చేసిన  పనులతో వైరల్ గా మారాడు. 

ఇండియా-న్యూజిలాండ్ మధ్య కాన్పూర్ లో తొలి టెస్టు జరుగుతున్నది. తొలి రోజు భారత్ వెంటవెంటనే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టీవీల ముందు క్రికెట్ చూస్తున్నవారితో పాటు  స్టేడియంలో ప్రేక్షకుల్లో కూడా ఒకింత ఆందోళన.. కానీ ఒక్క వ్యక్తి మాత్రం గుట్కా నములుకుంటూ తాఫీగా కూర్చున్నాడు.  ఫోన్ లో ఎవరిమీదో కోప్పడుతూ కనిపించాడు. స్టేడియంలో ఇలాంటి విచిత్ర ఘటనలపై ఓ కన్నేసి ఉంచే కెమెరామెన్ల కన్ను ఈ గుట్కా బాయ్ మీద పడింది.  ఇంకేముంది.. వీడియో కెమెరా అతడి మీద ఫోకస్ అయ్యింది.  భారీ స్క్రీన్ మీద అతడు ప్రత్యక్షమయ్యాడు. గతంలో అయితే ఇది పెద్దగా పట్టించుకోకపోయేవాళ్లేమో. కానీ ఇది  సోషల్ మీడియా యుగం. ఆ వ్యక్తి గుట్కా తింటున్న ఫోటో, వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి. 

కట్ చేస్తే..  కాన్పూర్ టెస్టు రెండో రోజు.. అదే గుట్కా బాయ్ ఈసారి రూటు మార్చాడు.  ఓ కాగితం మీద ‘గుట్కా తినొద్దు.. అది  ఆరోగ్యానికి హానికరం..’ అని రాసి ఉన్న ఫ్లకార్డు పట్టుకుని కనిపించాడు. అదేంటి..? అంతలోనే ఇంత మార్పా..? అసలేం జరిగింది..? 

 

Things you'll only see in Kanpur stadium pic.twitter.com/R0XKQlbzp3

— Aishwarya (@AishIdiot)

అసలు విషయానికొస్తే.. కాన్పూర్ టెస్టు తొలి రోజు ట్విట్టర్ లో వైరల్ అయిన ఇతగాడి పేరు శోభిత్ పాండే. తన  సోదరితో కలిసి క్రికెట్ చూడటానికి వచ్చిన అతడు నోట్లో ఏదో నములుతుండగా కెమెరాలు అతడి వంక తిరిగాయి. అయితే అది గుట్కానే అని, స్టేడియంలోకి  గుట్కా, పాన్ వంటివి ఎలా అనుమతించారని సోషల్ మీడియాలో ప్రశ్నలు తలెత్తాయి. కానీ దీనిపై అతడు వివరణ ఇచ్చాడు. తాను తిన్నది గుట్కా కాదని, తన సోదరి ఇచ్చిన స్వీట్ బెటెల్ నట్ (మీటీ సుపారి.. స్వీట్ పాన్ వంటిది) తిన్నానని తెలిపాడు. 

 

We all grew up ! pic.twitter.com/F31kuzYVKy

— Varad Ralegaonkar (@varadr_tistic)

మరుసటి రోజు గ్రౌండ్ కు వచ్చిన అతడు.. గుట్కా తినొద్దు అని ఫ్లకార్డు ప్రదర్శించాడు. అయితే రెండ్రోజుల్లో పాండే ఫోటోలు, వీడియోలు మాత్రం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. చాలా మంది  ట్రోలర్లు వీటికి మీమ్స్ క్రియేట్ చేసి ఫన్ పంచారు. 

ఇదిలాఉండగా..  కాన్పూర్ లో న్యూజిలాండ్ తో జరగుతున్న తొలి టెస్టులో కివీస్ పట్టు బిగిస్తున్నది. తొలి ఇన్నింగ్స్ లో ఆ జట్టు 86 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. లంచ్ బ్రేక్ కు ముందు ఉమేశ్ యాదవ్.. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు.  అంతకముందు ప్రమాదకరంగా పరిణమిస్తున్న ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అశ్విన్ విడదీశాడు. విల్ యంగ్ (89) ను ఔట్ చేసి 151 పరుగుల తొలి వికెట్  పార్ట్నర్షిప్ కు చెక్ పెట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 345 పరుగులు చేసిన విషయం తెలిసిందే. 

click me!