రంజీ సెమీస్ లో బోల్తా కొట్టిన డిఫెండింగ్ ఛాంపియన్.. ఫైనల్లో బెంగాల్ వర్సెస్ సౌరాష్ట్ర

Published : Feb 12, 2023, 04:14 PM IST
రంజీ సెమీస్ లో బోల్తా కొట్టిన డిఫెండింగ్ ఛాంపియన్.. ఫైనల్లో  బెంగాల్  వర్సెస్ సౌరాష్ట్ర

సారాంశం

Ranji Trophy:  ఈ సీజన్ లో భాగంగా  ముగిసిన  తొలి సెమీస్ లో బెంగాల్.. మధ్యప్రదేశ్ టీమ్ పై  306 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.  మరో సెమీస్ లో  కర్నాటక జట్టు పై సౌరాష్ట్ర నాలుగు వికెట్ల తేడాతో నెగ్గి  ఫైనల్ కు చేరింది. 

దేశవాళీ క్రికెట్ లో భాగంగా జరుగుతున్న రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ లో   డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ కు  బెంగాల్  రంజీ టీమ్  షాకిచ్చింది.  ఈ సీజన్ తొలి సెమీస్ లో భాగంగా  ముగిసిన  తొలి సెమీస్ లో బెంగాల్.. మధ్యప్రదేశ్ టీమ్ పై  306 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.   మరో సెమీస్ లో  కర్నాటక జట్టు పై సౌరాష్ట్ర నాలుగు వికెట్ల తేడాతో నెగ్గి  ఫైనల్ కు చేరింది. 

ఇండోర్ లోని హోల్కర్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మధ్యప్రదేశ్ - బెంగాల్  తొలి  సెమీస్ మ్యాచ్ లో  ఫస్ట్ ఇన్నింగ్స్ లో   బెంగాల్ టీమ్ 438 పరుగులకు ఆలౌట్ అయింది.  ఆ జట్టులో సుదీప్  ఘరమి  (112), ఎ.మజుందార్ (120) లు సెంచరీలు చేశారు. బెంగాల్ క్రీడా మంత్రి, ఆ టీమ్ కెప్టెన్ గా ఉన్న మనోజ్ తివారి  42 రన్స్ చేశాడు. బదులుగా మధ్యప్రదేశ్.. 170 పరుగులకే ఆలౌట్ అయింది.  

బెంగాల్ బౌలర్,  ఐపీఎల్ లో  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడే  ఆకాశ్ దీప్ ఐదు వికెట్లతో చెలరేగాడు. రెండో ఇన్నింగ్స్ లో బెంగాల్.. 279 పరుగులకు ఆలౌట్ అయింది.  547 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో  మధ్యప్రదేశ్..   251 పరుగులు మాత్రమే చేయగలిగింది.  ఆ జట్టులో రజత్ పాటిదార్  (52) ఒక్కడే రాణించాడు.  

 

సౌరాష్ట్ర  ఫైనల్ కు.. 

రెండో సెమీస్ లో  కర్నాటక  పోరాడి ఓడింది.   బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో  తొలుత బ్యాటింగ్ చేసిన కర్నాటక.. మొదటి ఇన్నింగ్స్ లో  407 పరుగులకు ఆలౌట్ అయింది.  ఆ జట్టు సారథి  మయాంక్ అగర్వాల్  డబుల్ సెంచరీ (249) తో చెలరేగిన విషయం తెలిసిందే. అయితే  దానికి  సౌరాష్ట్ర కూడా ధీటుగానే బదులిచ్చింది.    తొలి ఇన్నింగ్స్ లో  సౌరాష్ట్ర.. 527 రన్స్ చేసింది.    సౌరాష్ట్ర సారథి  అర్పిత్ వసవడ  (202) డబుల్ సెంచరీ చేయగా  జాక్సన్ సెంచరీ (160) చేశాడు. 

అనంతరం కర్నాటక రెండో ఇన్నింగ్స్ లో  234 రన్స్ కే ఆలౌట్ అయింది.  ఆ తర్వాత లక్ష్యాన్ని  సౌరాష్ట్ర  ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది.  116 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో  సౌరాష్ట్ర.. కీలక వికెట్లు కోల్పోయినా అర్పిత్ (47) తో పాటు చేతన్ సకారియా (24) లు  నిలిచి  ఆ జట్టుకు విజయాన్ని అందించారు. 

ఫైనల్ కు చేరిన బెంగాల్ - సౌరాష్ట్ర లు  ఈనెల 16 నుంచి  తుది పోరులో తలపడతాయి.  బెంగాల్ కు రంజీలలో ఫైనల్ చేరడం ఇది 15వ సారి.  కానీ రెండు సార్లు మాత్రమే ఆ జట్టు  కప్ కొట్టింది. 12 సార్లు  రన్నరప్ గానే నిలిచింది.  మరి త్వరలో రాబోయే ఫైనల్ లో అయినా బెంగాల్ క్రీడా మంత్రి  ఆ జట్టుకు ట్రోఫీని అందిస్తాడా..? అన్నది ఆసక్తికరంగా మారింది. 

PREV
click me!

Recommended Stories

IND vs SA : వైజాగ్‌లో దబిడి దిబిడే.. భారత్‌ జట్టులో భారీ మార్పులు.. పిచ్ రిపోర్టు ఇదే
IPL 2026 : దిమ్మతిరిగే ప్లాన్ తో ముంబై ఇండియన్స్.. ముంచెస్తారా !