T20 World Cup 2022: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు బంగ్లాదేశ్ ను ఓడించి సెమీస్ బెర్త్ ను ఖాయం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్ అంటే లిటన్ దాస్ ను కెఎల్ రాహుల్ రనౌట్ చేయడమే..
క్రికెట్‌లో వందలాది మ్యాచ్ లు ముగుస్తున్నా అభిమానుల స్మృతి పథం నుంచి కొన్ని మ్యాచ్ లు మాత్రం ఎప్పటికీ చెరిగిపోవు. మరీ ముఖ్యంగా లో స్కోరింగ్ థ్రిల్లర్స్ అయితే క్లాసిక్స్ గా నిలుస్తాయి. అలా నిలిచే మ్యాచ్ లు భారత్ కు బోలెడన్ని ఉన్నాయి. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో ఇలాంటి మ్యాచ్ లలో కొన్నింటిని నెగ్గింది. అందులో 2016 టీ20 ప్రపంచకప్ లో భాగంగా బెంగళూరు వేదికగా భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ కూడా ఒకటి. తాజాగా ఆస్ట్రేలియాలోని అడిలైడ్ వేదికగా ముగిసిన మ్యాచ్ లో జరిగినట్టే ఆ మ్యాచ్ లో కూడా అద్భుతాలు జరిగాయి. రెండు సార్లు ప్రత్యర్థి బంగ్లాదేశే కావడం గమనార్హం.
2016 టీ20 ప్రపంచకప్ లో భాగంగా భారత్ - బంగ్లాదేశ్ మ్యాచ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ మ్యాచ్ లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 146 పరుగులు చేసింది. బంగ్లా టార్గెట్ 147. కానీ స్వల్ప లక్ష్యాన్ని భారత్ అద్భుతంగా కాపాడుకుంది.
19వ ఓవర్ వేసిన బుమ్రా ఆరు పరుగులే ఇచ్చాడు. చివరి ఓవర్లో 11 పరుగులు చేస్తే బంగ్లాదే విజయం. చేతిలో నాలుగు వికెట్లున్నాయి. అప్పటి భారత సారథి ధోని.. పాండ్యాకు బంతినిచ్చాడు. తొలి బంతికి మహ్మదుల్లా రెండు పరుగులు తీశాడు. రెండు, మూడో బంతికి ముష్ఫీకర్ రహీమ్ రెండు బౌండరీలు బాదాడు. బంగ్లాదేశ్ కు మూడు బంతుల్లో రెండు పరుగులు కావాలి.
నాలుగో బంతికి ముష్ఫీకర్ ఔట్. తర్వాత బంతికి మహ్మదుల్లా కూడా పెవిలియన్ చేరాడు. ఆఖరి బంతికి రెండు పరుగులు కావాలి. ఒక్కటి చేస్తే టై. చివరి బంతి వేసేముందు ధోని.. పాండ్యాతో కాసేపు చర్చించి తన మాస్టర్ మైండ్ లో ఉన్న ఆలోచనలను పాండ్యా మీదకు వదిలాడు. చివరి బంతికి సింగిల్ తీసే ప్రమాదాన్ని ముందే గ్రహించిన ధోని.. కుడి చేతి గ్లవ్స్ తీసి రెడీగా ఉన్నాడు. పాండ్యా బంతి వేశాడు. క్రీజులో శువగత. ఆఫ్ స్టంప్ దిశగా వేసిన బంతని బాదుదామనుకున్నా కుదరలేదు. బంతి మిస్ అయింది. ఒక్క పరుగైనా తీద్దామని ముందుకు పరిగెత్తాడు. అవతలి ఎండ్ నుంచి ముష్ఫీకర్ రెహ్మాన్ బ్యాటింగ్ ఎండ్ కు పరుగు లంకెత్తాడు. కానీ వికెట్లకు, ధోని వికెట్ కీపింగ్ చేస్తున్న ప్లేస్ కు 13 మీటర్లు దూరం. రెండే రెండు సెకన్లలో ధోని ఆ దూరాన్ని కరిగించి బంతితో వికెట్లను గిరాటేశాడు. టీవీ రిప్లేలో ముష్ఫీకర్ ఔట్ అని తేలింది. అంతే టీమిండియా ఆటగాళ్ల సంబురాలు.
undefined
The classic MS Dhoni moment happened when India meet Bangladesh last time in the T20 World Cup. pic.twitter.com/5HJEtYSGB0
— Johns. (@CricCrazyJohns)కట్ చేస్తే..
ఇక 2022 కు వద్దాం. భారత్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ దూకుడుగా ఆడింది. ఆ జట్టు ఓపెనర్ లిటన్ దాస్ (60) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దొరికిన బంతిని దొరికినట్టుగా బాదాడు. 7 ఓవర్లకే బంగ్లా స్కోరు వికెట్ నష్టపోకుండా 66. భారత శిబిరంలో గుబులు. కానీ వరుణుడు భారత్ కు మేలు చేశాడు. వర్షం కురిసి వెలిసిన తర్వాత మ్యాచ్ ప్రారంభమైంది. అశ్విన్ 8వ ఓవర్ వేశాడు. రెండో బంతికి శాంతో డీప్ మిడ్ వికెట్ మీదుగా కొట్టాడు. ఒకటో పరుగు పూర్తయింది. రెండో పరుగు కోసం ఇద్దరూ పరిగెత్తారు. అప్పుడే బంతిని అందుకున్న కెఎల్ రాహుల్.. మిడ్ వికెట్ నుంచి నేరుగా బంతిని విసిరాడు. కళ్లు మూసి తెరిచే లోపు బంతి వికెట్లను తాకింది. లిటన్ దాస్ ఔట్. అంతే మ్యాచ్ భారత్ వైపునకు తిరిగింది. దాస్ నిష్క్రమణతో బంగ్లా ఒత్తిడితో చిత్తై గెలవాల్సిన మ్యాచ్ ను చేజేతులా పాడుచేసుకుంది.
Litton Das run out. That's it, that's the tweet. pic.twitter.com/QrEAXrC6Yt
— Rai M. Azlan (@Mussanaf)ఇక ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో అప్పటి ధోని రనౌట్ చేసిన వీడియో, ఫోటోలు.. తాజాగా లిటన్ దాస్ రనౌట్ అయినప్పటి దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇదే విషయమై నెటిజన్లు.. ‘సేమ్ సీన్ రిపీటెడ్..’ అని కామెంట్స్ పెడుతున్నారు.