శాంతాక్రూజ్ గ్రౌండ్ మూసివేత.. ముంబైలో యువ క్రికెటర్లకు ఇక తిప్పలే..

Published : Jul 15, 2022, 01:17 PM IST
శాంతాక్రూజ్ గ్రౌండ్ మూసివేత.. ముంబైలో యువ క్రికెటర్లకు ఇక తిప్పలే..

సారాంశం

Air India Ground: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఉన్న ప్రఖ్యాత శాంటాక్రూజ్ గ్రౌండ్ ను అదానీ ఎయిర్ పోర్ట్  హోల్డింగ్స్ లిమిటెడ్ (ఏఏహెచ్ఎల్) స్వాధీనం చేసుకుంది. 

భారత క్రికెట్ కు ముంబైకి అవినాభావ సంబంధముంది. సునీల్ గవాస్కర్ నుంచి మొదలు సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి, దిలీప్ వెంగసర్కార్, వసీం జాఫర్ వంటి నాటి తరం ఆటగాళ్లే గాక రోహిత్ శర్మ, అజింక్యా రహానే వంటి నేటితరం  బ్యాటర్లు కూడా దేశ ఆర్థిక రాజధాని నుంచి వచ్చినవారే. వీరికి కొనసాగింపుగా  రాబోయే  తరం పృథ్వీ షా,  శివమ్ దూబే, యశస్వి జైస్వాల్ కూడా ముంబై వాసులే. రోహిత్ శర్మ నుంచి మొదలు  నేటి జైస్వాల్, శివమ్ ధూబే వంటి ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసిన శాంతాక్రూజ్ గ్రౌండ్ త్వరలోనే క్రికెటర్లకు అందుబాటులో లేకుండా పోతోంది. 

ఎయిరిండియా గ్రౌండ్ గా పేరున్న ఈ గ్రౌండ్.. గతంలో ముంబై ఇంటర్నేషనల్ లిమిటెడ్  (ఎంఐఎఎల్) పేరిట ఉండేది.  కానీ  ఎయిర్ పోర్టులు ప్రైవేట్ పరం కావడంతో   ప్రస్తుతం  ఎంఐఎఎల్ ను అదానీకి చెందిన  అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ (ఎఎహెచ్ఎల్)స్వాధీనంలోకి వచ్చింది. 

దీంతో ఇటీవలే ఆ గ్రౌండ్ లోకి ఇక క్రికెట్ తో పాటు ఇతర ఆటలు ప్రాక్టీస్ చేసుకోవడానికి వచ్చే ఆటగాళ్లందరికీ అక్కడికి రావొద్దని, దానిని మూసేస్తున్నామని గ్రౌండ్ నిర్వాహకులు తెలిపారు.  ఎయిరిండియా గ్రౌండ్ లో  సుమారు 62 నెట్స్ ఉన్నాయి.  రోజుకు వందలాది మంది క్రికెటర్లు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటారు. క్రికెటర్లతో పాటు షూటింగ్, టెన్నిస్ , ఇతర ఆటలు ఆడే  ఆటగాళ్లు కూడా శాంటాక్రూజ్ లో ప్రాక్టీస్  చేసుకోవడానికి వచ్చేవారు.  కానీ గ్రౌండ్  నిర్వాహకుల తాజా ఆదేశాలతో ఔత్సాహిక  క్రీడాకారులకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. 

భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్  ఈ గ్రౌండ్ ను మూసేయడంపై ఆవేదన వ్యక్తం చేశాడు.  అతడు మాట్లాడుతూ.. ‘పృథ్వీ షా,  యశస్వి జైస్వాల్, శివమ్ దూబే వంటి ఆటగాళ్లు ఇక్కడే క్రికెట్ లో ఓనమాలు నేర్చుకున్నారు. వీరితో పాటు చాలామంది యువ  క్రికెటర్లు రోజూ ఇక్కడ నెట్స్ లో ప్రాక్టీస్  చేసుకోవడానికి వస్తారు. భావి క్రికెటర్లకు ఇది వారధిలా ఉండేది. కానీ ఇప్పుడు దీనిని మూసివేస్తుండటంతో వాళ్లకు ఓ  అండ కోల్పోయినట్టుగా అయింది..’ అని అన్నాడు.

ఇదే విషయమై ఎయిరిండియా మాజీ పేసర్  అషుతోష్ దూబే మాట్లాడుతూ..  ‘ఇక్కడ 62 నెట్స్  ఉన్నాయి. ప్రతిరోజు వందలాది మంది క్రికెటర్లు ఇక్కడికి  ప్రాక్టీస్ కోసం  వస్తుంటారు. క్రికెట్ ఒక్కటే  గాక టెన్నిస్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, షూటింగ్ ఆడేందుకు కూడా ఇక్కడ వసతులున్నాయి. ఈ గ్రౌండ్ ముంబైలోని వెస్టర్న్, సెంట్రల్ సబర్బన్ ప్రజలకు వారధిగా  ఉండేది. గతంలో శ్రీలంక మాజీ  పేసర్ చమిందా వాస్ కూడా  ఇక్కడ  బౌలర్లకు  కోచింగ్ ఇచ్చేవాడు..’అని తెలిపాడు. 

ఇక్కడే క్రికెట్ అకాడమీ నిర్వహిస్తున్న జ్వాలా సింగ్ అనే కోచ్  మాట్లాడుతూ.. ‘నాకు  సిటీలో ఇతర చోట్ల కూడా కోచింగ్ కేంద్రాలున్నాయి. చాలా మంది కోచ్ లు ఇక్కడే వారి  విద్యార్థులకు క్రికెట్ పాఠాలు చెబుతారు. క్రికెట్  ఒక్కటే కాదు. మా జీవితాలతో కూడా ఈ గ్రౌండ్ కు అవినాభావ సంబంధముంది..’ అని చెప్పాడు. 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !