
దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) ఆధ్వర్యంలో బెంగళూరు వేదికగా జరుగుతున్న శాఫ్ ఛాంపియన్‌షిప్ - 2023 లో భారత ఫుట్‌బాల్ జట్టు సెమీఫైనల్ లోకి ప్రవేశించింది. లీగ్ దశలో తొలుత పాకిస్తాన్ ను 4-0తో చిత్తు చేసిన భారత్.. శనివారం నేపాల్ తో ముగిసన మ్యాచ్ లో నేపాల్ ను కూడా ఓడించింది. ఇండియా కెప్టెన్ సునీల్ ఛెత్రి మరోసారి మెరవడంతో భారత్.. 2-0 తేడాతో నేపాల్ ను ఓడించి సెమీస్ కు చేరుకుంది.
గ్రూప్-ఎ లో భాగంగా శనివారం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో ఫస్టాఫ్ లో ఇరు జట్లూ గోల్స్ చేయలేకపోయాయి. నేపాల్ టీమ్ గోల్స్ కోసం ప్రయత్నించినా విఫలమయ్యారు. కానీ వాళ్లు భారత ఆటగాళ్లను గోల్స్ కొట్టనీయకుండా సమర్థవంతంగా అడ్డుకున్నారు. తొలి అర్థభాగంలో ఇరు జట్లు ఒక్క గోల్ కూడా నమోదుచేయలేకపోయాయి.
కానీ ఆట సెకండాఫ్ లో భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి ఇండియాకు బ్రేక్ ఇచ్చాడు. ఆట 61వ నిమిషంలో అతడు ఛెత్రి తొలి గోల్ కొట్టగా 70వ నిమిషంలో నోరెమ్ మహేశ్ సింగ్ రెండో గోల్ చేశాడు. ఆ తర్వాత నేపాల్.. గోల్ చేసే యత్నాలను భారత ఆటగాళ్లు సమర్థవంతంగా అడ్డుకున్నారు. దీంతో నేపాల్ కు నిరాశ తప్పలేదు.
ఈ విజయంతో భారత్ శాఫ్ ఛాంపియన్‌షిప్ లో సెమీస్ కు చేరింది. మరోవైపు తొలి మ్యాచ్ లో భారత్ చేతిలో ఓడిన పాకిస్తాన్.. శనివారం ఇదే గ్రూపులో ఉన్న కువైట్ తో ఆడిన మ్యాచ్ లో ఓడింది. దీంతో రెండు ఓటములతో ఆ జట్టు ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత జట్టు ఈనెల 27న కువైట్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు గ్రూప్ టాపర్ గా నిలుస్తుంది. కాగా భారత్ కు ఇది వరుసగా 12వ విజయం కావడం గమనార్హం.