
‘ది ఓవల్’ లో కలిగిన పరాభవానికి ఇంగ్లాండ్ ‘లార్డ్స్’ లో బదులుతీర్చుకుంది. తొలి వన్డేలో భారత బౌలింగ్ లో దెబ్బతిన్న ఇంగ్లాండ్.. అదే బౌలింగ్ తో రోహిత్ సేనను కోలుకోలేని దెబ్బతీసింది. తొలి వన్డేలో గెలిచిన అత్యుత్సాహమో లేక నిర్లక్ష్యమో గానీ భారత టాపార్డర్ ఈ మ్యాచ్ లో దారుణంగా విఫలమైంది. అంతగా అనుభవం లేని ఇంగ్లాండ్ పేసర్లకు దాసోహమంది. ప్రత్యర్థి జట్టును ముందు బౌలింగ్ లో 246 పరుగులకే కట్టడి చేసిన భారత జట్టు.. ఆతర్వాత ఆ మాత్రం స్కోరు చేయడానికి నానా తంటాలు పడింది. 38.5 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా ఇంగ్లాండ్.. వంద పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇక ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. 49 ఓవర్లలో246 పరుగులకే ఆలౌట్ అయింది. టాపార్డార్ విఫలమైనా మోయిన్ అలీ (47), డేవిడ్ విల్లీ (41), లివింగ్ స్టోన్ (33) పోరాడటంతో ఇంగ్లాండ్ ఆ మాత్రమైనా స్కోరు చేసింది.
అయితే తమ టెయిలెండర్ల పోరాటానికి ఇంగ్లాండ్ బౌలర్లు సార్థకత చేకూర్చారు. పట్టుదలగా ఆడిన వారి కష్టాన్ని వృథాగా పోనీయకుండా కట్టుదిట్టమైన బౌలింగ్ తో కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ తో టీమిండియాను బోల్తా కొట్టించారు. ముఖ్యంగా ఆ జట్టు బౌలర్ రీస్ టాప్లీ.. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సూర్యకుమార్ యాదవ్ లను ఔట్ చేసి భారత ‘టాప్’ లేపగా.. డేవిడ్ విల్లీ, బ్రైడన్ కార్స్, మోయిన్ అలీలు అతడికి అండగా నిలిచారు.
247 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ కు ఆది నుంచే ఎదురుదెబ్బలు తాకాయి. తొలి రెండు ఓవర్లలో పరుగులే రాలేదు. మూడో ఓవర్లో లెగ్ బై ద్వారా 4 పరుగులొచ్చాయి. కానీ అదే ఓవర్లో రోహిత్ శర్మ (0) టాప్లీ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 5 ఓవర్లకు భారత్ స్కోరు 10 పరుగులే. క్రీజులో తంటాలు పడుతున్న ధావన్ (9)కూడా టాప్లీ బౌలింగ్ లో వికెట్ కీపర్ జోస్ బట్లర్ క్యాచ్ పట్టడం ద్వారా పెవిలియన్ చేరాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన రిషభ్ పంత్ (0)కూడా బ్రైడన్ కార్స్ వేసిన 11 ఓవర్లో రెండో బంతికి ఫిలిప్ సాల్ట్ ఇచ్చి వెనుదిరిగాడు.
భారత అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ (16.. 3 ఫోర్లు) కూడా వారి ఆశల మీద నీళ్లుచల్లాడు. మూడు బౌండరీలతో కుదురుకున్నట్టే కనిపించిన కోహ్లీని విల్లే బోల్తా కొట్టించాడు. 12 ఓవర్లో రెండో బంతికి కోహ్లి పెవిలియన్ చేరాడు. 31పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.
ఆ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ (29 బంతుల్లో 27..1 ఫోర్, 1 సిక్స్), హార్ధిక్ పాండ్యా (44 బంతుల్లో 29.. 1ఫోర్, 1 సిక్సర్)లు ఐదో వికెట్ కు 42 పరుగులు జోడించారు. కానీ టాప్లీ మళ్లీ భారత్ ను దెబ్బకొట్టాడు. అతడు వేసిన 20 ఓవర్లోరెండో బంతిని సూర్యకుమార్ వికెట్ల మీదకు ఆడుకుని నిష్క్రమించాడు. ఆ తర్వాత జడేజా (44 బంతుల్లో 23.. 2 ఫోర్లు, 1సిక్స్) తో జతకలిసిన పాండ్యా.. ఆరో వికెట్ కు 32 పరుగులు జతచేశాడు. కానీ మోయిన్ అలీ వేసిన 27 ఓవర్లో తొలిబంతికి పాండ్యా.. లివింగ్ స్టోన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఇక ఆ తర్వాత వచ్చిన మహ్మద్ షమీ (28 బంతుల్లో 23.. 2 ఫోర్లు, 1 సిక్స్) కాసేపు మెరుపులు మెరిపించాడు. అయితే ఆ మెరుపులు అభిమానులు అలరించాయే తప్ప భారత్ కు విజయాన్ని అందించలేదు. 34 ఓవర్లో ఆఖరి బంతికి షమీని టాప్లీ ఔట్ చేశాడు. ఆ తర్వాత ఓవర్లో లివింగ్ స్టోన్.. జడేజాను బౌల్డ్ చేశాడు. ఇక ఆతర్వాత భారత ఇన్నింగ్స్ లో చెప్పుకోవడానికేం లేదు. ఆ తర్వాత చాహల్, ప్రసిధ్ లను కూడా కూడా టాప్లీ కే వికెట్ ఇచ్చుకున్నారు.
ఇంగ్లాండ్ బౌలర్లలో టాప్లీ 6 వికెట్లు తీయగా డేవిడ్ విల్లే, బ్రైడన్ కార్స్, మోయిన్ అలీ, లివింగ్ స్టోన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ విజయంతో మూడు మ్యాచుల సిరీస్ నుఇంగ్లాండ్ 1-1 తేడాతో సమం చేసింది. సిరీస్ లో తదుపరి, నిర్ణయాత్మక మ్యాచ్ ఆదివారం (జులై 17న) జరగనుంది.