
ఏదైనా ఒక విషయం జనాలకు చెప్పేముందు దానిని మనం పాటించితీరాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు, ప్రముఖులు, సమాజంలో పేరుగాంచినవాళ్లు ఒక విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లే క్రమంలో దానిని తూచా తప్పకుండా పాటిస్తేనే అది జనంలోకి వెళ్తుంది. అలాకాకుండా చెప్పేదొకటి చేసేదొకటి అయితే అది మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా అదే ఇబ్బందుల్లో పడ్డాడు. మాస్టర్ బ్లాస్టర్ తాజాగా షేర్ చేసిన ఓ వీడియోలో.. తన బ్యాట్ గ్రిప్ ను కడుగుతూ నీటిని వృథా చేశాడు. దీంతో నెటిజన్లు సచిన్ కు సున్నితంగా చురకలంటిస్తున్నారు.
అసలు విషయానికొస్తే.. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ సీజన్-2 లో భాగంగా సచిన్ టెండూల్కర్ తన బ్యాట్ హ్యాండిల్ ను కడుగుతున్న వీడియోను షేర్ చేశాడు. ‘బ్యాట్స్ అండ్ మ్యూజిక్.. లైఫ్ టైమ్ కాంబో..’ అని రాసుకొస్తూ షేర్ చేసిన ఈ వీడియోలో.. బ్యాట్ హ్యాండిల్ కడగడం కోసం ట్యాప్ తిప్పి అలాగే ఉంచాడు. బ్యాట్ కడుగుతున్నంతవరకూ ట్యాప్ లో నీరు కారుతూనే ఉంది. చివర్లో ‘ఇలాంటి విషయాలు ఎవరూ చెప్పరు’ అని కూడా క్యాప్షన్ జతచేశాడు.
ఇప్పుడిదే వీడియోపై నెటిజన్లు సచిన్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సచిన్ చెప్పేదొకటి చేసేదొకటా..? అని ప్రశ్నిస్తున్నారు. ముంబై సివిక్ బాడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సేవ్ వాటర్’ క్యాంపెయిన్ కు సచిన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. ఈ క్యాంపెయిన్ లో భాగంగా సచిన్ గతంలో ఓ వీడియోలో.. ‘నీటిని వృథా చేయకండి’ అని యాడ్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు సచిన్ మాత్రం నీటిని వృథా చేస్తూ కనిపించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదే విషయమై ట్విటర్ వేదికగా పలువురు యూజర్లు స్పందిస్తూ.. ‘సేవ్ వాటర్ సచిన్ సార్..’, ‘నీటిని వృథా చేయకండి సచిన్ పాజీ’, ‘సర్ మీరు సేవ్ వాటర్ క్యాంపెయిన్ కు బ్రాండ్ అంబాసిడర్. ఆ విషయం మరిచిపోయినట్టున్నారు..’ అని సున్నితంగా చురకలంటిస్తున్నారు. పలువురు నెటిజన్లు.. సచిన్ షేర్ చేసిన ఈ వీడియో కింద ‘సేవ్ వాటర్’ వీడియోను పోస్టు చేస్తుండటం గమనార్హం.